అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ- భారత్‌లో వాటి ధరలు మాత్రం దిగిరావడంలేదు. అంతర్జాతీయ ధరల ప్రాతిపదికన పెట్రోలు, డీజిల్‌లను మన దేశంలో విక్రయించకపోవడం అందుకు కారణం. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం రేటూ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. డాలర్ విలువ పెరిగినప్పుడు మార్పిడి రేటులో మనం దిగుమతులపై అధిక మొత్తంలో రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రూపాయలతో పోల్చినప్పుడు డాలర్ విలువ క్రమేపీ పెరుగుతోంది. చమురు ధరలకు సంబంధించి ఒక డాలరు తగ్గితే భారత్‌లో ఒక లీటరు చమురుకు యాభై పైసలు తగ్గాలి. కానీ, డాలర్ విలువ పెరుగుతుండటం వల్ల చమురు దిగుమతులపై మనం అధికంగా చెల్లించాల్సి వస్తోంది. 2017 జూన్ నుంచి భారత్‌లో చమురు ధరలను- రోజువారీ అంతర్జాతీయ మార్కెట్ ధరలు, డాలరు నుంచి రూపాయి మార్పిడి రేట్ల ఆధారంగా నిర్ణయిస్తున్నారు.
రాష్ట్రాల వాటాకు గండి
లీటరు పెట్రోలుపై నవంబరు 2014లో ఎక్సైజ్ సుంకం రూ.9.20, డీజిల్ మీద లీటరుకు రూ.3.96 ఉండేది. డిసెంబర్ 2017నాటికి అది రూ.21.48, రూ.17.33కు; జనవరి 2021నాటికి రూ.32.98, రూ.31.83కు పెరిగింది. కేంద్రం వ్యూహాత్మకంగా ప్రత్యేక ఎక్సైజ్ సుంకం, రహదారి సుంకం విధించింది. దీని పర్యవసానంగా సాధారణ ఎక్సైజ్ సుంకంలో పెరుగుదల లేకపోవడంవల్ల, కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటాకు గండి పడుతుంది. కేంద్రం వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి కింద 2021-22 బడ్జెట్లో పెట్రోలు, డీజిల్‌పై లీటర్‌కు రూ.2.50, రూ.4.00 విధించిన సెస్‌లో భాగంగా- పెట్రోల్, డీజిల్ మీద సాధారణ ఎక్సైజ్ సుంకంలో వరుసగా రూ.1.50, రూ.3.00 కోత విధించింది. దీనివల్ల కేంద్రం ప్రకటించినట్లు ప్రజలమీద అదనపు పన్ను భారం లేకపోయినప్పటికీ, రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావలసిన పన్నుల వాటాకు నష్టం వాటిల్లిన మాట వాస్తవం.
కేంద్రంనుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాల్లో పెట్రోలు, డీజిల్ మీద లీటరుకు కేవలం రూ.1.48, రూ.1.83లో 41శాతం మాత్రమే లభిస్తుంది. అంటే ఈ పెట్రోల్, డీజిల్ పన్నులలో సింహ భాగం రూ.31.50, రూ.30 పూర్తిగా కేంద్రం ఖజానాలోకి వెళుతుంది. గడిచిన దశాబ్దకాలంలో చమురుపై ప్రభుత్వాలు విధించిన పన్ను భారత స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతానికి సమానం. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే మొత్తం ఎక్సైజ్ సుంకంలో 85-90శాతం కేవలం చమురు మీదే వస్తోంది. కేంద్రానికి వచ్చే వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయంలో 24శాతం చమురు మీద సమకూరుతోంది. 2014-15లో ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం రూ.1.72 లక్షల కోట్లు; 2019-20 నాటికి అది రూ.3.34 లక్షల కోట్లకు అంటే 94శాతం మేర పెరిగింది. ఇదే కాలంలో రాష్ట్రాలు సైతం చమురుపై పన్నుల ద్వారా తమ వాటాను రూ.1.60 లక్షల కోట్ల నుంచి రూ.2.21 లక్షల కోట్లకు అంటే 37శాతం మేర పెంచుకున్నాయి.