శూన్యం నుంచి త్రిపురలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన భాజపా ఇప్పుడా పీఠాన్ని నిలబెట్టుకోవటానికి కష్టపడుతోంది. ఐదేళ్ల కిందట కమ్యూనిస్టు కోటను కూల్చిన కమలనాథులకు ఈసారి త్రిపురాధీశుడు ప్రద్యోత్‌దేవ్ వర్మ రూపంలో గట్టిపోటీ ఎదురవుతోంది. త్రిపుర ఎన్నికల్లో అందరి కళ్లూ ఇప్పుడు ఆయన పార్టీ తిప్రా మోథాపైనే! ఈ తిప్రా కారణంగా త్రిపుర ఎన్నికలు త్రిముఖ సమరంగా మారాయి.
మొఘలాయిలనూ ఓడించిన తెగలు
తిప్రా అంటే త్రిపుర స్థానిక తెగల సమూహం. త్రిపుర రాజ్యాన్ని మాణిక్య వంశం పాలించేది. ఒకదశలో మొఘల్స్‌ను కూడా ఓడించిన ఈ తెగలు ఈశాన్య భారతంలోని త్రిపుర నుంచి ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ దాకా విస్తరించాయి. భారత్‌పై బ్రిటిష్ పెత్తనం మొదలయ్యే దాకా చిట్టగాంగ్‌లోని కొన్ని ప్రాంతాలు వీరి పాలనలోనే భాగంగా ఉండేవి. 18వ శతాబ్దం తర్వాత త్రిపుర మైదాన ప్రాంతం ఆంగ్లేయుల పాలనలోకి వెళ్లింది. పర్వత ప్రాంతం (ప్రస్తుత త్రిపుర) మాణిక్య సంస్థానంగా మారింది.
స్వాతంత్య్రానంతరం ఇది భారత్‌లో భాగమై త్రిపుర రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ, సామాజిక పరిణామాలతో బంగ్లాదేశ్, అస్సాం, బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు త్రిపురలో వచ్చి స్థిరపడ్డారు. దీంతో త్రిపుర జనాభా నిష్పత్తిలో మార్పులొచ్చాయి. త్రిపుర మాది అనుకునే తిప్రా తెగలు తమ రాజ్యంలోనే తాము వెలివేతకు గురైనట్లు భావించటం ఆరంభించారు. ఈ ఆదివాసీల మద్దతుతో ఐపీఎఫ్‌టీ (ఇండిజినియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) ఏర్పడింది.
స్వయంప్రతిపత్తి మండళ్లలో సత్తా చాటారు
గత ఎన్నికల్లో ఈ ఐపీఎఫ్‌టీతో భాజపా పొత్తుపెట్టుకుంది. అంతకుముందు వరకూ త్రిపుర అసెంబ్లీలో ఒక్కసీటు కూడా లేని కమలనాథులు ఐపీటీఎఫ్ అండతో ఏకంగా అధికారంలోకి వచ్చేశారు. ఆ తర్వాత వీరి స్నేహానికి గండిపడి బలహీనపడింది. అయితే ఈలోపు త్రిపుర రాజకీయాల్లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అదే... తిప్రా మోథా ఆవిర్భావం. మాణిక్య రాజవంశానికి చెందిన 45 సంవత్సరాల ప్రద్యోత్ విక్రమ్ వర్మ సారథ్యంలో ఏర్పడ్డ ఈ పార్టీ రాకతో ఆదివాసీలపై ఐపీఎఫ్‌టీ ప్రాబల్యం తగ్గింది.