తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అక్షరమాలపై గందరగోళం- ఒక్కో దాంట్లో ఒక్కోలా!

తెలుగు భాషా బోధనలో ప్రాథమిక స్థాయిలో ప్రామాణికత కొరవడటం మరో పెద్ద సమస్యగా మారింది. తెలుగు అక్షరాల సంఖ్య ఒక్కో పాఠ్యపుస్తకంలో ఒక్కోలా ఉంటోంది. పాఠ్య పుస్తకాల వర్ణమాలలో అక్షరాలు 52, 54, 55, 56, 57.. ఇలా పొంతన లేకుండా ఉండటం అందరినీ అయోమయానికి గురిచేస్తోంది. ఈ విషయంలో ఒక సరైన, స్పష్టమైన విధానం లేక ఉపాధ్యాయులూ అయోమయంలో పడుతున్నారు.

telugu language letters are different in each textbooks
తెలుగు అక్షర మాల

By

Published : Apr 13, 2021, 9:35 AM IST

ఇప్పటికే మన మాతృభాష మనుగడ అంతంతమాత్రంగా ఉందనే ఆందోళన వేధిస్తుండగా- తెలుగు భాషా బోధనలో ప్రాథమిక స్థాయిలో ప్రామాణికత కొరవడటం మరో పెద్ద సమస్యగా పరిణమించింది. అసలు తెలుగు భాషలో అక్షరాలెన్ని అనే మీమాంస విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తోంది. తెలుగు అక్షరాల సంఖ్య ఒక్కో పాఠ్యపుస్తకంలో ఒక్కోలా ఉంటోంది. పాఠ్య పుస్తకాల వర్ణమాలలో అక్షరాలు 52, 54, 55, 56, 57.. ఇలా పొంతన లేకుండా ఉండటం అందరినీ అయోమయానికి గురిచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఏపీఎస్‌సీఈఆర్‌టీ) ఇటీవల కొత్తగా ప్రచురించిన ఒకటో తరగతి పాఠ్యపుస్తకం వర్ణమాలలో 55 తెలుగు అక్షరాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (టీఎస్‌ఎస్‌సీఈఆర్‌టీ) ప్రచురించిన ఒకటో తరగతి పాఠ్యపుస్తకం వర్ణమాలలో 57 తెలుగు అక్షరాలు ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో బోధిస్తున్న తెలుగు పుస్తకాల్లో అక్షరాలు 52, 54, 56 చొప్పున వేరు వేరుగా ఉంటున్నాయి. పిల్లల భాషాధ్యయనానికి తొలి మెట్టయిన ప్రాథమిక దశలోనే అక్షరాలు ఎన్ని అనే స్పష్టత లేకపోవడం పెద్ద సమస్యే.

ఈ విషయంలో ఒక సరైన, స్పష్టమైన విధానం లేక ఉపాధ్యాయులూ అయోమయంలో పడుతున్నారు. అయిదేళ్లకు ఒకసారి పాఠ్య పుస్తకాలు మారినప్పుడల్లా వర్ణమాలలో అక్షరాల సంఖ్య మారడం మన మాతృభాషా బోధనలోని డొల్లతనాన్ని బయట పెడుతోంది. ఒక భాషకు ఎన్ని మాండలికాలైనా ఉండొచ్చు కానీ- అక్షరమాలలో అక్షరాలు మాత్రం ఒకే ప్రామాణిక సంఖ్యలో ఉండాలి. ప్రపంచంలో ఆంగ్ల భాషకు ఉన్న మాండలికాలు మరే భాషకూ లేవు. కానీ అన్ని దేశాల్లోనూ ఆంగ్లానికి 26 అక్షరాలే ఉన్నాయి.

పాఠ్యపుస్తకాల్లో విభిన్నంగా

ఆంధ్రప్రదేశ్‌ ఒకటో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో అచ్చయిన 55 అక్షరాల్లో 'క్ష' అక్షరం లేదు. నిజానికి 'క్ష' ఒక సంయుక్తాక్షరం. 'క','ష'ల సంయుక్తం వల్ల ఏర్పడ్డ అక్షరం. తెలుగు భాషలో దీని ప్రత్యేక అవసరం లేదు కూడా. తెలుగు వర్ణమాలలోకి చొచ్చుకు వచ్చిన అక్షరం 'క్ష'. వర్ణమాలలో కొన్ని అక్షరాలు ముద్రించినా- వాటిని ప్రత్యేక డబ్బాల్లో చుట్టి ఉంచారు. అంటే ఇవి అక్షర మాలలో ఉన్నప్పటికీ వాడుకలో పెద్దగా అవసరం లేని అక్షరాలు అని అర్థం. బోధన సమయంలో ఉపాధ్యాయులు వీటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. తెలంగాణ పాఠ్య పుస్తకంలో 57 అక్షరాలతో కూడిన తెలుగు అక్షర మాలిక ముద్రించారు. అం,అః తీసేసి వాటి స్థానంలో c (అరసున్న), ం (సున్న), ః (విసర్గ)లతో పాటు, 'క్ష'ను వర్ణమాలలో చేర్చారు.

కొన్ని అక్షరాలకు డబ్బాలు చుట్టి వాడుకలో లేని అక్షరాల జాబితాలో ఉంచారు. నిజానికి 'ౠ' అక్షరంతో పెద్దగా ఉపయోగం లేదు. 'కౄరమృగము' వంటి పదాలకు 'ౠ' అక్షరం వత్తు ఉపయోగించేవారు. కానీ క్రూరమృగం అని రాసినా, పలికినా అర్థాలు మారిపోయే ప్రమాదం లేదు. అలాగే మరో అక్షరం 'ఱ'. ఒకప్పుడు చెఱకు అని రాసేవాళ్లం. వ్యావహారిక భాషా ఉద్యమం తరవాత సంప్రదాయానికి స్వస్తి పలికి వాడుక భాషకు పెద్దపీట వేయడంతో 'ఱ'కి బదులు 'ర' ఉపయోగించి ఇప్పుడు చెరకు అని రాసేస్తున్నాం.

అందుకే 'ఱ' వాడుక తగ్గింది. వాడుకలో లేని అక్షరాలను సరళీకరించడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ, భాషలో అక్షరాల సంఖ్యలో అన్ని చోట్లా సారూప్యత కనిపించకపోవడం శోచనీయం. ఇవేకాకుండా, కొన్ని పాఠ్య పుస్తకాల్లో 52, మరికొన్ని పాఠ్యపుస్తకాల్లో 54 అక్షరాలతో, ఇంకొన్నింటిలో 56 అక్షరాలతో బోధన జరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్ణమాలలో అసలు అక్షరాలెన్ని అనే విషయంపై నిరంతర చర్చ సాగుతూనే ఉంది. ఒక భాష ఎంత సరళంగా ఉంటే అంత ప్రాచుర్యం పొందుతుంది. ఆంగ్లం విశ్వవ్యాప్తం కావడానికి చాలా కారణాలున్నప్పటికీ- కేవలం 26 అక్షరాలే ఉండటమూ ఒక హేతువని భాషావేత్తలు చెబుతున్నారు. మారుతున్న కాలంలో అవసరాలకు తగినట్లుగా భాషను ఆధునికీకరించుకోవడం తప్పు కాదు. భాష సజీవంగా ఉంటూ విశ్వవ్యాప్తం కావడానికి, సాంకేతిక పోకళ్లకు తగినట్లుగా నవ్యతను ఆపాదించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ- అది అన్నిచోట్లా ఒకే తరహాలో ప్రామాణికంగా జరగాలి. ఎక్కడైనా తెలుగులో అక్షరాలు ఒకే విధంగా ఉండాలి. ఇకనైనా తెలుగు అక్షరాల బోధనలో సందిగ్ధతకు తెరపడాలి.

ప్రభుత్వాలతోపాటు అధికార భాషా సంఘాలు, తెలుగు అకాడమీలు, తెలుగు విశ్వవిద్యాలయాలు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ భాషా కేంద్రం వంటివి.. ఈ లక్ష్యసాధన కోసం విశేష కృషి చేయాలి. శ్రీకృష్ణ దేవరాయలతో 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని కీర్తి పొందిన మన భాష గత వైభవంతో మళ్ళీ వెలగాలి.

- చిలుకూరి శ్రీనివాసరావు

ABOUT THE AUTHOR

...view details