మిర్చి ఎగుమతుల పెంపు మీద నిశితంగా దృష్టిసారిస్తూ కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటుచేసింది.దీని ద్వారా రైతులకు అధిక దిగుబడితోపాటు, అంతర్జాతీయ స్థాయిలో మిర్చీ పంటకు గిరాకీ పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. విదేశీమారకద్రవ్యం మరింత సమకూరుతుందని ఆశిస్తోంది.
నాణ్యమైన రకాలపై ఆశలు :
దేశంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు మరో 16 రాష్ట్రాలు మిర్చిని పండిస్తున్నాయి. ఎకరాకు సగటున 25 నుంచి 30 క్వింటాళ్లు, గరిష్ఠంగా 35 క్వింటాళ్ల వరకు సాధారణ, ప్రత్యేక రకాల్లో దిగుబడి వస్తోంది. వివిధ కారణాల వల్ల అమ్మకానికి సిద్ధమైన పంటలో అధిక ధర పలికే మేలిమి సరకు శాతం తగ్గిపోతోంది. తాలు కాయలు పెరుగుతున్నాయి. ఇవి ఎగుమతులకు పనికిరావడంలేదు. విదేశీ ఎగుమతులకు అర్హమైన నాణ్యమైన రకాల మిర్చి లభ్యత పెంచాలంటే కూలీల కొరత సమస్యను అధిగమించాలి. ఆధునిక యంత్రాల వినియోగం పెరగాలి.
సింహభాగం తెలుగు రాష్ట్రాలదే :
దేశవ్యాప్తంగా 6.8 లక్షల హెక్టార్లలో 17 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి అవుతోంది. ఇందులో సింహభాగం వాటా తెలుగు రాష్ట్రాలదే; తరవాతి స్థానం కర్ణాటకది. మొత్తం ఉత్పత్తిలో 30శాతం విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఏటా సగటున 4.5 లక్షల టన్నుల పంట ఎగుమతి ద్వారా అయిదు వేల కోట్ల రూపాయలకు పైగా విదేశమారకద్రవ్యం సమకూరుతోంది. ఎగుమతిలో నాలుగోవంతు చైనాకు వెళ్తోంది. బర్మా, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక ఇతర ప్రధాన దిగుమతిదారులు. అమెరికా, ఐరోపాలతో పాటు 180 దేశాల్లో మిరపను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆ మేరకు ఎగుమతుల్లో మనకు విస్తృత అవకాశాలున్నట్లే. ఘాటు, రంగు కోసం రసాయనాలు వాడని సహజసిద్ధ మిర్చి మీదే విదేశీయులకు మక్కువ. దీనిపై మనం దృష్టిపెట్టాల్సి ఉంది. గడచిన అయిదేళ్లలో 30శాతం వరకు ఎగుమతుల్లో వృద్ధి నమోదైనా, ముడిసరకు రూపంలోనే మన మిర్చి ఎక్కువగా విదేశాలకు వెళ్తోంది. ఉప ఉత్పత్తుల ఎగుమతులతోనూ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగల వీలుంది. మిరపకాయల తొడిమలను బయోమాస్ కర్మాగారాల్లో విద్యుత్తు తయారీలో వినియోగిస్తున్నారు. చౌడుభూములను సారవంతంగా మార్చడానికీ వాడుతున్నారు. మిరప గింజల నూనెను మసాలా వంటకాలు, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తున్నారు.
గుంటూరు మిర్చి గిరాకీ :
శీతల ప్రదేశాల్లో శరీర ఉష్ణోగ్రత పెంచుకోవడానికీ ఇది అక్కరకొస్తోంది. మిరపగింజల పేస్టును వంటకాల్లో వినియోగిస్తున్నారు. గుంటూరు మిర్చి విత్తనాలతో జైపూర్, ముంబయి, దిల్లీలలో ఉప, అంతిమ ఉత్పత్తులు తయారుచేసి పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఈ పరిశ్రమకు మరింత ఊతమివ్వాలి. భారత్ నుంచి దిగుమతయ్యే మిరపకాయలతో వివిధ ఉత్పత్తులను తయారుచేస్తున్నారు చైనీయులు. వాటిని విదేశాలకు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. దేశీయంగా ఉప, అంతిమ ఉత్పత్తుల తయారీ యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తే ఆ ఆదాయం మన దేశానికే వస్తుంది. ఈ ఉద్దేశంతో గుంటూరులో నెలకొల్పిన సుగంధద్రవ్యాల పార్కు బాలారిష్టాలు దాటడం లేదు. మిర్చిని విదేశాలకు ఎగుమతి చేసే క్రమంలో లారీలు, కంటైనర్లలో రోజుల తరబడి సరకు ఉండిపోతోంది. ఈ క్రమంలో గాలి, వెలుతురు తగలక రంగు మారుతుండటం ధరలను ప్రభావితం చేస్తోంది. దీన్ని నివారించడానికి రవాణాలో శీతల కంటైనర్లు వాడాలి. ఇటీవల గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌కు గూడ్సు రైలులో మిర్చి రవాణా మొదలైంది. ఖర్చు తగ్గడంతోపాటు తక్కువ సమయంలో సరకు గమ్యస్థానికి చేరింది. ఇతర నగరాలకూ ఈ సౌకర్యాన్ని విస్తరించాలి.
'ఘాటు' పెరగాలి..:
అధిక దిగుబడుల కోసం వాడే రసాయనాలు మిరప నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయి. దాంతో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాల నుంచి సరకు తిరిగి వస్తోంది. పచ్చిరొట్ట పంటల సాగు, పశువులు, కోళ్ల ఎరువు వాడకం పెంచి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. సేంద్రియ పద్ధతిలో సమగ్ర సస్యరక్షణ విధానం ద్వారా మిర్చి పంటను పండించే దిశగా రైతులను మళ్లించాలి. మిరప పొలాలకు పక్కన సాగుచేసే పత్తి, అపరాలు, ఇతర పంటల నుంచి రసంపీల్చే పురుగులు, వాతావరణ పరిస్థితులతో వైరస్ తెగుళ్లు ప్రబలి బాగా నష్టపరుస్తున్నాయి. అందువల్ల, మిరప పండించే ప్రాంతాలను ప్రత్యేక క్లస్టర్లుగా విభజించాలి.ఘాటైన కాయలతో ఉప ఉత్పత్తులు చేయడానికి అనుకూలమైన రకాలను విదేశీయులు ఎక్కువగా ఆశిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర 85 వేల ఎస్‌హెచ్‌యూ (స్కోవిల్లే హీట్ యూనిట్) ఘాటు కలిగిన రకాలు సాగవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సాగవుతున్న ఓ రకం మిరపలో మూడు లక్షల ఎస్‌హెచ్‌యూ వరకు ఘాటు ఉంటోంది. ఇలాంటి అధిక ఘాటు కలిగిన వంగడాల అభివృద్ధి మీద తక్షణం దృష్టిసారించాలి. మిర్చి ఎక్కువగా పండించే చోటే ఉప, అంతిమ ఉత్పత్తుల తయారీ యూనిట్లు నెలకొల్పాలి. ఇందుకోసం వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు, సుగంధద్రవ్యాల బోర్డు సమన్వయంతో పనిచేయాలి. అప్పుడే మన మిరప ఘాటు ప్రపంచ దేశాల్లో మరింతగా వ్యాపిస్తుంది!
- పెనికలపాటి రమేష్