తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'మరాఠా కోటా' తీర్పు.. రిజర్వేషన్లకు లక్ష్మణ రేఖ - మరాఠా కోటాపై సుప్రీంకోర్టు తీర్పు

మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మరాఠా రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ద్వారా ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించినట్లైంది. పీడిత వర్గాలకు మేలు చేయడానికి రిజర్వేషన్లే ఏకైక మార్గమా అని రాష్ట్ర ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించడంలో ఎంతో అంతరార్థముంది. ఈ కేసు విచారణ దశలో ధర్మాసనం చేసిన సూచనలు ప్రభుత్వాలకు శిరోధార్యాలు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

editorial
'మరాఠా కోటా' తీర్పు రిజర్వేషన్లకు లక్ష్మణరేఖ

By

Published : May 6, 2021, 7:08 AM IST

విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా సంచలనాత్మక తీర్పిచ్చింది. బలీయమైన మరాఠా వర్గానికి 16 శాతం కోటా అనుచితమని కొందరు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరపెట్టడం వల్ల సుమారు రెండేళ్లుగా ఈ అంశం చుట్టూ న్యాయ వివాదం ప్రజ్వరిల్లుతోంది. 2019 జూన్‌లో మరాఠా కోటాపై సానుకూలంగా స్పందించిన బాంబే హైకోర్టు- గైక్వాడ్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రాతిపదికన ఉద్యోగాల్లో 13 శాతానికి, విద్యా సంస్థల్లో 12 శాతానికి రిజర్వేషన్లు తగ్గాలని నిర్దేశించింది. ఇటీవల ఈ కేసు విచారణ దశలో 'మరెన్ని తరాలపాటు రిజర్వేషన్లు కొనసాగిస్తారు?’ అని సూటిగా ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం- సమానత్వ సూత్రాన్ని మరాఠా కోటా ఉల్లంఘించినట్లు తన తీర్పులో స్పష్టీకరించింది. తద్వారా, మరాఠాలను సామాజికంగా విద్యాపరంగా వెనకబడినట్లు గుర్తించే అధికారం రాష్ట్ర సర్కారుకు లేదన్న పిటిషనర్ల వాదాన్ని సుప్రీం సమర్థించింది!

ఎన్నో ప్రశ్నలకు సమాధానం

2019 జనవరిలో ఆర్థిక సామాజిక వెనకబాటుతనం ఆధారంగా కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లకు, మహారాష్ట్రలో కోటాకు మధ్య అంతరాన్ని తీర్పు పాఠంలో ప్రస్ఫుటీకరించిన ధర్మాసనం- కోటా కోలాటాలకు సంబంధించి ఒక స్పష్టతను ఇచ్చింది. 1992నాటి ఇందిరా సాహ్నీ కేసులో రిజర్వేషన్లకు 50శాతం పరిమితి నిర్ధారించడాన్ని పునస్సమీక్షించే నిమిత్తం విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం ముమ్మాటికీ లేదని తేల్చి చెప్పడం ద్వారా- ఎన్నో ప్రశ్నలకు సందేహాలకు ఏకకాలంలో బదులిచ్చినట్లయింది. 50శాతం గరిష్ఠ పరిమితిని మించి విధిగా రిజర్వేషన్లు కట్టబెట్టాల్సినంత అసాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు బాంబే హైకోర్టుగాని గైక్వాడ్‌ కమిషన్‌ గాని ధ్రువీకరించలేకపోయాయన్న ధర్మాసనం వ్యాఖ్యల్ని బట్టి- ప్రస్తుత తీర్పు దేశం నలుమూలలా ఎన్నో విధాల విశేష ప్రభావాన్వితం కానుంది!

రిజర్వేషన్లే మార్గమా?

రాజ్యాంగమే ప్రసాదించిన రిజర్వేషన్ల ముఖ్యోద్దేశం- తరాల తరబడి పీడనకు వంచనకు గురైన అణగారిన వర్గాలకవి తాత్కాలిక ఊతంగా ఉపకరించి క్రమేపీ వారి బతుకులు తేజరిల్లుతాయని. విద్య, ఉద్యోగ రంగాల్లో ఏ డెబ్భైశాతం అవకాశాలనో కొన్ని వర్గాలకు ప్రత్యేకించడం కన్నా అధికార దుర్వినియోగం మరొకటి ఉండదన్న డాక్టర్‌ అంబేడ్కర్‌ హితబోధకు, ఆచరణలో ఏ గతి పట్టింది? మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు తెలియజెబుతున్నా- బలమైన సామాజిక వర్గాలు కోటా డిమాండ్లతో గళమెత్తినప్పుడల్లా ఎక్కడికక్కడ రిజర్వేషన్ల దుర్రాజకీయం కళ్లకు కడుతూనే ఉంది. ఆంక్షల్ని తుంగలో తొక్కి రిజర్వేషన్లను 69 శాతానికి పెంచేసిన తమిళనాడు నిర్వాకంపై వ్యాజ్యాలెన్ని పుట్టుకొచ్చినా- గుజరాత్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వంటివీ అదే బాట పట్టాయి. తమ రాష్ట్రంలో 85.9 శాతం మేర గిరిజనులే ఉన్నందువల్ల 50శాతం రిజర్వేషన్లు సబబేనని మేఘాలయ ఇటీవల సుప్రీంకోర్టులో సమర్థించుకుంది. గరిష్ఠ పరిమితిని తొలగిస్తే అసమానతలు తలెత్తుతాయన్న రాజ్యాంగ ధర్మాసనం- పీడిత వర్గాలకు మేలు చేయడానికి రిజర్వేషన్లే ఏకైక మార్గమా అని రాష్ట్రప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించడంలో ఎంతో అంతరార్థముంది.

బాగుపడేలా చేస్తేనే..

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎన్నో కులాల్ని బీసీ జాబితాలో చేరుస్తున్నప్పటికీ, వారి బాగుకోసం ఎటువంటి పథకాలూ చేపట్టకపోవడం బహిరంగ రహస్యం. అటువంటి బాగోతాల్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తున్న చందంగా- లక్షిత వర్గాల చదువులను ప్రోత్సహించడం, విద్యాసంస్థల్ని నెలకొల్పడం అనుసరణీయాలంటూ ఈ కేసు విచారణ దశలో ధర్మాసనం చేసిన సూచనలు ప్రభుత్వాలకు శిరోధార్యాలు. కులమతాలతో నిమిత్తం లేకుండా సామాజికంగా విద్యావిషయకంగా వెనకబడిన ఎవరినైనా ఆదరించి సొంతకాళ్లపై నిలబెట్టేలా హేతుబద్ధీకరిస్తేనే, రిజర్వేషన్లు జాతికి హితకరమవుతాయి!

ఇదీ చదవండి:'తూర్పు భారతం వైపుగా కరోనా కదలికలు'

ABOUT THE AUTHOR

...view details