స్వచ్ఛంద సంస్థలకు బయటి దేశాలనుంచి అందే నిధులపై పర్యవేక్షణ లక్ష్యంగా- 'విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)'లో ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సవరణలు వాటి భవిష్యత్తుపై చర్చలకు తెరతీశాయి. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 32లక్షలకుపైగా స్వచ్ఛంద సంస్థలు నమోదయ్యాయి. వాటిలో ప్రస్తుతం పనిచేస్తున్నవెన్ని అనేదానిపై గణాంకాలు కచ్చితంగా లేకున్నా, వాటి సంఖ్య లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలన్నీ నిధుల కోసం ప్రధానంగా విదేశీ దాతృత్వ సంస్థలపైనే ఆధారపడుతున్నాయి. మరికొన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీల నిధులతో వాటి కార్యక్రమాల అమలును చేపడుతున్నాయి.
నిరుపేదలకు అండ
దేశంలో భారీ సంఖ్యలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు మారుమూల ప్రాంతాల్లో, ప్రభుత్వాలు కూడా విస్మరించిన ఎన్నో రంగాల్లో సేవలందిస్తూ నిరుపేద వర్గాలకు చేరువయ్యాయనేది వాస్తవం. మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సేవలు అందించడం; హెచ్‌ఐవీ వంటి వ్యాధుల నియంత్రణ, దళితులు, ఆదివాసుల హక్కుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ వంటి ఎన్నో రంగాల్లో దేశం సాధించిన పురోగతిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర విస్మరించలేనిది. అయితే అనేక సంస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించాయనే ఆరోపణలున్నాయి.
రిజిస్టర్ చేసుకున్న సంస్థల్లో కనీసం పది శాతం కూడా ఆడిట్ చేసిన లెక్కలను ప్రభుత్వానికి సమర్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014నాటి ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక- దేశంలో పెద్దయెత్తున కార్యక్రమాలు చేపట్టిన గ్రీన్‌పీస్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, యాక్షన్ ఎయిడ్ వంటి ప్రముఖ సేవాసంస్థలపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సంస్థలు దేశంలో కొన్ని అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చాయని, ఫలితంగా దేశ జీడీపీకి రెండు నుంచి మూడు శాతం నష్టం వాటిల్లిందని నివేదిక స్పష్టంచేసింది. అప్పట్నుంచి స్వచ్ఛంద సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం పెరిగింది.
కేంద్ర ప్రభుత్వం 2015లో పది వేలకుపైగా స్వచ్ఛంద సంస్థల ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. 2017లో మరో అయిదువేల దాకా సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. చాలా సంస్థలకు రెండు, మూడు ఎఫ్‌సీఆర్‌ఏ సంఖ్యలు ఉండటంతో వాటిని రద్దు చేసేందుకు ఇలాంటి ప్రక్రియను చేపట్టినా, అవకతవకలవల్లే రద్దు జరిగిందనే భావన నెలకొంది. దీనితోపాటు అనేక రకాల కార్యక్రమాలకు విదేశీ నిధులు పొందడాన్ని నిషేధించడం, కఠినమైన నియమ నిబంధనలు రూపొందించడంతో కొన్నేళ్లుగా దేశంలో సేవారంగానికి వచ్చే విదేశీ నిధులు గణనీయంగా తగ్గాయి.
తాజాగా సెప్టెంబర్‌లో ఎఫ్‌సీఆర్‌ఏ చట్టానికి చేపట్టిన సవరణలు స్వచ్ఛంద సంస్థలకు నిధుల అందుబాటు, వాటి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని, అనేక సంస్థలు, వాటిలో పని చేస్తున్న సిబ్బంది, వారి సేవలు పొందుతున్నవారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు ఉల్లఘించిందనే ఆరోపణతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ బ్యాంకు లావాదేవీలను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో దేశంలో తమ సంస్థ కార్యక్రమాలు స్తంభింపజేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టానికి తాజాగా చేసిన సవరణల్లో- విదేశీ నిధులను ఇతర సంస్థలకు బదిలీ చేయడాన్ని నిషేధించడం ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలున్నాయి.