నేపాల్‌కు చెందిన గూర్ఖా యోధులు భారత సైన్యంలో విశిష్ట పాత్ర పోషిస్తున్నారు. వీరి పూర్వీకులు 1765లోనే యూరోపియన్ల ఆయుధాలు వినియోగించారు. గూర్ఖా రాజ్యాన్ని పాలించే రాజు పృథ్వీ నారాయణ్ నాయకత్వంలో పర్వత ప్రాంతాల్లో ఉన్న వివిధ తెగల కన్నా బలీయమైన శక్తిమంతులుగా తమను తాము తయారు చేసుకోవడం ప్రారంభించారు. పృథ్వీ నారాయణ్ మరణించిన తరువాత వితంతువైన అతని భార్య, సోదరుడు రాజ ప్రతినిధులుగా వ్యవహరించారు. శిశువుగా ఉన్న పృథ్వీ కుమారుడి పేరుమీదుగా పాలన సాగించారు. వీరి నాయకత్వంలో కాఠ్మాండూ, లలితపతన్, భట్‌గావ్‌లను లొంగదీసుకుని కుమావున్ వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 1790లో అల్మోరాను స్వాధీనం చేసుకున్నారు. రామ్‌గంగా వరకు దేశం మొత్తానికి తమను తాము ప్రభువులుగా ప్రకటించుకున్నారు.
చైనా దాడితో వెనక్కి
గూర్ఖాలు.. కుమావున్ నుంచి తమ జైత్రయాత్రను పశ్చిమ దిశగా కొనసాగిస్తూ గర్హ్వాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఓ వైపు నేపాల్‌పై చైనా దాడి చేసిందన్న వార్తను ఆలస్యంగా తెలుసుకుంది గూర్ఖాల ఆక్రమణ దళం. దీంతో గర్హ్వాల్ నుంచి వైదొలిగి తమ దేశాన్ని రక్షించుకోవడానికే పరిమితమైపోయింది. అయితే, కొన్ని సంవత్సరాల తరువాత గూర్ఖా దండయాత్ర మళ్లీ పశ్చిమ దిశగా కొనసాగింది. అప్పటి గర్హ్వాల్ రాజు పాలనలో ఉన్న శ్రీనగర్‌పై ఫిబ్రవరి 1803లో దాడికి దిగారు. దీంతో ఆ రాజు దక్షిణ దిశగా వెనక్కి తగ్గాడు. అతను బరాహత్ ప్రాంతంవైపు వెళ్లినా పెద్దగా లాభం లేకుండా పోయింది. అతన్ని అక్కడి నుంచి తరిమేయగా, మొదట డూన్లోకి, ఆ తర్వాత సహరంపూర్కు వెళ్లారు.
ఓడి, మరణించి...
ఇలా తీవ్రమైన అలజడితో వేధింపులకు గురైన రాజా ప్రద్యుమ్న షా ఇక్కడ తన ఆస్తి, సింహాసనం అంతా తాకట్టుపెట్టి లక్షల రూపాయలను సమీకరించాడు. ఈ నిధులతో అతను ఒక కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని డూన్ వద్దకు తిరిగి వచ్చి ఉమర్ సింగ్ థాపా ఆధ్వర్యంలో డెహ్రాను ఆక్రమించిన వారిపై దాడి చేశాడు. కానీ అతను ఓడిపోయి, ప్రత్యర్థుల చేతిలో మరణించాడు.
ప్రద్యుమ్న షా దుస్థితి, గుర్ఖాల ఆధిపత్యం, చివరకు బ్రిటిష్ వారు లొంగదీసుకున్న క్రమాన్ని పాలిఘర్ పురోహితులు(యమునోత్రికి సమీపంలో పవిత్రమైన కోనల్లో ఉండేవారు) ముందుగానే జోస్యం చెప్పారని జేబీ ఫ్రాసేర్ తన పుస్తకం 'హిమాలయన్ మౌంటెన్స్'లో ప్రస్తావించారు.
గూర్ఖా జైత్రయాత్ర ఆ పర్వత ప్రాంతాల ఉత్తర వాలుపైకి చేరినట్లే.. బ్రిటీష్ దళాలు శివాలిక్ శ్రేణులలో ఉన్న దక్షిణ ప్రదేశాలకు చేరుకున్నాయి. 1803 అక్టోబర్‌లో ఉమర్ సింగ్ థాపా డెహ్రాను ఆక్రమించిన సమయంలోనే కర్నల్ బర్న్ సహరన్పూర్లోకి చేరుకున్నారు.
క్రూరమైన పాలన
గూర్ఖాల పాలన క్రూరంగా సాగింది. దీన్ని తట్టుకోలేక చాలా మంది ప్రజలు వలస బాటపట్టారు. బానిసత్వ మేఘాలు త్వరితగతిన కమ్ముకున్నాయి. అప్పు తిరిగి చెల్లించలేని వారు జీవితకాల బానిసత్వ బంధనంలో ఇరుక్కుపోయారు. అన్యాయం, క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. అప్పు చెల్లించలేకపోతే వారి కుటుంబాల తలలను పాలకులకు తాకట్టు పెట్టే పరిస్థితి దాపురించింది. వాస్తవానికి 'గూర్ఖానీ' అనేది గర్హ్వాల్లో గూర్ఖా మితిమీరిన చేష్టలకు పర్యాయపదంగా మారింది.
యుద్ధానికి అసలు కారణం
వివాదాస్పదమైన భూభాగంలో ఒక పోలీసు స్టేషన్‌ను ధ్వంసం చేయడం గూర్ఖా యుద్ధానికి తక్షణ కారణం అయినప్పటికీ, దరోగా ఇంచార్జ్ హత్యతో ఇది ప్రారంభమైంది. ఈ ఘటనలో 18 మంది కానిస్టేబుళ్లు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. కొద్ది సేపటికే మరో పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. ప్రతిచర్యకు దిగడానికి సమయం అనుకూలంగా లేకపోవడం వల్ల తీవ్రమైన ఆక్షేపణ వ్యక్తం చేస్తూ నేపాల్ రాజుకు గూర్ఖాలు ఉత్తరం రాశారు. దానికి అహంకారపూరితమైన జవాబు రావడం వల్ల 1814 నవంబర్ 1న యుద్ధం ప్రకటించారు.