అనాదిగా మానవాళి, జంతుజాలం అడవులపై ఆధారపడి మనుగడ సాగిస్తూ వచ్చాయి. నదుల పుట్టుకకు, అపారమైన సహజ వనరులకు అడవులే ఆలవాలం. జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలోనూ అడవులదే కీలకపాత్ర. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లమంది అటవీ వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏటా అటవీ ఉత్పత్తుల విలువ 60 వేల కోట్ల డాలర్లకుపైగా ఉంటుందని ప్రపంచబ్యాంక్ నివేదిక చాటుతోంది. భూతాపాన్ని పెంచే కర్బన ఉద్గారాలను 12 నుంచి 20 శాతానికి తగ్గించడంలో అడవుల పాత్ర ఎనలేనిది. భూమిపై లభిస్తున్న 40శాతం ప్రాణవాయువు వాటి నుంచే ఉత్పత్తి అవుతుంది. మానవాళికి ఇన్ని ప్రయోజనాలు కల్పిస్తున్న అడవుల విస్తీర్ణం నానాటికి తరిగిపోవడం అందరినీ కలచివేస్తున్న అంశం. పారిశ్రామికీకరణకు ముందు ప్రపంచంలో ఉన్న అటవీ విస్తీర్ణం 590 కోట్ల హెక్టార్లు. ప్రస్తుతం అది 406 కోట్ల హెక్టార్లకు పడిపోయింది. ప్రపంచ అటవీ వనరుల అంచనా (2020) నివేదిక ప్రకారం 1990 నుంచి ఏటా 17.8 కోట్ల హెక్టార్ల చొప్పున అటవీ ప్రాంతం కోతకు గురవుతూ వస్తోంది. కనుక పారిశ్రామికీకరణ వంటి కారణాల వల్ల అడవులు విధ్వంసానికి గురికాకుండా కాపాడుకోవలసిన కనీస బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది!
క్షీణిస్తున్న విస్తీర్ణం
జాతీయ అటవీ విభాగం 1952నాటి నివేదిక ప్రకారం దేశ భూభాగంలో 33శాతం విస్తీర్ణంలో అడవులు ఉండాలి. ఎత్తయిన పీఠభూముల ప్రాంతాల్లో 60శాతం, మైదాన భూముల్లో 20శాతం కచ్చితంగా ఉండాలి. ఈశాన్య భారతం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో మాత్రమే విధాన లక్ష్యాలకు అనుగుణంగా అడవులు ఉన్నాయి. అదే 2019నాటి నివేదిక ప్రకారం దేశంలో అటవీ విస్తీర్ణం 21.67 శాతం. అధికంగా అడవులు ఉన్న రాష్ట్రాల్లో మిజోరామ్(85.42శాతం), అరుణాచల్ ప్రదేశ్(79.63శాతం), మేఘాలయ(76.33శాతం), మణిపుర్(75.46శాతం), నాగాలాండ్(75.31శాతం) ముందున్నాయి. దక్షిణ భారతంలో కేరళ(54.42శాతం), తమిళనాడు(20.17శాతం), కర్ణాటక(20.11శాతం), తెలంగాణ(18.36శాతం), ఆంధ్రప్రదేశ్(17.88శాతం) ఉన్నాయి. అటవీ వినాశనం, విస్తరిస్తున్న పరిశ్రమలవల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెచ్చరిల్లుతున్నాయి. దీంతో భూతాపం పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇవే ధోరణులు కొనసాగితే 2100నాటికి అతిభయంకరమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుని సమస్త ప్రాణకోటి మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఈ విపత్తు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి పలుమార్లు ప్రపంచ సదస్సులను నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగమే పారిస్ వాతావరణ ఒప్పంద సదస్సు. 2015లో జరిగిన ఈ సదస్సు తీర్మానాల ప్రకారం, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల పారిశ్రామికీకరణ పూర్వస్థాయికంటే రెండు డిగ్రీల సెంటిగ్రేడుకు తక్కువ ఉండేలా ప్రపంచ దేశాలు పట్టుదలతో కృషిచేయాలి. ఈ ఒప్పందం ప్రకారం భారత్ 2030 నాటికి 250కోట్ల నుంచి 300కోట్ల టన్నుల బొగ్గుపులుసు వాయువుకు సమానమైన ఉద్గారాలను తగ్గించడానికి వీలుగా అటవీ విస్తరణ చేపట్టాల్సి ఉంది. అందుకు దేశంలో అటవీ విస్తీర్ణం 33శాతానికి చేరాలి. తాజా నివేదికల ప్రకారం ఉన్నది 21.67 శాతమే. అంటే నిర్దేశిత లక్ష్యాలకు బాగా వెనకబడి ఉన్నాం. 2015 నుంచి 2019నాటి అటవీ విస్తీర్ణం పెరుగుదల 0.33శాతమే నమోదైంది. మరో పదేళ్లలో 2030నాటికి దేశంలో అటవీ విస్తీర్ణం మరో 11.33శాతం పెరగాల్సి ఉంటుంది. జాతీయ అటవీ విస్తీర్ణం 24.56శాతమే ఉంది.