విద్యార్థి పరిపూర్ణ వికాసానికి పాఠశాల విద్యలో పాఠ్యప్రణాళిక మార్పునకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. జ్ఞాన సముపార్జనలో విద్యాలయం, ఉపాధ్యాయులు, బోధన-అభ్యసన, పాఠ్యప్రణాళికలది కీలకపాత్ర. భిన్న సంస్కృతులు గల భారత్‌కు ఒకే పాఠ్యప్రణాళిక ఉండాలన్న నిబంధన ఏదీ లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అనేక రాష్ట్రాలు సొంతంగా విద్యా పరిశోధన శిక్షణ మండళ్లను కలిగి ఉండగా, పది రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, దిల్లీ, గోవా, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, బిహార్, జమ్ముకశ్మీర్, సిక్కిం, ఉత్తరాఖండ్, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్రీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి (సీబీఎస్‌ఈ) రూపొందించిన పాఠ్యప్రణాళికలు అమలులో ఉన్నాయి. ఆ జాబితాలో వచ్చే ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా చేరనుంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలో అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికనే అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రతి విద్యా సంవత్సరంలో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు పొడిగిస్తామని తెలిపింది. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించడం ఉమ్మడి పాఠ్యప్రణాళికలతోనే సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, నగర, పట్టణ ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కేంద్రీయ పాఠ్య ప్రణాళికలనే అమలు చేస్తున్నాయి.
సృజనాత్మకతకు వీలు..
జాతీయ విద్యాప్రణాళిక విధివిధానాల ప్రకారం ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యప్రణాళికలను రూపొందిస్తుంది. 1961లో స్థాపించిన స్వయంప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ ఇప్పటిదాకా 1975, 1988, 2000లలో పాఠ్యప్రణాళికలను నవీకరించింది. ఈ ఏడాది మరోసారి నవీకరించే యత్నంలో ఉంది. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలు నీట్, జేఈఈ, సివిల్ సర్వీసుల వంటి పరీక్షలకు అన్ని రాష్ట్రాల పాఠ్యప్రణాళికల్ని క్రోడీకరించి ప్రశ్నపత్రం తయారు చేయడం సాధ్యంకాదు కనుక ఆయా ప్రశ్నపత్రాలు కేంద్రీయ పాఠ్యప్రణాళికల ఆధారంగా రూపొందిస్తారు. ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు రాష్ట్ర విద్యాప్రణాళిక విధివిధానాలను ఏర్పాటు చేసుకొని పాఠ్యప్రణాళికను నవీకరించేందుకు కృషి చేస్తున్నాయి. పాఠ్యాంశాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించి,
చదువుపై ఆసక్తి కలిగించాలి. పాఠ్యాంశాల మోతాదు మించితే విద్యార్థులపై ఒత్తిడిని పెరిగి, పాఠాలను కంఠస్థం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూల్యాంకనంలో జ్ఞాపకశక్తి ఆధారిత ప్రశ్నలు కాకుండా పాఠ్యాంశాల అవగాహనపై ప్రశ్నలు అడిగితే, విద్యార్థులు విషయ అధ్యయనంపై దృష్టి పెడతారు. కేంద్రీయ పాఠ్యప్రణాళికలో అధ్యయన ప్రాధాన్యం సముచితంగా ఉండి విద్యార్థుల పరిపూర్ణ వికాసానికి అవకాశం ఉందని, ఆయా అంశాల్లో రాష్ట్రాల పాఠ్యప్రణాళికలు కొంత వెనుకబడి ఉన్నట్లు విద్యావేత్తల అభిప్రాయం. కేంద్రీయ పద్ధతిలో సృజనాత్మకతను పెంపొందించే సామాజిక ప్రయోజనం కలిగించే పనులు, గ్రంథాలయం వినియోగం, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, కళలు, నాటకాలతోపాటు పాఠ్యప్రణాళికేతర కార్యక్రమాలు, క్రీడలు, సమావేశాలు వంటివి ప్రాధాన్యం కలిగి ఉంటాయి. కేంద్రీయ పాఠ్యప్రణాళికలకు ప్రపంచవ్యాప్త గుర్తింపుతోపాటు అమెరికా, ఐరోపా, సింగపూర్ వంటి దేశాల విద్యా వ్యవస్థలతో సర్దుబాటుకు అనుకూలంగా ఉంటాయి.
ఉపాధ్యాయులదే బాధ్యత..