'ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి, ఇంటిలోని గదిలాగే మరుగుదొడ్డీ పరిశుభ్రంగా ఉండాలి' అని పిలుపిచ్చారు గాంధీజీ. ఆ మహాత్ముడి దార్శనికతకు అనుగుణంగా దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కొనసాగుతోంది. మరుగుదొడ్డి లేకుంటే జీవితానికి భద్రత, గౌరవం ఉండవు. స్త్రీలు, యుక్త వయసు ఆడపిల్లలు గౌరవప్రదంగా జీవించడానికి మరుగుదొడ్డి తోడ్పడుతుంది. గర్భిణులు, బాలింతలు, బహిష్టు సమయంలో మహిళలు మరుగుదొడ్డి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
విద్యాసంస్థల్లో ఆడపిల్లలకు వేరుగా సురక్షితమైన మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో ఎంతోమంది అర్ధాంతరంగా చదువును ఆపేయవలసి వస్తోంది. కొన్ని చోట్ల మహిళలు బహిర్భూమికి వెళ్ళినప్పుడు వారిపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి అడ్డుకట్టవేయాలంటే మరుగుదొడ్డి తప్పనిసరి. ప్రపంచవ్యాప్తంగా పారిశుద్ధ్య సంక్షోభాన్ని అధిగమించడానికి ఐక్యరాజ్య సమితి 2013నుంచి ఏటా నవంబర్ 19న అంతర్జాతీయ శౌచాలయ దినోత్సవాన్ని(World toilet day) నిర్వహిస్తోంది. 'మరుగుదొడ్లను విలువైనవిగా భావించాలి' అన్న నినాదంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ), యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 360కోట్ల మంది ప్రజలు సురక్షితమైన పారిశుద్ధ్య సౌకర్యాలకు నోచుకోవడం లేదు. నేటికీ సుమారు 49.4కోట్ల మంది బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేస్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో సుమారు 240 కోట్ల మంది మరుగుదొడ్డి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ మూడింట రెండు వంతుల జనాభాకు ప్రాథమిక పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో లేవు. వీరిలో దాదాపు సగంమంది సబ్-సహారా ఆఫ్రికాలో నివసిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా రక్షిత తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు లేక అతిసారం బారిన పడి అయిదేళ్లలోపు చిన్నారులు రోజూ 700 మందికి పైగా మరణిస్తున్నట్లు యునిసెఫ్ నివేదిక వెల్లడిస్తోంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆరోదైన అందరికీ పారిశుద్ధ్య సదుపాయాన్ని ఈ దశాబ్దం చివరినాటికి అందించాలంటే ప్రభుత్వాలు నాలుగు రెట్లు అధికంగా పనిచేయాల్సి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అధ్యయనం పేర్కొంటోంది.
దేశంలో అనేక మంది పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల మందగించడానికీ పారిశుద్ధ్య లోపమే కారణం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరుగుదొడ్డి వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి 10.83కోట్లు, ఈ ఏడాదిలోనే 8.52లక్షల మరుగుదొడ్లు నిర్మించినట్లు ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి. దేశవ్యాప్తంగా 2.62లక్షల పైచిలుకు గ్రామ పంచాయతీలు బహిరంగ మల విసర్జన రహితమని ప్రకటించుకున్నాయి. చాలా గ్రామాల్లో ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన కొనసాగుతోంది. పల్లెల్లో తల్లిదండ్రుల అవగాహనాలేమితో చిన్న పిల్లలు ఇంటి ఆవరణలో మల విసర్జన చేస్తున్నారు. అందులో రోగకారక క్రిములు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.