కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కే సింగ్ లోగడ చెప్పినట్లు- మనిషికి శ్వాస మాదిరిగా జాతికి విద్యుత్ ప్రాణావసరంగా మారింది. నిరంతరాయంగా అందరికీ విద్యుత్ సరఫరాపై నేతాగణాలు ఎవరెంతగా మోతెక్కించినా, ఏళ్లతరబడి అవి నెరవేరని హామీలుగానే మిగిలిపోయాయి. విద్యుత్ వినియోగదారుల హక్కులకు రక్షణ కల్పిస్తూ నూతన ఒరవడి దిద్దిన కేంద్రం, నాణ్యమైన సేవల లభ్యతను లక్షిస్తూ తాజాగా నిర్దిష్ట నిబంధనావళిని క్రోడీకరించడం స్వాగతించదగింది. అన్ని రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరిపి రూపొందించిన నిబంధనలను డిస్కమ్(పంపిణీ సంస్థ)లు విధిగా పాటించాల్సిందేనని, సేవా లోపాలకు జరిమానా ఎంతన్నది విద్యుత్ కమిషన్ వెల్లడిస్తుందని కేంద్రమంత్రి చెబుతున్నారు.
సరఫరాల్లో అంతరాయానికి వివరణ
విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు దేశవాసులకు అనుభవమే. సబ్‌స్టేషన్లు, లైన్ల అధ్వాన నిర్వహణ, లోడ్ హెచ్చుతగ్గుల మూలాన మోటార్లు కాలిపోవడం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై సరైన సమాచారం కరవై అయోమయావస్థ... చాలాచోట్ల పునరావృతమవుతుండటం తెలిసిందే. కొత్త నిబంధనల ప్రకారం- సరఫరాలో అంతరాయాల గురించి వినియోగదారులకు ముందుగానే సమాచారం అందించాల్సి ఉంటుంది. ఎక్కడ ఎందుకు సరఫరా దెబ్బతిన్నదో, ఎంతసేపట్లో సాధారణ స్థితి నెలకొంటుందో ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా తెలియబరచడమే కాదు- ప్రాంతాలవారీగా నిర్దేశిత గడువులో కనెక్షన్ల జారీ, సరిగ్గా పనిచేయని మీటర్ల స్థానే కొత్తవాటి ఏర్పాటు చురుగ్గా సాగాల్సిందేననీ నిబంధనలు చాటుతున్నాయి.
2022లోగా అన్ని రాష్ట్రాలూ ముందస్తు చెల్లింపు మీటర్లు, స్మార్ట్‌మీటర్లు సమకూర్చాల్సి ఉంటుందని కేంద్రం 2019 జనవరిలోనే గిరిగీసినా- కార్యాచరణపై చెప్పుకోదగ్గ కదలిక కొరవడింది. బిల్లుల్లో పారదర్శకతను, ప్రీపెయిడ్ మీటర్ల అమరికను, వయోవృద్ధులకు ఇంటివద్దే సేవలను సైతం ప్రస్తావిస్తున్న నూతన నిబంధనావళి అక్షరాలా అమలుకు నోచుకుంటే- ఈ చొరవ విశేష ప్రభావాన్వితమవుతుంది.
విద్యుత్ మిగులు రాష్ట్రాల్లో కూడా...