దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పట్ల నిరసన తెలిపిన ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేయడానికి ఉగ్రవాద నిరోధక చట్ట నిబంధనలను అడ్డుపెట్టుకున్న పోలీసులను హైకోర్టు గట్టిగా మందలించింది. న్యాయస్థానం ఆ విద్యార్థులకు బెయిలు ఇచ్చినా, ఆ ఆదేశం వెలువడటానికి 13 నెలలు పట్టడం విశేషం. ఇన్ని నెలలూ విద్యార్థులు జైలులో మగ్గిపోవడానికి ఎవరు బాధ్యత వహించాలి? అసలు వారు అరెస్టు అయిన తేదీ నుంచి వారం రోజుల్లోనే దిగువ కోర్టు కాని, హైకోర్టు కాని బెయిలు మంజూరు చేసి ఉండవచ్చు. కేవలం 24 గంటల్లోనే బెయిలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. దిల్లీ విద్యార్థులకు బెయిలు ఇవ్వడంలో అసాధారణ జాప్యం వారి ప్రాథమిక హక్కులకు భంగకరం. ఈ జాప్యానికి పోలీసులు, ప్రభుత్వమే కారణమని అందరూ నిందిస్తారు. మరి న్యాయవ్యవస్థకు బాధ్యతే లేదా? హడావుడి తీర్పులు ఎంత అనర్థదాయకమో, అమిత ఆలస్య తీర్పులూ అంతే అవాంఛనీయం. ప్రస్తుతం జైళ్లలో మగ్గిపోతున్న వారిలో 65 నుంచి 70 శాతం వరకు విచారణలో ఉన్నవారే. ఆ ఖైదీలందరూ పేదలే.
తీర్పుల్లో పెరగని వేగం
స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఏడు దశాబ్దాల్లో మౌలిక వసతులు, రేషన్ కార్డుల జారీ వంటి రంగాల్లో చెప్పుకోదగిన ప్రగతి సంభవించినా, న్యాయస్థానాల్లో తీర్పుల వేగం పెరగలేదు. కేసుల పరిష్కారానికి ఏళ్లూపూళ్లూ పడుతోంది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరించడానికి కోర్టులు అనేకానేక తీర్పులు వెలువరించినా, తమ ప్రాంగణాల్లోనే వాటిని కాపాడటంలో విఫలమయ్యాయి. ఇది అవినీతి, నేరాలు పెరగడానికి దారి తీసింది. దీనివల్ల మన జీడీపీ వృద్ధి వేగం పుంజుకోవడం లేదు. సులభతర వాణిజ్య సూచీలో భారత్ వెనకబడటానికి అవినీతే మూలకారణం. ఇక్కడ 1980-84 మధ్య అవినీతి, తీవ్ర నేరాల కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) జరిపిన ఒక అధ్యయనాన్ని ఉటంకించాలి. ఈ అయిదేళ్లలో 275 మంది నిందితులను విచారించిన కోర్టులు 144 మంది విషయంలోనే నేర నిర్ధారణ జరిపాయి. ఒక కేసు దర్యాప్తు ముగించడానికి సగటున 13.4 నెలలు పట్టగా, విచారణకు 88 నెలలు పట్టిందని సీబీఐ నివేదిక తెలిపింది. నేరాలు రుజువై శిక్షలు పడిన వారిలో చాలామంది పైకోర్టులకు అప్పీలు చేసుకున్నారు. వీరిలో 20 రోజులకు మించి జైలులో ఉన్నవారు కేవలం 21 మంది. సీబీఐ అధ్యయనం పూర్తయిన 2008లో 66 కేసులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఆ కేసులపై ప్రజాధనం ఖర్చయిపోతూనే ఉంది. తీర్పులు ఇవ్వడంలో కోర్టులు చేస్తున్న విపరీత జాప్యం వల్ల చాలామంది నేరస్తులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. ఈ జాప్యానికి కారణాలను శోధించాలి.
ప్రస్తుతం మన కోర్టుల్లో 44 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండగా, 2022 చివరికి అవి 50 కోట్లను దాటిపోనున్నాయి. వీటిని వేగంగా పరిష్కరించి తీర్పులు ఇవ్వాలంటే, మొదట న్యాయమూర్తుల పదవుల్లో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలి. 2006-17 మధ్య కాలంలో అపరిష్కృత కేసులు ఏటా 2.5శాతం చొప్పున పెరగ్గా, న్యాయమూర్తుల పదవుల్లో ఖాళీలు ఏటా 21శాతం చొప్పున పెరిగాయి. వాటిని వేగంగా భర్తీచేసి ఉంటే ఆరేళ్లలో పెండింగు కేసులనేవే ఉండేవి కావని 100 మంది ఐఐటీ పూర్వ విద్యార్థుల అధ్యయనం తేల్చింది. దీన్ని జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ, జస్టిస్ ఆర్.సి.చవాన్ సమర్థించారు కూడా. సబార్డినేట్ జడ్జీల పదవులకు నియామకాలు పోటీ పరీక్ష ద్వారా జరుగుతాయి. ఉదాహరణకు 107 ఖాళీల కోసం హరియాణా జ్యుడీషియల్ సర్వీసు పరీక్షలకు హాజరైన 14వేల మందిలో చివరకు కేవలం తొమ్మిది మంది మాత్రమే విజేతలుగా నిలిచారు. ఈ లెక్కన అన్ని రాష్ట్రాల్లో ఖాళీల భర్తీ ఏ విధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. పరీక్షకు హాజరైన వారిలో అత్యధిక మార్కులు సంపాదించిన వారిని ఎంపిక చేయాలనే కనీస నియమాన్ని ఇక్కడ పాటించడం లేదని అర్థమవుతోంది.
వర్చువల్ పద్ధతి మేలు