ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం.. సామాన్యులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దేశంలో గూడుకట్టుకుంటున్న ప్రజాగ్రహాన్ని జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల అస్త్రంగా తనకు అనుకూలంగా మలచుకోలేకపోతోంది. నాయకత్వ లోపం, పార్టీ రాష్ట్ర శాఖల్లో కుమ్ములాటలు ఆ పార్టీని బలహీనపరుస్తున్నాయి. దాంతో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఇంకా మిగిలి ఉన్న కొద్దోగొప్పో ఓటు బ్యాంకులను డీఎంకే, వైసీపీ, టీఆర్‌ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వంటి లౌకికవాద, ప్రాంతీయ పార్టీలు చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వీటన్నింటిలోకి టీఎంసీ ఎక్కువ లబ్ధి పొందగల (tmc latest news) స్థితిలో ఉంది. స్వరాష్ట్రం పశ్చిమ్ బంగతోపాటు గోవా, త్రిపుర, ఈశాన్య రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓట్లను తన ఖాతాలో వేసుకొనే అవకాశాలు టీఎంసీకి ఉన్నాయి. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాదేవ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, మాజీ ఎంపీ అభిజిత్, గోవా మాజీ ముఖ్యమంత్రి లూయిజినో ఫెలీరో టీఎంసీలో చేరారు. త్వరలో జరగనున్న గోవా ఎన్నికల కోసం టీఎంసీ అధినేత మమతా బెనర్జీ స్వయంగా ప్రచారం చేయనున్నారు. త్వరలోనే యూపీలోనూ పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కొత్త శక్తినందించాలని ప్రియాంకా గాంధీ శ్రమిస్తున్నా- ఇప్పటికే అక్కడి ఇద్దరు సీనియర్ నేతలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్‌కు గండి
ఇటీవల పశ్చిమ్ బంగ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ద్వారా భారతీయ జనతా పార్టీని నిలువరించగల ఏకైక లౌకిక పార్టీ తానేనని టీఎంసీ (tmc election strategy) గట్టి సంకేతాలు ఇచ్చింది. ఆ రాష్ట్రంలో 2016 ఎన్నికల్లో 12.25శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతం 2021 ఎన్నికలకు వచ్చేసరికి 3.03శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లు టీఎంసీ ఖాతాలోకి చేరాయి. గతంలో 44 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఈసారి ఒక్క సీటునూ రాబట్టుకోలేకపోయింది. బెంగాల్ జనాభాలో 30శాతం ఉన్న ముస్లిముల ఓట్లు కాంగ్రెస్ నుంచి టీఎంసీకి బదిలీ అయ్యాయి. భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాలనే విషయంలో ప్రతిపక్షాలు ఏకీభవిస్తున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాహుల్ గాంధీ చొరవతో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు టీఎంసీ దూరంగా ఉండిపోయింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సత్తా రాహుల్‌గాంధీకి లేదని మమత కోల్‌కతాలో వ్యాఖ్యానించారు. ఆ అర్హత తనకే ఉందని ఆమె భావిస్తున్నారన్నది సుస్పష్టం. ఈ విషయంలో రాహుల్ కన్నా మమతకు ఎక్కువ అనుకూలాంశాలు ఉన్న మాట నిజం. ప్రధాని నరేంద్ర మోదీ తరహాలో మమతసైతం సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. బెంగాల్‌లో 34 ఏళ్ల వామపక్ష పాలనను ఎదిరించి నెగ్గిన చరిత్ర ఆమెది. తరవాత మోదీ-అమిత్ షా ద్వయాన్నీ ఎదుర్కొని ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్నారు. తద్వారా మోదీ తరవాత దేశ నాయకత్వం చేపట్టే సత్తా తనకే ఉందని మమత విశ్వసిస్తున్నారు. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ శాఖల్లో సోనియా కుటుంబ నాయకత్వ తీరుపై అసంతృప్తి గూడుకట్టుకున్న నేతలు చాలా మంది ఉన్నారు. లౌకిక వాదానికి కట్టుబడి వారంతా భాజపాలో చేరలేరు. మోదీ-షాలపై విరుచుకుపడే టీఎంసీ వైపు వారు సహజంగానే ఆకర్షితులవుతారు. మైనారిటీ ఓట్లు టీఎంసీకి పడే అవకాశాలూ ఎక్కువే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఎదిరించే శక్తి కాంగ్రెస్‌కు కాకుండా టీఎంసీకే ఉందనే అభిప్రాయం మైనారిటీలలో బలపడిన కొద్దీ కాంగ్రెస్ నుంచి టీఎంసీలోకి వలసలు పెరగవచ్చు. దీనివల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే అది భాజపాకే ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది! బెంగాల్‌ను దాటి ఇతర రాష్ట్రాల్లో పాగా వేయడానికి మమత ప్రయత్నిస్తే- అది కాంగ్రెస్ ఓటు బ్యాంకులకు గండికొట్టి తనకు లబ్ధి చేకూరుస్తుందని భాజపా సంబరపడుతోంది. మమత మిత్రురాలు రూపంలో ఉన్న శత్రువు అని, ప్రతిపక్ష శిబిరాన్ని బలహీనపరచి భాజపాకు లబ్ధి చేకూర్చే ప్రత్యర్థి అని కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించారు. ఆయన బెంగాల్ రాజకీయాల్లో మమతకు ప్రధాన ప్రత్యర్థి.
వాటిపైనే గురి