ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, శాంతిస్థాపన, రాజ్యాంగ లక్ష్యాల సాధన, ప్రజలకు ఆహార భద్రతా లక్ష్యాలు సాకారం కావాలంటే ప్రతి కుటుంబానికి ఎంతో కొంత భూమి ఉండటం అవసరం. అందుకే స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ల నుంచే భూసంస్కరణలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైన భూమి అందరికీ దక్కేలా ప్రయత్నాలను ఆరంభించాయి. ఇందుకోసం ప్రపంచంలో ఏ దేశమూ చేయనన్ని భూ చట్టాలను రూపొందించాయి. గడిచిన 75 ఏళ్లలో మూడు దశల్లో పేదలకు భూములు అందించే ప్రయత్నాలు జరిగాయి.
జమీందార్లు, జాగీర్దార్లు, ఈనాందార్ల వ్యవస్థలను రద్దు చేసి భూమి సాగు చేసుకుంటున్న వారికే హక్కులను కల్పించారు. భూ కమతాలపై పరిమితి విధించి మిగులు భూములను పేదలకు పంచారు. కౌలుదారులకు హక్కులు కల్పించారు. వీటితో పాటు పేదలకు ప్రభుత్వ, భూదాన భూములు పంపిణీ చేస్తూనే అటవీ భూములపై హక్కులను కల్పించారు. వీటన్నింటితో దాదాపు తొమ్మిది కోట్ల కుటుంబాలకు మేలు కలిగింది. భూసంస్కరణలతో భారతదేశం సాధించిన ఫలితాలు తక్కువేమీ కాదు. కానీ, చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. దేశంలో భూసంస్కరణలు అసంపూర్ణంగానే మిగిలిపోయాయని దశాబ్దం క్రితం ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని సంఘమే అభిప్రాయపడింది. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల దృష్ట్యా భూ సంస్కరణల ఆవశ్యకత మరింతగా పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
దున్నేవాడిదే భూమి
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో ఆనాడు వందల వేల ఎకరాల భూమి కలిగిన భూస్వాములుండేవారు. అదే సమయంలో సెంటు భూమి సైతం లేని మూడు కోట్లకు పైగా పేద కుటుంబాల జీవితం దుర్భరంగా సాగేది. ఇతరుల భూమిలో కూలీలుగా, కౌలుదారులుగా బతికేవారే ఎక్కువ మంది ఉండేవారు. సాగు చేసుకునేవారికే భూమి ఉండాలని, అందరికీ ఎంతో కొంత భూమి ఉంటేనే అన్ని రకాలుగా మేలు జరుగుతుందని భావించి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భూ సంస్కరణలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాంది పలికాయి. భూమి సాగుదారుడికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యవస్థలు రద్దయ్యాయి. వాస్తవ సాగుదారులకు హక్కులు దఖలుపడ్డాయి. అలా రెండున్నర కోట్ల మంది సాగుదారులు భూ యజమానులయ్యారు.
అప్పటి గ్రామీణ జనాభాలో 35శాతానికి పైగా కౌలు రైతులే. వారందరికీ రక్షణ కల్పించడం కోసం ప్రత్యేక చట్టాలు అమలులోకి వచ్చాయి. వీటితో 1.24 కోట్ల మంది కౌలు రైతులకు 1.56 కోట్ల ఎకరాల భూములపై హక్కులు దక్కాయి. ఆ తరవాత సీలింగ్ చట్టాలు వచ్చాయి. వాటితో అందుబాటులోకి వచ్చిన 54 లక్షల ఎకరాల మిగులు భూములను 56 లక్షల పేద కుటుంబాలకు పంచారు. ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న భూములనూ పేదలకు పంపిణీ చేసింది. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన ఉద్యమం ఫలితంగా 2.20 కోట్ల ఎకరాల భూమి పేదలకు అందింది.
వ్యవసాయ భూములను పేదలకు పంచడం సహా దాదాపుగా 40 లక్షల పేద కుటుంబాలకు పది సెంట్ల వరకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఈ సంస్కరణలన్నీ రెండు దశల్లో (1947-70, 1970-90) అమలు జరిగాయి. 1990వ దశకంలో ప్రారంభమైన ఆర్థిక సరళీకరణతో మూడో దశ భూసంస్కరణల ఆవశ్యకత ఏర్పడింది. ప్రభుత్వ భూముల పంపిణీ, ఇంటి స్థలాల మంజూరు కొనసాగిస్తూనే కొత్తరకం సంస్కరణలకు అంకురారోపణ చేశారు. భూమి కొనుగోలు చేసి ఇవ్వడం, కౌలు చట్టాల్లో సంస్కరణలు తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగాయి. తరతరాలుగా అడవులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనుల హక్కులను గుర్తిస్తూ చట్టం చేసి దాదాపుగా 20 లక్షల ఆదివాసీ కుటుంబాలకు 42 లక్షల ఎకరాల అటవీ భూమిపై హక్కు పత్రాలు జారీ చేశారు. ఇన్నేళ్ల భూసంస్కరణల తరవాతా 53 శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు భూమి లేదు. కేవలం నాలుగు శాతం లోపే ఉన్న మధ్యస్థ, పెద్ద రైతుల చేతుల్లోనే 40 శాతం భూమి ఉంది.