కరోనా కష్టకాలంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ తరుణంలో ఉద్యోగాల కల్పనకు బంగారు బాటలు వేసే వ్యవస్థాపకత (అంత్రప్రెన్యూర్‌షిప్)కు ప్రాధాన్యం ఇవ్వడం భారత్‌కు అత్యవసరం. విద్యా విధానంలో వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా విజయవంతమైన వ్యవస్థాపకుల (అంత్రప్రెన్యూర్స్)ను తయారు చేయవచ్చని జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవస్థాపకత చాలా కాలం నుంచే ఉన్నత విద్య పాఠ్యాంశాల్లో భాగం అయింది. కొన్ని దేశాల్లో పాఠశాల స్థాయి నుంచే దీన్ని బోధిస్తున్నారు. మూడు దశాబ్దాల నుంచి ప్రపంచీకరణ వేగవంతమైంది. ప్రపంచ దేశాల మధ్య పోటీతత్వం పెరిగిపోయింది. ఈ క్రమంలో వస్తువుల తయారీ, సేవలు వాటి సరఫరా గొలుసులకు ప్రాధాన్యం అధికమైంది. దీనికితోడు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మేధాసంపత్తి హక్కులకు గణనీయంగా ప్రాధాన్యం ఇస్తోంది.
విజయానికి మార్గం
ఒక అధ్యయనం ప్రకారం అమెరికాలోని మసాచుసెట్స్ సాంకేతిక విద్యాసంస్థ (ఎంఐటీ)లో చదివిన విద్యార్థులు దాదాపు 25 వేల కంపెనీలను స్థాపించి 33 లక్షల మందికి ఉపాధి కల్పించారు. మన దేశంలోనూ వ్యవస్థాపకత బోధనను ప్రవేశపెట్టిన ఐఐటీలు, ప్రముఖ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో చదివిన వారెందరో వైవిధ్యమైన అంకుర సంస్థలను నెలకొల్పి వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. బైజూస్, క్యూర్ డాట్ ఫిట్, నౌకరీ డాట్ కామ్, మేక్ మై ట్రిప్, ఆర్కిడ్ ఫార్మా, సింటెక్స్ వంటి ఎన్నో సంస్థలు వాటిలో ఉన్నాయి. వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చేర్చడం వల్ల యువతలో ఏదైనా సాధించాలన్న తపన పెరుగుతుంది. వివిధ అధ్యయనాల ప్రకారం పుట్టినప్పటి నుంచే మనిషిలో కొన్ని వ్యవస్థాపక లక్షణాలు దాగి ఉంటాయి. కొందరిలో వాటంతట అవే బహిర్గతమవుతాయి. మరికొందరిలో అంతర్గతంగా ఉండిపోతాయి. అలాంటి వారికి ప్రోత్సాహం అవసరం.
వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా యువత మేధకు సానపట్టి గొప్ప వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దవచ్చు. 67శాతం మేర వ్యవస్థాపక లక్షణాలను బోధన ద్వారా సాధించవచ్చని, 25 నుంచి 40శాతం మాత్రమే పుట్టుకతో సంక్రమిస్తాయని ఒక పరిశోధనలో తేలింది. యువతకు ప్రేరణ అందించడం, మనోనిబ్బరం కలిగి ఉండేలా తీర్చిదిద్దడం ఎంతో అవసరం. విద్యార్థులు ఏదైనా సాధించడానికి కావాల్సిన సృజనాత్మకతను పెంపొందించే దిశగా విద్యావిధానం ఉండాలి. సేవాస్ఫూర్తి, లక్ష్యసాధనకు శ్రమించే తత్వాన్ని అలవరచాలి. నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి. భవిష్యత్తుపై సానుకూల భావన ఏర్పరచడం, బలమైన మానవ సంబంధాలు నిర్మించుకునేలా ప్రోత్సహించడం, చక్కటి భావ వ్యక్తీకరణ వంటివి అంకుర వ్యాపారాల్లో విజయ సాధనకు అవసరమైన ముఖ్య లక్షణాలు. విద్యార్థి దశలోనే వీటిని రూపుదిద్దితే మేటి వ్యవస్థాపకులు తయారయ్యే అవకాశం ఉంటుంది.
వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చదువుకున్న యువత అంకుర వ్యాపారాలను స్థాపించకపోయినా ఉద్యోగాల్లో రాణించి, ఉన్నత స్థానాలను అందుకున్నట్లు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అధ్యయనంలో తేలింది. మన దేశం నుంచి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న చాలామంది వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చదువుకున్న వారే! వ్యవస్థాపకతను కేవలం పుస్తకరూపంలో సిద్ధాంతపరంగానే కాకుండా కార్యశాలలు నిర్వహిస్తూ బోధిస్తున్నారు. ఎన్నో విద్యాసంస్థల్లో ఇంక్యుబేటర్లను ఏర్పరచి పరిశ్రమలను, వ్యాపారాలను స్థాపించేందుకు నైపుణ్యాలు కల్పిస్తున్నారు. దాంతోపాటు వ్యాపారానికి అవసరమైన నైపుణ్యాలను అందుకోవడం, అత్యాధునిక సాంకేతికతపై అవగాహన, పరిశ్రమల సమాఖ్యల సహకారం వంటి ఎన్నో బోధనాంశాలు విజయవంతమైన వ్యవస్థాపకులుగా ఎదగడానికి తోడ్పడతాయి.
చదువుతోపాటే నైపుణ్యాలు