గుండెల్ని పిండేస్తున్న 'ప్రాణవాయువు' కొరత
ఆక్సిజన్ అందుబాటులో లేక దేశంలో రోజుకు పదుల సంఖ్యలో మృతిచెందుతున్నారు. రోగుల సంఖ్య పెరిగి పలు ఆసుపత్రుల్లో పడకల కొరతా ఏర్పడింది. 83 శాతం క్రియాశీల కేసులున్న 12 రాష్ట్రాల్లో గత ఆరు రోజుల్లోనే గిరాకీ 18 శాతం పెరిగింది. అయితే కేంద్రం.. యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యలూ సత్వర సాంత్వన కలిగించక పోవడానికి సరఫరా అంశాలు ముఖ్య కారణంగా ఉన్నాయి.
ఆక్సిజన్ అంటే వాయువు కాదు, మనిషికి ఆయువు. దేశవ్యాప్తంగా లక్షలాది రోగులకు తక్షణావసరంగా మారిన ఆక్సిజన్ అందుబాటులో లేక పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో అభాగ్యులు మృత్యువాత పడుతున్న దయనీయావస్థ గుండెల్ని పిండేస్తోందిప్పుడు! నిరుడు తొలి దఫా దాడికి భిన్నంగా కొవిడ్ శ్వాసకోశాలకే మృత్యుపాశాలు విసురుతుండటం, కరోనా పరీక్ష ఫలితాల్లో జాప్యం కారణంగా అప్పటికే బాధితుల పరిస్థితి విషమిస్తుండటం వల్ల- ప్రాణాపాయం నుంచి వారిని తప్పించడానికి ఆక్సిజనే సంజీవని. గత వారంలో 22.5 లక్షల కేసులతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇండియాలో రోగుల తాకిడి పెరిగి, ఆక్సిజన్ నిల్వలు తరిగి- ప్రాణవాయువు భిక్ష కోసం ఆసుపత్రుల వేడుకోళ్లు పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్‌లలో ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాలు బలిగొనడమే కాదు, పలు ఆసుపత్రుల్లో పడకల సంఖ్యనూ కుదించేసింది. నిరుడు ఏప్రిల్ నుంచి పది నెలల కాలంలో 9300 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్‌ను ఎగుమతి చేసిన దేశం- నేడు ప్రాణవాయువు కోసం పరితపించాల్సి వస్తోంది. 83 శాతం క్రియాశీల కేసులున్న 12 రాష్ట్రాల్లో గత ఆరు రోజుల్లోనే గిరాకీ 18 శాతం పెరిగిందంటున్న కేంద్రం- యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యలూ సత్వర సాంత్వన కలిగించక పోవడానికి సరఫరా అంశాలు ముఖ్య కారణంగా ఉన్నాయి. విపత్తు నిభాయక చట్టం కింద ఆక్సిజన్ సరఫరాను నియంత్రిస్తున్న కేంద్రం- 20 రాష్ట్రాలకు రోజుకు 6,785 మెట్రిక్ టన్నుల్ని కేటాయించింది. తమ చెంత ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను వేరే రాష్ట్రాలకు కేటాయించ వద్దంటూ తమిళనాడు లాంటివి కోరుతున్న నేపథ్యంలో 50 వేల మెట్రిక్ టన్నుల దిగుమతికి సిద్ధమైన కేంద్రం- తనవంతుగా 551 ఆక్సిజన్ ఉత్పాదక కేంద్రాల ఏర్పాటుకు సమ్మతించింది. అమెరికా, ఈయూ, రష్యా వంటివి ఆపత్కాలంలో ఆదుకోవడానికి ముందుకొస్తున్నా- దేశీయంగా ఆక్సిజన్ ఉత్పత్తి సరఫరాల మెరుగుదలే లక్ష్యంగా అడుగులు కదపాలి!