తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అసమానతల వైరస్‌కు బడ్జెట్‌ టీకా - 2021 బడ్జెట్​

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళ్లైనా ఆర్థిక అసమానతలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక సంస్కరణల శకంలోనూ వ్యవసాయానికి నష్టాలు చేకూరగా.. ఉత్పాదక సేవారంగాల్లో విప్పారిన అవకాశాలు.. బడుగు జీవుల బతుకుతెరువుకు అక్కరకొచ్చాయి. ఇక కరోనా విజృంభణతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భారీ ఆదాయానికి గండిపడింది. ఆ పరిస్థితే కొనసాగుతోందనుకొని, ఆయా రంగాలకు జీఎస్‌టీ రాయితీలు ఇవ్వడం ద్వారా అవి వేగిరం కోలుకొనేందుకు కేంద్రం ఊతమివ్వాలి. అవి కల్పించే ఉపాధి సమాజంలో డిమాండ్‌ పెరుగుదలకు, సరఫరాలు ఇనుమడించి ఆర్థిక రంగ నవోత్తేజానికి ఊపిరులూదేలా నిర్మలమ్మ బడ్జెట్‌ కొత్త పుంతలు తొక్కాలి!

New Budget to bolster the booming economy of the covid crisis
అసమానతల వైరస్‌కు బడ్జెట్‌ టీకా

By

Published : Jan 27, 2021, 8:01 AM IST

Updated : Jan 27, 2021, 9:00 AM IST

న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రాలే మూలస్తంభాలుగా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 ఏళ్లు అయింది. పౌరులందరి రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయానికి రాజ్యాంగమే పూచీపడుతున్నా- ఆర్థిక అసమానతల అగాధం అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. ఆర్థిక సంస్కరణల శకంలోనూ వ్యవసాయానిది నష్టజాతకమే కాగా, ఉత్పాదక సేవారంగాల్లో విప్పారిన అవకాశాలు- బడుగు జీవుల బతుకు తెరువుకు అక్కరకొచ్చాయి. నిరుడీ రోజుల్లో విరుచుకుపడిన కొవిడ్‌ మహమ్మారి- దేశార్థికం పాలిట ధృతరాష్ట్ర కౌగిలిగా మారింది. వాణిజ్య సేవా రంగాలు కుదేలైపోగా, వ్యవసాయ మొక్కటే దీటైన ఫలసాయంతో జాతిని ఆదుకొంది.

ఆక్స్​ఫామ్​ నివేదిక ఏమంటోందంటే?

ఈ నేపథ్యంలో కొవిడ్‌తోపాటు అసమానతల వైరస్‌ సైతం ఎంతగా పెచ్చరిల్లిందో ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక గణాంకసహితంగా కళ్లకు కట్టింది. లాక్‌డౌన్‌ కాలంలో భారతీయ కుబేరుల సంపద 35శాతం (రూ.3లక్షల కోట్లు) పెరిగిందని, జాబితాలోని తొలి 11మంది ఖజానాలకు చేరిన మొత్తంతో, ఉపాధి హామీ లేదా ఆరోగ్య శాఖల్ని వచ్చే పదేళ్లపాటు నిభాయించవచ్చనీ నివేదిక చాటుతోంది. కొవిడ్‌ కారణంగా 84శాతం కుటుంబాలు ఏదో ఒక స్థాయిలో ఆదాయం కోల్పోగా, 24శాతం జనావళి నెలకు మూడువేల రూపాయల లోపు సంపాదనతో చితికిపోయింది. నిరుడు ఏప్రిల్‌ నెలలో ప్రతి గంటకు లక్షా 70వేల మంది ఉపాధి కోల్పోయిన వైనం, ఇప్పటికీ ఆర్థిక రంగం తేరుకోని తీరు- దేశవ్యాప్తంగా జనజీవనం ఎంత దుర్భరంగా ఉందో వెల్లడిస్తున్నాయి. 1991నాటి ఆర్థిక సంకట స్థితిని మించిన సంక్షోభమిది. దేశార్థిక రుగ్మతలకు వచ్చే బడ్జెట్లోనే సరైన మందు పడాలి!

'ఆత్మనిర్భర్​' ప్రకటించినా..

కరోనా కారణంగా వైద్య ఆరోగ్య సదుపాయాలు, ఆదాయాల్లో పొటమరించిన అసమానతల్ని సత్వరం సరిదిద్దకపోతే పరిస్థితి మరింత దుర్భరమవుతుందన్న ఆక్స్‌ఫామ్‌ సూచన పూర్తిగా అర్థవంతం. కుదేలైపోయిన ఆర్థిక రంగానికి కొత్త సత్తువ తెస్తామంటూ- ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీని కేంద్రం ప్రకటించినా, దానివల్ల ఒనగూడిన ప్రయోజనాలు పరిమితం! కొవిడ్‌ వల్ల క్షేత్రస్థాయిలో వాటిల్లిన వాస్తవ నష్టాల్ని సక్రమంగా కేంద్రం మదింపు వేస్తే పరిస్థితి తీవ్రతకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. దేశవ్యాప్తంగా 6.3 కోట్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలు ఉపాధికి ఆయువు పట్టుగా, ప్రగతికి తొలి మెట్టుగా ఉండేవి. అవి కాస్తా దారం తెగిన గాలిపటాలు కావడంతో వాటిపై ఆధారపడిన కోట్లమంది ఉపాధి గాలిలో దీపం అయింది. 11 కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న సంస్థల్ని మరో అయిదు కోట్ల మందిని ఇముడ్చుకోగలిగేలా తీర్చిదిద్దుతామన్న కేంద్ర సచివుల వాగ్దానాలు వట్టిపోకుండా రేపటి బడ్జెట్టే కాచుకోవాలి. రుణ వితరణలో వెసులుబాట్లను విస్తృతం చేసి, చిన్న సంస్థలు ధీమాగా పనిలో పురోగమించే వాతావరణానికి కేంద్రమే పూచీ పడాలి. ఎగుమతుల్లో 40శాతానికి దన్నుగా నిలుస్తున్న ఎంఎస్‌ఎంఈల సముద్ధరణకు మరో ఉద్దీపన సత్వరం పట్టాలకెక్కాలి.

నవోత్తేజానికి ఊపిరులూదేలా..

సమధిక ఉపాధికి ఊతమిచ్చే కీలక రంగాలకు పన్ను రాయితీల ద్వారా వెన్నుదన్నుగా నిలిచి వాటిని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడం ద్వారానే ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించగల వీలుంది. నిర్మాణం, పర్యాటకం, ఆతిథ్య, సేవా రంగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాల్ని సృష్టించడమే కాదు, దేశార్థిక రంగ స్వస్థతకు చేయూతగా నిలుస్తాయి. కొవిడ్‌ కాలంలో అవన్నీ పడకేయడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయ నష్టం జరిగిందన్నది నిజమే. ఆ పరిస్థితే కొనసాగుతోందనుకొని, ఆయా రంగాలకు జీఎస్‌టీ రాయితీలు ఇవ్వడం ద్వారా అవి వేగిరం కోలుకొనేందుకు కేంద్రం ఊతమివ్వాలి. అవి కల్పించే ఉపాధి సమాజంలో డిమాండ్‌ పెరుగుదలకు, సరఫరాలు ఇనుమడించి ఆర్థిక రంగ నవోత్తేజానికి ఊపిరులూదేలా నిర్మలమ్మ బడ్జెట్‌ కొత్త పుంతలు తొక్కాలి!

ఇదీ చదవండి:2020-21లో భారత వృద్ధిరేటు -8%: ఫిక్కీ

Last Updated : Jan 27, 2021, 9:00 AM IST

ABOUT THE AUTHOR

...view details