వ్యవసాయోత్పత్తులకు న్యాయమైన గిట్టుబాటు ధరలు లభించేలా చూడటానికి అఖిల భారత కిసాన్ సభ ఒక నమూనా బిల్లును ప్రతిపాదించింది. రైతుకు ఉత్పత్తి వ్యయం (సీ2) కన్నా 50 శాతం ఎక్కువ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించేలా చూడటం ఈ బిల్లు ఉద్దేశం. దీనికి తోడు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలనీ ఇది ప్రతిపాదిస్తోంది. బడ్జెట్ సమావేశాల రెండో దశలో దీన్ని ప్రైవేటు బిల్లుగా ప్రవేశపెట్టాలని కిసాన్ సభ సంకల్పిస్తోంది. రైతులు, వ్యవసాయ కూలీలు సామాజిక సహకార సంఘాలుగా ఏర్పడి సీ2 ప్లస్ 50 మద్దతు ధరకు నాణ్యమైన వ్యవసాయోత్పత్తులను మండల, బ్లాకు స్థాయి ప్రాథమిక వ్యవసాయ స్వయం సహాయక బృందాలకు విక్రయించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
ముడి వ్యవసాయ సరకులను ప్రాసెస్ చేసి అదనపు విలువ జోడించి విక్రయించడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో నిర్ణీత శాతాన్ని రైతులకు అదనపు ధరగా అందించాలనీ బిల్లు సూచిస్తోంది. 'అమూల్' నమూనాలో జరుగుతున్నది ఇదే. మండల, బ్లాకు స్థాయుల్లో ఇరవై నుంచి నలభై మంది రైతులు, వ్యవసాయ కూలీలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేయవచ్చు. ఈ బృందాల ఏర్పాటు, నిర్వహణలకు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. కౌలు రైతులను సంయుక్త జవాబుదారీ బృందాలుగా ఏర్పరచి పరస్పర పూచీకత్తుపై బ్యాంకు రుణాలు తీసుకునే ప్రయోగం కేరళలో తప్ప మరే రాష్ట్రంలోనూ విజయవంతం కాలేదని ఇక్కడ గుర్తుంచుకోవాలి. పాలనా యంత్రాంగం నుంచి తగిన మద్దతు కొరవడటం దీనికి కారణం.
రైతులు, వ్యవసాయ కూలీలు చెల్లించే రుసుములు, కేంద్ర, రాష్ట్ర పథకాల నిధులు, ప్రభుత్వ పూచీకత్తుపై ఆర్థిక సంస్థలు ఇచ్చే వడ్డీ లేని రుణ మొత్తాలు, సామాజిక సహకార సంఘాల అదనపు ఆదాయాలతో ధరల స్థిరీకరణ నిధి (పీఎస్‌ఎఫ్)ని ఏర్పరచాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ప్రాసెస్ చేసి, విలువ జోడించిన వినియోగ వస్తు విక్రయాల ద్వారా వచ్చే అదనపు ఆదాయంతో పీఎస్‌ఎఫ్‌ను స్వావలంబన నిధిగా రూపొందించవచ్చు. ఈ నిధిని సభ్యుల తరఫున పంట బీమా, నష్టపరిహార చెల్లింపులకు వెచ్చించవచ్చని బిల్లు సూచిస్తోంది.
చట్టబద్ధమైన హక్కు
కనీస మద్దతు ధరకన్నా తక్కువకు పంటలు కొనడాన్ని నేరంగా పరిగణించాలని బిల్లు ప్రతిపాదిస్తున్నా, దాన్ని అమలుచేయడానికి అవసరమైన యంత్రాంగం లేదని గమనించాలి. కిసాన్ సభ బిల్లు అటువంటి యంత్రాంగం ఉండాలని సిఫార్సు చేసినా దానికి అనుసరించాల్సిన విధివిధానాలను సూచించలేదు. ప్రస్తుతం ఏ2 (వాస్తవంగా చెల్లించిన ధర) ప్లస్ పొలంలో కుటుంబ శ్రమకు కట్టే విలువ (ఎఫ్‌ఎల్) ఆధారంగా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నారు. ఈ ఏ2 ప్లస్ ఎఫ్‌ఎల్ ఫార్ములా ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. స్థూల విలువ జోడింపుపై ఆధారపడిన వ్యవసాయోత్పత్తిలో కేవలం ఆరు శాతాన్ని ప్రభుత్వాలు కనీస మద్దతు ధరకు సేకరిస్తున్నాయి. ప్రాసెసింగ్ ద్వారా పంటకు జోడించిన అదనపు విలువను కార్పొరేట్ కంపెనీలే కైంకర్యం చేస్తున్నాయి. ఉదాహరణకు రైతులకు కిలో బాస్మతి బియ్యానికి దళారులు చెల్లించే ధర 18 రూపాయల నుంచి 30 రూపాయల లోపే. కానీ, ఆ బియ్యానికి తమ బ్రాండ్ వేసుకుని కంపెనీలు అంతకు అయిదు రెట్లు అధిక ధరకు అమ్ముకొంటున్నాయి. ఇలాంటి అక్రమ విధానాల వల్లనే రైతులకు గిట్టుబాటు ధరలు లభించక అప్పుల ఊబి నుంచి వారు బయటపడలేకపోతున్నారు.
ప్రస్తుతం ఆందోళన పథంలో ఉన్న రైతులు, ఈ చేదు వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని తమ పంటలకు ఉత్పత్తి వ్యయంకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ కనీస మద్దతు ధర చెల్లిస్తామని ప్రభుత్వాలు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన వ్యవసాయ ఉత్పత్తి వ్యయాలు, ధరల సంఘం (సీఏసీపీ) మొత్తం 23 పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటిస్తోంది. వీటిలో చెరకు, జనుము, కొబ్బరితోపాటు 14 ఖరీఫ్ పంటలు, రబీలో వేసే ఆరు పంటలు (గోధుమ, బార్లీ, సెనగ, మసూర్, ఆవ, శా ఫ్లవర్) ఉన్నాయి. కానీ, సీఏసీపీ నిర్ణయించిన కనీస మద్దతు ధరలకు (ఎంఎస్‌పీ) కేవలం గోధుమ, వరి పంటలనే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మిగిలిన పంటలను ప్రైవేటు వ్యాపారులు కొంటున్నారు. ప్రభుత్వ సేకరణ కేంద్రాలు బాగా దూరంలో ఉండటం వల్ల అక్కడికి తమ పంటను తీసుకెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చులను రైతులే భరించాల్సి వస్తోంది. ఈ సాధక బాధకాలను గుర్తించి అన్ని పంటలకు ఎంఎస్‌పీ చెల్లించడానికి చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.