తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Solar Power: సౌర సేద్యంతో ఏటా రూ.లక్ష కోట్ల ఆదా! - పీఎం కుసుమ్​

ఏటికేడు వ్యవసాయ బోర్లకు కరెంటు వినియోగం విపరీతంగా పెరుగుతోంది. వ్యవసాయ విద్యుత్తు కోసం వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్నాయి. దీనిని అధిగమించడానికి వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్‌ సౌకర్యం(solar power for agriculture) కల్పించాలని కేంద్రం చెప్పినా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సౌర విద్యుత్తు ఏర్పాటు వల్ల దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా చేసే 'పీఎం కుసుమ్‌' వంటి పథకాల అమలుపై రాష్ట్రాలు శ్రద్ధ చూపాలి. సౌర విద్యుత్‌(solar power) వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి వనరుల ఏర్పాటుతోనే అటు వ్యవసాయానికి, ఇటు దేశానికి ఆర్థిక, ఆహార భద్రత, పర్యావరణానికి కాలుష్యం బారి నుంచి రక్షణ లభిస్తాయని అందరూ గుర్తించాలి.

pm kusum
సౌర విద్యుత్​తో సేద్యం

By

Published : Jul 14, 2021, 10:10 AM IST

వ్యవసాయ బోరు మోటార్లకు సౌర విద్యుత్‌(solar power) సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యం రాష్ట్రాల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కేంద్రం చెప్పినా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రాష్ట్రాల నిర్లక్ష్యంతో ఏటా వ్యవసాయ విద్యుత్తుకు చెల్లించాల్సిన రుసుములు, రాయితీల సొమ్ము లక్షా 36 వేల కోట్ల రూపాయలకు చేరింది. ఏటికేడు వ్యవసాయ బోర్లకు కరెంటు వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అన్నదాతలు భూగర్భ జలాల కోసం ఒక్కో కమతంలో రెండు నుంచి అయిదారు బోర్లదాకా తవ్వుతున్నారు. దేశవ్యాప్తంగా బోర్లకోసం అమర్చిన కరెంటు మోటార్ల సంఖ్య ఇప్పటికే 2.93 కోట్లకు చేరింది. వీటిని నడిపేందుకు 2.28 లక్షల మిలియన్‌ యూనిట్ల కరెంటును గతేడాది వినియోగించారు. ఇవి కాకుండా ఎత్తిపోతల పథకాల మోటార్లకు మరింత కరెంటు వాడుతున్నారు. వ్యవసాయ విద్యుత్తు కోసం వేల కోట్ల రూపాయలను రాయితీలుగా ఇచ్చేందుకు వెనుకాడని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రజాధనాన్ని ఆదా చేసుకొనే ప్రత్యామ్నాయ మార్గమైన సౌర విద్యుత్తుపై మాత్రం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నాయి.

వ్యవసాయానికి థర్మల్ నష్టాలు

కాలుష్య సమస్య..

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గును మండించి చేస్తున్న విద్యుదుత్పత్తి వల్ల అధికంగా వెలువడే కాలుష్యంతో పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతోంది. దీనివల్ల పలు అభివృద్ధి చెందిన దేశాలు సౌర, పవన విద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధనోత్పత్తిని పెంచుతున్నాయి. ఒక యూనిట్‌ కరెంటు ఉత్పత్తి కావాలంటే థర్మల్‌ కేంద్రంలో 600 గ్రాములకు పైగా బొగ్గును మండించాలి. భారత్‌లో వ్యవసాయ బోర్లకు వాడుతున్న థర్మల్‌ విద్యుదుత్పత్తికి బొగ్గును మండించడం వల్ల ఏటా 27.65 కోట్ల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌, ఇతర రసాయనాలు గాలిలో కలుస్తున్నట్లు అంచనా. థర్మల్‌ కేంద్రాలకు అవసరమైన బొగ్గు, డీజిల్‌, ఇతర సామగ్రి కోసం ఏటా దాదాపు రూ.94 వేల కోట్లను వెచ్చిస్తున్నారు. 2018-19లోనే జాతీయ స్థాయిలో కరెంటు యూనిట్‌ 'సగటు సరఫరా వ్యయం' (ఏసీఎస్‌) ఆరు రూపాయలకు చేరిందని కేంద్ర విద్యుత్‌ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కరెంటు యూనిట్‌ ఏసీఎస్‌ ఏడు రూపాయలు దాటింది. ఈ ఏడాది (2021-22) ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యవసాయ బోర్ల ఉచిత కరెంటుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రూ.14 వేల కోట్లు చెల్లించాలి. కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ విద్యుత్తుకు రైతులే ఛార్జీలు చెల్లిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్తుకు రాష్ట్ర రాయితీలు, రైతులు చెల్లిస్తున్న ఛార్జీల సొమ్ము కలిపి రూ.1.36 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. దీన్నుంచి బయటపడటానికి ప్రతి వ్యవసాయ బోరుకు సౌర విద్యుత్తు కల్పించేందుకు కేంద్రం రెండేళ్ల క్రితమే 'పీఎం-కుసుమ్‌' పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. వ్యవసాయ బోరుకు సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలన్నది ఈ పథకం లక్ష్యం. బోరు మోటారుకు సౌరఫలకాల ఏర్పాటుకు దాదాపు రెండు లక్షల రూపాయల వ్యయమవుతుంది. ఇందులో 30 శాతం, అంటే రూ.60 వేలు కేంద్రం భరిస్తుంది. రాష్ట్రాలు కూడా కొంత సాయం అందిస్తే రైతులకు మేలు కలుగుతుంది. పంటలకు నీరు అవసరం లేని వేసవితో పాటు ఇతర రోజుల్లో సౌరఫలకాల ద్వారా ఉత్పత్తయ్యే సౌరవిద్యుత్‌ను డిస్కమ్‌లు కొనుగోలు చేసి రైతులకు సొమ్ము చెల్లించాలి. తద్వారా రైతులకు రెండు విధాలుగా ప్రయోజనం దక్కుతుంది. ఒక్కో రైతుకు వీలు కాకుంటే, ఒక ప్రాంతంలోని కర్షకులందరూ సంఘంగా ఏర్పడి ఒక చోట సౌరఫలకాలు ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవచ్చు.

ఆహార, ఆర్థిక భద్రతకు భరోసా..

తెలంగాణలో 24 లక్షల వ్యవసాయ బోర్లున్నాయి. వీటికి సగటున ఒక్కోదానికి రెండు లక్షల రూపాయల వ్యయంతో సౌర విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పిస్తే అందులో రూ.60 వేలు కేంద్రం ఇస్తుంది. మిగతా లక్షా 40 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, మొత్తం రూ.33,600 కోట్ల వ్యయం అవుతుంది. ఒకసారి ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే ఉచితంగా లభించే సౌర విద్యుత్తుతో వ్యవసాయ విద్యుత్తుకు రాయితీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.10 వేల కోట్ల సొమ్ము ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వ్యవసాయ విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నందుకు గతేడాది (2020-21)లో రూ.10 వేల కోట్లు, ఈ ఏడాది(2021-22) రూ.10,500 కోట్లను డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రతి ఏడాది ఇలా పెంచుతూ చెల్లిస్తూనే ఉండాలి. ఈ రెండేళ్లలో రాయితీల కోసం కేటాయించిన రూ.20,500 కోట్లను సౌర విద్యుత్‌ సౌకర్యం కల్పనకు వెచ్చించి ఉంటే రాష్ట్రంలో 14.64 లక్షల వ్యవసాయ బోర్లకు సౌర విద్యుత్తు ఫలకాల ఏర్పాటు పూర్తయ్యేది. వచ్చే ఏడాది నుంచి వాటికి రాయితీ ఇవ్వాల్సిన అవసరమే ఉండేది కాదు. సాధారణ కరెంటు కనెక్షన్‌ ఇవ్వడానికి వ్యవసాయ బోరుకు రూ.70 వేల దాకా డిస్కంలు వెచ్చిస్తున్నాయి. ఇవి కాకుండా ఏటా రూ.10 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా భరిస్తోంది. ఇలాంటి పథకాలకు ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులు- ఒకేసారి సౌర విద్యుత్తు ఏర్పాటు వల్ల దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా చేసే 'పీఎం కుసుమ్‌' వంటి పథకాల అమలుపై రాష్ట్రాలు శ్రద్ధ చూపాలి. సౌర విద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి వనరుల ఏర్పాటుతోనే అటు వ్యవసాయానికి, ఇటు దేశానికి ఆర్థిక, ఆహార భద్రత, పర్యావరణానికి కాలుష్యం బారి నుంచి రక్షణ లభిస్తాయని అందరూ గుర్తించాలి.

- మంగమూరి శ్రీనివాస్‌

ఇవీ చదవండి:సోమనాథ్​ సృష్టి..​ వ్యర్థాలతోనే సంగీత వాద్యాలు

సహకార సంఘాలపై పట్టు కోసమే కొత్త శాఖ!

ABOUT THE AUTHOR

...view details