రేపటి డిజిటల్ ప్రపంచంలో నెగ్గుకురావడానికి 5జి, 6జి మొబైల్ టెలికమ్యూనికేషన్ యంత్రాంగాలు కీలకం కానున్నాయి. సమాచారం కాంతి వేగంతో పయనిస్తేనే హైటెక్ ఆర్థిక వ్యవస్థ ముందుకు ఉరుకుతుంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన చైనా 2015లో తన బెల్ట్ అండ్ రోడ్ (బీఆర్‌ఐ) పథకంలో అంతర్భాగంగా డిజిటల్ సిల్క్ రోడ్ (డీఎస్‌ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికింద చైనా టెలికాం సంస్థ హువావై బీఆర్‌ఐ భాగస్వామ్య దేశాల్లో 5జి కమ్యూనికేషన్ల యంత్రాంగాలను నెలకొల్పబోతోంది. హువావై చైనా కమ్యూనిస్టు పార్టీ చెప్పుచేతల్లో నడుస్తుందని అమెరికా ఆరోపణ. 2017నాటి జాతీయ ఇంటెలిజెన్స్ చట్టం ప్రకారం హువావైతో సహా అన్ని చైనా కంపెనీలు బీజింగ్‌లోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి స్వదేశం నుంచి, విదేశాల నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం అందించాల్సి ఉంది. కాబట్టి హువావై దేశవిదేశాల్లో నిర్మించే 5జి టెలికాం యంత్రాంగాలు గూఢచర్య సమాచార సేకరణకు, విమర్శకులు, ప్రత్యర్థులపైన నిఘాకు, ఇతర దేశాల మేధాహక్కుల చోరీకి సైతం తోడ్పడతాయని అమెరికా వాదిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అన్ని టెలికాం కంపెనీలకన్నా హువావై సంస్థే ఎక్కువ 5జి కాంట్రాక్టులు ఖరారుచేసుకుంది. వీటిలో సగం సంపన్న ఐరోపా దేశాలతోనే కుదిరాయి. బీఆర్‌ఐ ప్రాజెక్టులు పెద్దయెత్తున నడుస్తున్న ఆఫ్రికా దేశాల 4జి టెలికాం యంత్రాంగాల్లో 70శాతం హువావై నిర్మించినవే. ఆఫ్రికా ఖండంలో ఏకైక 5జి నెట్‌వర్క్ ఒప్పందం హువావైకి, దక్షిణాఫ్రికా టెలికాం సంస్థ రెయిన్‌కు మధ్య కుదిరింది. బీఆర్‌ఐ దేశాల్లో డిజిటల్ సిల్క్ రోడ్డు నిర్మాణానికి హువావై టెలికాం పరికరాలను సరఫరా చేస్తోంది. ఫలితంగా నేడు అంతర్జాతీయ టెలికాం సామగ్రి మార్కెట్‌లో హువావై అగ్రగామిగా అవతరించింది. మొబైల్ ఫోన్ విడిభాగాల మార్కెట్‌లో రెండో స్థానం ఆక్రమిస్తోంది. ఈ విధంగా హువావై నానాటికీ బలపడటం వ్యాపారరీత్యానే కాకుండా, భద్రతాపరంగానూ తనకు ప్రమాదకరమని అమెరికా భావిస్తోంది.
హువావైకి చిప్‌ల కొరత
హువావైపై అనుమానాల దృష్ట్యా ఆ సంస్థకు అత్యధునాతన కంప్యూటర్ చిప్‌లను (సెమీ కండక్టర్లను) లైసెన్సు మీద తప్ప మరో విధంగా విక్రయించకూడదని అమెరికా ఆంక్షపెట్టింది. సెమీ కండక్టర్ల తయారీలో అమెరికానే అగ్రగామి. 5జి కమ్యూనికేషన్ నెట్‌వర్కులు అధునాతన చిప్‌లతోనే పనిచేస్తాయి. ఇవి లేనిదే డేటా నిల్వ, వైర్‌లెస్ కమ్యూనికేషన్లు, నెట్‌వర్క్ నిర్వహణ సజావుగా సాగవు. హువావై ఇప్పటికే చిప్‌ల కొరత ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ 5జి యంత్రాంగాల నిర్మాణంలో హువావై పరికరాలను వాడవద్దని మిత్రదేశాలకు అమెరికా సూచించింది. దాంతో అమెరికాకు తోడు బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా వంటి ఎనిమిది దేశాలు హువావై పరికరాలను నిషేధించాయి. భారత్ అధికారికంగా నిషేధం విధించకపోయినా, అదే దిశగా కదలుతున్నట్లుంది. ఇక ఫ్రాన్స్‌లో టెలికాం కంపెనీలు ప్రస్తుతం వాడుతున్న హువావై పరికరాల లైసెన్సు గడువు తీరిపోయాక, కొత్త పరికరాల కోసం ఆర్డరు పెట్టవు. వియత్నాంలో నిషేధం లేకపోయినా అక్కడి 4జి, 5జి నెట్‌వర్క్‌లలో హువావై పరికరాలను అసలు వాడటమే లేదు. ఫాస్ట్ వెబ్ అనే ఇటలీ టెలికాం సంస్థకు హువావైకు మధ్య టెలికాం పరికరాల సరఫరా నిమిత్తం కుదిరిన ఒప్పందాన్ని ఇటలీ ప్రభుత్వం వీటో చేసింది. కెనడా సైతం హువావై సామగ్రిని దూరం పెట్టింది. బెల్జియం, గ్రీస్, స్పెయిన్ తదితర ఐరోపా దేశాలతోపాటు సింగపూర్ హువావైపై నిషేధం విధించకపోయినా, ఆ సంస్థ పోటీదారులైన ఎరిక్సన్, నోకియా పరికరాలతో తమ 5జి నెట్‌వర్కులను నిర్మించుకొంటున్నాయి. భారతదేశమూ అదే పంథాను అనుసరిస్తోంది. మరోవైపు అమెరికా మిత్రదేశాలైన హంగరీ, టర్కీ, నెదర్లాండ్స్, ఐస్‌ల్యాండ్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్- హువావై పరికరాలను వాడుతున్నాయి. టెలికాం రంగంలో అన్ని దేశాలూ తన వెంట నడిచేట్లు చేయడానికి అమెరికా దగ్గర నిషేధాస్త్రాలు తప్ప మరేవీ లేవు.
6జి పై 'క్వాడ్' దృష్టి