ప్రజల ప్రాణాలను కాపాడటంలో యాంటీ బయాటిక్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. 1940లో అందుబాటులోకి వచ్చిన పెన్సిలిన్ మొదలు అనేక రకాల యాంటీ బయాటిక్స్ నేడు వైద్య చికిత్సలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవి రోగి శరీరంలో వ్యాధి కారకాలైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ తదితరాలను గుర్తించి నాశనం చేస్తాయి. కాలక్రమంలో కొన్ని బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు ఉత్పరివర్తనాల ద్వారా మార్పు చెందుతూ ఈ మందులకు ఎదురొడ్డి నిలిచేలా శక్తిమంతం అవుతాయి. కొంత కాలానికి చికిత్సకు లొంగని స్థాయికి చేరతాయి. వైద్యానికి తలవంచని అలాంటి మొండి ఘటాలను ‘సూపర్‌బగ్స్’గా వ్యవహరిస్తున్నారు.
ప్రగతికి ఆటంకం
నాణ్యమైన చికిత్స అందించే శక్తి కలిగిన యాంటీ బయాటిక్స్ గత రెండు దశాబ్దాలుగా హెచ్చు సంఖ్యలో ఉద్భవిస్తున్న సూపర్‌బగ్స్ దాటికి కుదేలవుతున్నాయి. ఇవి ఆసుపత్రుల పరిసరాలు, ఐసీయూలు, వెంటిలేటర్ల వంటి వైద్య పరికరాలను ఆవాసంగా చేసుకొని, మానవాళికి ముప్పుగా మారుతూ వైద్యులకు సమస్యలను సృష్టిస్తున్నాయి. అమెరికాలో ఏటా సుమారు 28లక్షల మంది సూపర్‌బగ్స్ బారిన పడుతున్నారు. దాదాపు 35వేల మంది మరణిస్తున్నారు. ఈ గణాంకాలను ‘సెంటర్ ఫర్ డ్రగ్ కంట్రోల్ అండ్ రీసెర్చ్’ వెల్లడించింది. సూపర్‌బగ్స్‌వల్ల వైద్య చికిత్సలకు ఏటా అదనంగా రూ.34,106 కోట్లు వ్యయమవుతున్నట్లు పేర్కొంది. 2030 నాటికి ప్రపంచంలో రెండున్నర కోట్ల మంది సూపర్‌బగ్స్‌వల్ల పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది.
యాంటీ బయాటిక్స్‌కు ఎదురు నిలిచే బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా పెరుగుతూ ఉండటం వైద్యరంగ పురోగమనానికి ఆటంకంగా పరిణమిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రత, కలుషితాహారం, సాంక్రామిక వ్యాధుల విజృంభణ సూపర్‌బగ్స్ వృద్ధికి కారణమవుతున్నాయి. యాంటీ బయాటిక్స్‌ను భారత్‌లోనే అత్యధిక స్థాయిలో వినియోగిస్తున్నారు. దానివల్ల సూపర్‌బగ్స్ ఇండియాలో ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అమెరికాకు చెందిన 'సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనమిక్స్ అండ్ పాలసీ' 2019లో 41 దేశాల్లో నిర్వహించిన పరిశోధన ఔషధ ప్రతిఘటన సూచీలో ఇండియా చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు తేల్చిచెప్పింది. దాదాపు అన్ని రకాల యాంటీ బయాటిక్స్‌ను తట్టుకుని నిలవగలిగిన బ్యాక్టీరియా, ఫంగస్ జాతులు భారత్‌లో భారీ స్థాయిలో మనుగడలో ఉన్నట్లు విశ్లేషించింది. ఏటా దాదాపు ఏడు లక్షల మంది సూపర్‌బగ్స్‌కు బలవుతున్నట్లు వెల్లడించింది.