తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రజాస్వామ్యానికి 'పరువు నష్టం'! - పరువునష్టం కేసులు

కాలంచెల్లిన పరువునష్టం చట్టాల దన్నుతో పత్రికలపై కర్కశంగా కత్తి దూసే నైచ్యం తామర తంపరగా పెరిగిపోతోంది. ప్రశ్నించే వారిపై పరువునష్టం పేరుతో విరుచుకుపడుతుంటాయి ప్రభుత్వాలు. దీని వల్ల పౌర, రాజకీయ, మీడియా స్వేచ్ఛ బిక్కుబిక్కుమనకూడదంటే.. పరువు నష్టం చట్ట ప్రయోగాలకు పటిష్ఠ బిగింపులు తప్పనిసరి.

Reforms should be in Defamation laws
ప్రజాస్వామ్యానికే 'పరువు నష్టం'!

By

Published : May 24, 2020, 7:49 AM IST

ప్రశ్నించడం, పాలక పక్షం పోకడల్ని సూటిగా నిలదీసి తప్పొప్పుల్ని వేలెత్తిచూపడం- ప్రజాస్వామ్య మౌలిక లక్షణం. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్‌ హోదా కల్పించడం ద్వారా ప్రభుత్వంలో 'ఆత్మవిమర్శ' అంతర్భాగమని చాటుతోంది భారత రాజ్యాంగం. భయ పక్షపాతాలు, రాగద్వేషాలకు తావులేకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తామన్న ప్రమాణం చేసి మరీ అధికార పీఠాలు అధిష్ఠించే పార్టీలు- గద్దెనెక్కిన మరుక్షణం నుంచే సద్విమర్శను సైతం సహించలేని దురహంకారంతో ప్రవర్తిస్తున్న ధోరణి అన్నిచోట్లా కనిపిస్తోంది. కాలంచెల్లిన పరువునష్టం చట్టాల దన్నుతో పత్రికలపైనా కర్కశంగా కత్తి దూసే నైచ్యం తామర తంపరగా పెరిగిపోతోంది. పత్రికాస్వేచ్ఛ పీక నులిమే అప్రజాస్వామిక ధోరణులు అనర్థదాయకమంటూ తాజాగా మద్రాస్‌ హైకోర్టు వెలువరించిన ఆదేశాలు- ప్రభుత్వాల వ్యవహారసరళి విజ్ఞతాయుతంగా ఉండాలని అభిలషిస్తున్నాయి. కేసుల కొరడా చేతపట్టి పూనక ప్రదర్శనలకు తెగబడే ప్రభుత్వాలు ఆ హితోక్తులను చెవినపెడతాయా అంటే- కాలమే జవాబు చెప్పాలి!

ప్రతీకార రాజకీయాలు సెగలు పొగలు కక్కే తమిళనాట జయలలిత అక్షరాలా పురచ్చితలైవి. తనకు ఎదురాడిన వ్యక్తులు, పత్రికలు, టీవీలు- వేటిపైనైనా క్రిమినల్‌ పరువునష్టం కేసులతో విరుచుకుపడటంలో జయలలిత రికార్డు సరిసాటి లేనిది. కాదేదీ కేసులకు అనర్హం అన్నట్లుగా అధినేత్రి ఆదేశాలకు తోకాడిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2011-13 మధ్యకాలంలో ది హిందూ, నక్కీరన్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, దినమలర్‌, తమిళ్‌ మురస్‌, మురసోలి, దినకరన్‌ వంటి పత్రికలపై పాతికపైగా పరువునష్టం కేసులు పెట్టింది. నక్కీరన్‌ కార్యాలయంపై ఏఐఏడీఎమ్‌కే కార్యకర్తల దాడి వార్తల ప్రచురణా ప్రభుత్వానికి పరువునష్టంగా గోచరించింది. చెన్నైలో కలరా విజృంభిస్తోందని ప్రతిపక్ష డీఎమ్‌కే నిరసన తెలపడాన్ని ప్రచురించడమే మీడియా మహాపరాధమైంది. 'ప్రభుత్వోద్యోగులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యక్తిగత ప్రతీకారాలు తీర్చుకోవడానికి పరువునష్టం చట్టాన్ని దుర్వినియోగం చెయ్యరా'దని జస్టిస్‌ అబ్దుల్‌ ఖద్దోస్‌ ఇచ్చిన తీర్పు- రాజ్యాంగ లక్ష్మణ రేఖలు మీరుతున్న నేతలకు గుణపాఠం లాంటిది. 'ప్రభుత్వోద్యోగి అయినా, రాజ్యాంగ పదవుల్లోనివారైనా విమర్శల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. వారు ప్రజలకు జవాబుదారీ. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి ప్రభుత్వాలు పరువునష్టం కేసుల్ని వాడుకోరాదు' అన్న న్యాయమూర్తి వ్యాఖ్య శిరోధార్యమైనది. ఉద్రేకంతోనో, ఆవేశంలోనో పిల్లలు పిచ్చివాగుడు వాగినా తల్లిదండ్రులు వారిని అంత సులభంగా కాదనుకోలేరు. పౌరులపై పరువునష్టం కేసులకు సంబంధించి తల్లిదండ్రుల తరహా క్షమాగుణమే ప్రభుత్వాల్లోనూ ఉండాలన్న హైకోర్టు సూచన ఎంతో అర్థవంతమైనది. వ్యక్తులకు, ప్రభుత్వోద్యోగులు, లేదా రాజ్యాంగ పదవుల్లోనివారికి ఉన్నట్లుండి కోపం ఎగదన్నుకు రావచ్చేమోగాని, నేరపూరిత పరువునష్టం కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సంయమనం, పరిణతితో వ్యవహరించాలన్నది న్యాయమూర్తి చేసిన మన్నికైన సూచన. సామాజిక మాధ్యమాల శకంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు కోపతాపాలతో పరువునష్టం కేసులు పెడుతూపోతే సెషన్స్‌ కోర్టులు ఆ వ్యాజ్యాల ఉప్పెనలో మునకలేస్తాయన్నది సహేతుక హెచ్చరిక. అంతకుమించి జస్టిస్‌ అబ్దుల్‌ ఖద్దోస్‌ తీర్పులో మరో కీలక కోణం- 'పరువునష్టం ఎవరికి?' అన్న కీలక ప్రశ్నను లేవనెత్తుతోంది!

నేర శిక్షాస్మృతిలోని 199 (2) విభాగం ప్రకారం అనేకమంది వ్యక్తులు, సంస్థలపై ప్రాసిక్యూషన్‌కు ఆదేశాలు వెలువరించినా వాటిలో ఎక్కడా 'రాష్ట్ర ప్రభుత్వానికి పరువునష్టం' అన్న అంశం లేనేలేదని న్యాయమూర్తి వేలెత్తి చూపారు. ముఖ్యమంత్రిగా జయలలిత తప్పొప్పుల్ని విమర్శించినా, ప్రభుత్వపరంగా ప్రజాప్రయోజనాలు నెరవేరడం లేదని ఆక్షేపించినా- అవన్నీ ప్రజాస్వామ్యబద్ధమైనవేగాని, పరువునష్టం పరిధిలోకి ఏమాత్రం రావు. అయినా 2012-’20 మధ్యకాలంలో ఏకంగా 226 పరువునష్టం కేసుల్ని తమిళనాడు ప్రభుత్వం పెట్టడమే అనితర సాధ్యమైన రికార్డు! ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి మీద వార్తలు ప్రచురించినవారి మీద పరువునష్టం కేసులు ఎలా పెట్టగలరని 2016లోనే ప్రశ్నించిన సుప్రీంకోర్టు- అవసరమనుకొంటే వ్యక్తిగతంగా పోరాడండి అని సూచించింది. భావప్రకటన స్వేచ్ఛపై ఈ తరహా కేసులు గొడ్డలి వేటులా మారుతున్నాయన్న 'సుప్రీం' తీవ్ర వ్యాఖ్యల తరవాతా పరిస్థితి లేశమాత్రమైనా మారకపోవడమే విషాదం!

రెండేళ్ల క్రితం నాటి సంగతి. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ భార్య సొంతూరికి చెందిన కొందరికి ప్రభుత్వోద్యోగాలు ఇచ్చారని, ముఖ్యమంత్రి బంధువులు 'వ్యాపం' కుంభకోణంలో నిందితులకు ఫోన్లు చేశారనీ కాంగ్రెస్‌ నేత కేకే మిశ్రా ఆరోపించారు. దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఫిర్యాదు చెయ్యగానే పరువునష్టం కేసు దాఖలై మిశ్రాకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. ఆ కేసును అడ్డంగా కొట్టేసిన సుప్రీంకోర్టు- వాస్తవాల్ని స్వతంత్రంగా బేరీజు వేసి నిర్ణయం తీసుకోవడంలో ప్రాసిక్యూటర్‌ విఫలమయ్యారని ఆక్షేపించింది. చౌహాన్‌గాని, ఆయన భార్యగాని ప్రైవేటు వ్యక్తులుగా ఫిర్యాదు చేసి పరువునష్టం కేసుల్లో పోరాడాల్సిందనీ వ్యాఖ్యానించింది. 'అహం బ్రహ్మాస్మి' అన్నట్లు 'నేనే ప్రభుత్వం' అన్న బుర్ర తిరుగుడు ఆలోచనాధోరణి కరకు చట్టాలకు కోరలు తొడుగుతోంది. ప్రశ్నించే గళాలకు సంకెళ్లు వేస్తోంది!

నోటి దురుసుతనంతో నాలుగు పరువునష్టం కేసుల్ని ఎదుర్కొన్న కేజ్రీవాల్‌- పరువు నష్టాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తున్న చట్టాల రాజ్యాంగబద్ధతనే సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ పెద్దమనిషే- ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు ఉన్నతాధికారులకు ఎవరికైనా పరువునష్టం కలిగించే వార్తలను ప్రసారం చేస్తే న్యాయసలహా మేరకు క్రిమినల్‌ పరువునష్టం కేసులు పెడతామని లోగడ హుంకరించారు. ఈ రెండు నాల్కల ధోరణిని సుప్రీంకోర్టే అప్పట్లో తప్పుపట్టింది. అమెరికా, బ్రిటన్‌, శ్రీలంక వంటి ఎన్నో దేశాలు క్రిమినల్‌ నేర పరిధి నుంచి పరువునష్టాన్ని ఎన్నడో తొలగించాయి. అత్యవసర సందర్భాల్లో వినియోగపడుతుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు దాని రాజ్యాంగబద్ధతను మన్నించి, నేతల ఇష్టారాజ్యం చెల్లదంటున్నా- భావ ప్రకటన స్వేచ్ఛను బలిగొనేలా పాతక ధోరణులు శ్రుతిమించుతూనే ఉన్నాయి. పాము పడగనీడన మండూకంలా పౌర, రాజకీయ, మీడియా స్వేచ్ఛ బిక్కుబిక్కుమనకూడదంటే, పరువు నష్టం చట్ట ప్రయోగాలకు పటిష్ఠ బిగింపులు తప్పనిసరి. ఏమంటారు?

- పర్వతం మూర్తి

ABOUT THE AUTHOR

...view details