తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కాగితాల్లో తప్ప ప్రజాక్షేత్రంలో కనిపించని పార్టీలు - రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం ఆందోళన

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ.. ప్రజాస్వామ్య పారదర్శకతకు సమాధి కడుతున్నాయి కొన్ని పార్టీలు. కాగితాలపైనే తప్ప ప్రజాక్షేత్రంలో కనిపించని రాజకీయ పార్టీలు.. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు రెండింతలయ్యాయి. వాటిని కట్టడి చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలూ సఫలం కావడం లేదు.

political parties in India
భారత్​లో రాజకీయ పార్టీలు

By

Published : Sep 27, 2021, 9:02 AM IST

ప్రజాస్వామ్యానికి పారదర్శకతే ప్రాణవాయువు అని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల అభివర్ణించింది. కాగితాలపైనే తప్ప ప్రజాక్షేత్రంలో కనిపించని రాజకీయ పార్టీలు.. ఆ సత్ప్రమాణానికి పాతరేస్తున్నాయి. జవాబుదారీతనానికి దూరంగా మసలుతూ అక్రమాలకు ఆలవాలాలుగా అవి విరాజిల్లుతున్నాయి. గడచిన రెండున్నర సంవత్సరాల్లో సగటున రెండు రోజులకు ఒకటి చొప్పున దేశంలో దాదాపు అయిదు వందల కొత్త పార్టీలు వెలశాయి. వాటితో దేశీయంగా గుర్తింపు పొందని పార్టీల సంఖ్య 2796కు ఎగబాకినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజా గణాంకాలు చాటుతున్నాయి. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇటువంటివి ఇప్పుడు రెండింతలయ్యాయి. రాజకీయ పక్షాలకు దఖలుపడే పన్ను మినహాయింపులను దుర్వినియోగం చేస్తూ ఆ పార్టీల్లో అత్యధికం మనీలాండరింగ్‌కు తెరతీస్తున్నాయనే ఆందోళనలు కొన్నేళ్లుగా ముప్పిరిగొంటున్నాయి.

పారదర్శకతకు సమాధి!

విరాళాల రూపేణా తాము సమీకరించే సొమ్ము వివరాలను బహిరంగపరుస్తున్న గుర్తింపు పొందని పార్టీల సంఖ్య అయిదు శాతానికి మించడం లేదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ పారదర్శకతకు సమాధి కడుతున్న పార్టీలను కట్టడి చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలూ సఫలం కావడం లేదు. అయిదేళ్ల క్రితం అటువంటి 255 పార్టీలను ఈసీ గుర్తించి జాబితాలోంచి తొలగించింది. అనుమానాస్పద రాజకీయ పక్షాల వివరాలను ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను విభాగంతోనూ పంచుకొంటోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కొత్త పార్టీలను నమోదు చేసుకోవడమే తప్ప కట్టు తప్పిన వాటి గుర్తింపును పూర్తిగా రద్దు చేసే అధికారం నిర్వాచన్‌ సదన్‌కు లేదు! 'చట్ట సవరణ ద్వారా ఆ అధికారాన్ని కల్పించాలని ఇరవై ఏళ్లుగా కేంద్రాన్ని అభ్యర్థిస్తూనే ఉన్నాం' అని మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో ఎన్నికల సంఘం వాపోయింది. తాజాగా న్యాయశాఖామాత్యులతో దీనిపై చర్చించిన ఈసీ వర్గాలు- వచ్చే శీతాకాల సమావేశాల్లో ఆ మేరకు చట్టసవరణ బిల్లు పార్లమెంటు ముందుకొస్తుందనే ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి పరిశీలన దశలోనే మగ్గిపోతున్న దాదాపు 40 ప్రతిపాదనలు అన్నింటిపైనా కేంద్రం సత్వరం స్పందించాలన్నదే ప్రజాస్వామ్య హితైషుల ఆకాంక్ష!

అజ్ఞాత మూలాల నుంచి వచ్చిపడుతున్న కాసుల మూటలతో రాజకీయ పార్టీల ఖజానాలు కళకళలాడిపోతున్నాయి. 2004-20 మధ్య ఏడు జాతీయ పార్టీలే ఇలా 14 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను వెనకేసుకొన్నాయి. గత మూడేళ్లలో 70 గుర్తింపు పొందని పార్టీలకు సైతం వివాదాస్పద ఎన్నికల బాండ్ల ద్వారా డబ్బులు వచ్చిపడ్డాయి! ఆయా రాజకీయ పక్షాల్లో కొన్నింటికి సరైన చిరునామాలూ లేవనే దిగ్భ్రాంతకర వాస్తవాన్ని నిరుడు సుప్రీంకోర్టుకు ఈసీ నివేదించింది. ఎన్నికల బాండ్ల ద్వారా పార్టీలు చేజిక్కించుకునే కోట్లాది రూపాయలు దుర్వినియోగం కావడానికి అవకాశాలు ఉన్నాయని న్యాయపాలిక ఆరు నెలల క్రితమే హెచ్చరించింది.

ఈసీ సిఫార్సులు ఆచరణలోకి వస్తేనే..

పార్టీలకు అందే ప్రతి రూపాయీ పక్కాగా నమోదు కావాలన్న ఎన్నికల సంఘం సిఫార్సు ఆచరణలోకి వస్తేనే- ధనశక్తి దుష్ప్రభావం నుంచి ఎన్నికల ప్రక్రియ కొంతైనా తేటపడుతుంది. పెద్దపార్టీల ఖర్చులను తమ పద్దులో చూపించడంతో పాటు నల్లధనాన్ని తెలుపు చేయడానికి అక్కరకొస్తున్న చిల్లర పార్టీలపై నిఘా పటిష్ఠం కావాలి. వరసగా రెండు ఎన్నికల్లో పోటీపడని పార్టీల గుర్తింపును రద్దు చేయాలన్న రాజ్యాంగ నిపుణుల మేలిమి సూచనలకూ మన్నన దక్కాలి. పూర్వ సీఈసీ టీఎన్‌ శేషన్‌ సూచించినట్లు సమగ్ర ఎన్నికల సంస్కరణలకు పాలకులు కంకణబద్ధమైతేనే- ప్రజాతంత్ర వ్యవస్థ పునాదులను పెళ్లగిస్తున్న పెడపోకడలకు అడ్డుకట్ట పడేది!

ఇదీ చూడండి:Azadi ka amrut mahotsav: వేలూరు కోటలో తెలుగు సిపాయిల వేట

ABOUT THE AUTHOR

...view details