విషవాయువులకు నెలవులైన మ్యాన్‌హోళ్లలోకి దిగుతున్న పారిశుద్ధ్య కార్మికుల(sanitation workers) వెతలు ఆందోళన కలిగిస్తున్నాయి. దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తూ దేశంలో ప్రతి అయిదు రోజులకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందుతున్నట్లు గతంలోనే వెలుగుచూసింది. దాదాపు 90శాతం కార్మికులకు ఆరోగ్య బీమా(Health insurance) లేదు. చాలా మంది కార్మికులకు అసలు ఉద్యోగ భద్రతే లేదు. ఒప్పంద కార్మికులుగా రోజువారీ వేతనాలకు పనిచేస్తున్న వారే అధికంగా ఉన్నారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలకు లోనైన సందర్భాల్లో అత్యవసర వైద్యసౌకర్యాలూ అంతగా అందడం లేదు.
తరచుగా..
సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేస్తూ ఊపిరి ఆడక చనిపోయిన, మ్యాన్‌హోల్‌లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు తరచూ చోటుచేసుకొంటున్నాయి. హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలో ఇటీవల మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసే క్రమంలో ఇద్దరు దళిత పారిశుద్ధ్య కార్మికులు మరణించారు. హైదరాబాద్‌లో మ్యాన్‌హోళ్లను శుభ్రపరచడానికి అత్యాధునిక రోబోటిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని అధికార యంత్రాంగం రెండేళ్ల క్రితమే ప్రకటించింది.
శేరిలింగంపల్లి జోన్‌లో అప్పట్లో ఈ పరికరాలను జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు వినియోగంలోకి తెచ్చారు. మ్యాన్‌హోల్‌లో 30 అడుగుల లోతు వరకు ఈ పరికరం వెళ్ళి శుభ్రం చేస్తుందని ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో 30 వేలకు పైగా మ్యాన్‌హోల్స్ ఉన్నాయి. మనుషుల ప్రమేయం లేకుండానే వాటిని శుభ్రం చేసేందుకు ఈ ఆధునిక పరికరాలు అక్కరకొస్తాయని అధికారులు పేర్కొన్నారు. కానీ, కార్మికుల వినియోగం ఆగలేదు. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో నిత్యం ఏదో ఒక చోట కార్మికులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. సఫాయీ కార్మికుల సంరక్షణ, పునరావాసం కోసం 2013లో ప్రత్యేక చట్టం అమలులోకి వచ్చింది. అయినా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవడం లేదనడానికి హైదరాబాద్‌లో తాజా దుర్ఘటనే నిదర్శనం!
ఒకే సామాజిక వర్గం వారు..
దేశవ్యాప్తంగా అధిక శాతం ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పారిశుద్ధ్య వృత్తిలో మగ్గిపోతున్నారు. సామాజిక అంతరాలు, పేదరికం తదితరాలతో అణగారిన వర్గాల వారు మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతా మంత్రిత్వ శాఖ 18 రాష్ట్రాల్లో మూడేళ్ల క్రితం చేపట్టిన ఓ సర్వేలో 42 వేల మందికి పైగా పారిశుద్ధ్య పనుల్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే, దేశంలోని 718 జిల్లాల్లో కేవలం 178 జిల్లాల్లోనే ఈ పరిశోధన చేపట్టారు. విస్తృత స్థాయిలో సర్వే చేస్తేనే ఈ అమానవీయ వృత్తిలో ఎందరు కునారిల్లుతున్నారో వెలుగులోకి వస్తుంది.