తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Justin Trudeau On India : భారత్​పై అక్కసు.. అలా జరుగుతుందని ఊహించని ట్రూడో.. వెనక్కి తగ్గడమే శరణ్యం! - కెనడా ప్రధాని ట్రూడో ఖలిస్థాన్

Justin Trudeau On India : భారత్​పై సంచలన ఆరోపణలతో వివాదాన్ని రాజేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. మిత్రదేశాల నుంచి వచ్చిన సలహాలతో చల్లబడ్డారు. ఆత్మరక్షణలోకి నెట్టేసే విధంగా భారత్ స్పందించిన తీరుకు తలొగ్గారు! ఖలిస్థానీ ఉగ్రవాది హత్యపై చేసిన ఆరోపణలు దౌత్యపరంగా తీవ్ర దుమారానికి దారితీస్తాయని ట్రూడో ఊహించలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Justin Trudeau On India
Justin Trudeau On India

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 9:05 PM IST

Justin Trudeau On India :ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు భారత ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా మద్దతు లభించకపోగా.. తిరిగి ఆ దేశంపైనే ప్రతికూల ఫలితం చూపినట్లైంది. ( India Canada Relations ) ఆయన ఊహించని రీతిలో దీనిపై దౌత్యపరంగా తీవ్ర దుమారం చెలరేగింది. భారత్ గట్టిగా బదులివ్వడమే కాకుండా.. ప్రతిగా కెనడాను ఆత్మరక్షణలోకి నెట్టేసేలా చర్యలు తీసుకుంది. భారత్​తో జగడమెందుకని స్నేహపూర్వక దేశాలు సైతం ట్రూడోకు హితవు పలుకుతున్న నేపథ్యంలో.. కెనడా వెనక్కి తగ్గినట్లు స్పష్టమవుతోంది.

వివాదం ఇదీ..
India Canada Khalistan :ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్​ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఈ ఏడాది ప్రారంభంలో సంచలన ఆరోపణలు చేశారు ట్రూడో. భారత సీనియర్ దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది. ఈ పరిణామాలపై మండిపడ్డ భారత్.. ఆరోపణలను ఖండించి, ప్రతీకారంగా కెనడా దౌత్యవేత్తను దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతేకాకుండా కెనడాలోని పౌరులను, అక్కడికి వెళ్లాలనుకునే భారతీయులను ఉద్దేశిస్తూ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కెనడాలో దేశవ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయని అందులో పేర్కొంది. భారత పౌరులకు, దౌత్యవేత్తలకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది.

సాధారణంగా ఇలాంటి అడ్వైజరీలను యుద్ధాలతో సతమతమవుతున్న దేశాల్లోని భారత పౌరుల కోసం జారీ చేస్తారు. పశ్చిమాసియా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు ఇలాంటి అడ్వైజరీలను గతంలో జారీ చేసింది భారత్. కానీ.. జీ7 దేశమై ఉండి, ఎలాంటి యుద్ధ పరిస్థితులు లేని కెనడాకు ఈ అడ్వైజరీ జారీ కావడం.. ఖలిస్థానీ ఉగ్రవాదంపై భారత్ ఎంత కఠినంగా ఉండాలనుకుంటుందోననే విషయానికి అద్దం పడుతోంది. న్యూదిల్లీ అక్కడితో ఆగిపోలేదు. కెనడా పౌరులకు వీసా సేవలను సైతం నిలిపివేసింది. కెనడాలో ఖలిస్థానీ కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఇప్పటికే భారత్.. ఆ దేశానికి స్పష్టంగా చెప్పిందని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్​కు చెందిన స్టడీస్ అండ్ ఫారిన్ పాలసీ విభాగ ఉపాధ్యక్షుడు హర్ష్ వీ పంత్ పేర్కొన్నారు. వాక్ స్వేచ్ఛ పేరుతో వాటిని అనుమతించడం సరికాదని చెప్పినట్లు ఈటీవీ భారత్​తో వివరించారు.

"ఆరోపణలను భారత్ బలంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాలపై రాజీపడేది లేదన్న సందేశాన్ని గట్టిగా వినిపించింది. వాక్​స్వాతంత్ర్యం పేరుతో కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదుల చర్యలను సమర్థించడం సరికాదని ట్రూడోకు భారత్ చాలా రోజుల నుంచి చెబుతూ వస్తోంది. గత కొద్ది సంవత్సరాల్లో కెనడాతో పాటు ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లో ఖలిస్థానీ కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఏడాది జూన్​లో ఖలిస్థానీ అనుకూల వర్గాలు ఒంటారియోలో పరేడ్​ నిర్వహించాయి. ఇందులో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన శకటాన్ని ప్రదర్శించారు. 'శ్రీ దర్బార్ సాహిబ్'పై దాడి చేసినందుకు ఇది ప్రతీకారం అంటూ శకటంపై నినాదాలు రాశారు. గతేడాది సెప్టెంబర్​లో ఒంటారియోలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అక్కడ ఖలిస్థాన్ నినాదాలు రాశారు. సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్​జే) ఖలిస్థాన్ అంశంపై కెనడాలో రిఫరెండమ్​లు నిర్వహిస్తోంది."
-హర్ష్ వీ పంత్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్

హిందువుల ఆందోళన.. కెనడియన్లకు ఇబ్బందులు!
'ట్రూడో వ్యాఖ్యలు స్వదేశంలోనూ ప్రతికూల వాతావరణానికి కారణమయ్యాయి. సిక్కు తీవ్రవాదులు దాడులు చేస్తారేమోనని హిందువులు ఆందోళనతో ఉన్నారు' అని పంత్ పేర్కొన్నారు. 'కెనడా పౌరులకు వీసాలు నిలిపివేయడం కూడా ఆందోళనకరమైన పరిణామమే. 16 లక్షల మంది భారత సంతతి వ్యక్తులు (పీఐఓలు) ఏడు లక్షల మంది ఎన్ఆర్ఐలు కెనడాలో ఉన్నారు. కెనడా జనాభాలో భారత సంతతి ప్రజలు మూడు శాతం. కెనడాలోని చాలా మంది పౌరులకు భారత్​తో సంబంధాలు ఉన్నాయి. కుటుంబాలు, వ్యాపారాల కోసం ఇక్కడికి తరచుగా వస్తుంటారు' అని పంత్ వివరించారు.

Canada PM Trudeau Statement : కెనడా కయ్యం.. రెచ్చగొట్టం అంటూనే కశ్మీర్​పై ట్రావెల్​ అడ్వైజరీ.. అమెరికా ఆందోళన

కెనడాతో బిజినెస్ కట్!
India Canada Trade :ట్రూడో భారత్​పై ఆరోపణలు చేయడానికి ముందే ఇరుదేశాల మధ్య 'స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం'పై చర్చలు నిలిచిపోయాయి. ఈనెల ప్రారంభంలో ఈ చర్చలను భారత్ నిలిపివేసింది. కెనడా భూభాగాన్ని విద్రోహ కార్యకలాపాలకు వినియోగించేందుకు అనుమతిస్తోందన్న కారణంతో న్యూదిల్లీ ఈ నిర్ణయం తీసుకుంది. వాణిజ్యపరంగా కెనడాపై భారత్ అతిగా ఆధారపడటం లేదు. కీలక వస్తువులేవీ ఆ దేశం నుంచి రావడం లేదు. కెనడా నుంచి దిగుమతులను తగ్గించి ఇతర సన్నిహిత దేశాల ద్వారా వాటిని భర్తీ చేసుకోవాలని భావిస్తోంది.

"ఖలిస్థానీ వేర్పాటువాదులపై తన వైఖరి ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ట్రూడో భావించి ఉండరు. భారత్​తో వాణిజ్య ఒప్పందం కెనడాకు మేలు చేసేది. ఇండో-పసిఫిక్ వ్యూహంలో కెనడాకు భారత్ అతి ముఖ్యమైన భాగస్వామి. జపాన్ తీరం నుంచి ఆఫ్రికా తూర్పు తీరాన్ని కలిపేలా కీలక ప్రాంతంలో భారత్ ఉందని కెనడా విదేశాంగ మంత్రి జులైలో పేర్కొన్నారు. కీలకమైన ఖనిజాల సరఫరాకు కెనడా విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని చెప్పారు. కానీ ట్రూడో ప్రస్తుత వైఖరి వల్ల.. ఆ దేశ ఇండో-పసిఫిక్ పాలసీపై ప్రభావం పడేలా కనిపిస్తోంది."
-హర్ష్ వీ పంత్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్

ఇండో పసిఫిక్​లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే దేశంగా భారత్​ను పశ్చిమ దేశాలు చూస్తున్నాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా భాగంగా ఉన్న క్వాడ్​లో భారత్ ఉంది. చైనాను దూకుడును ఎదురించేందుకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇవి పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖలిస్థానీ హత్య విషయంలో ఉద్రిక్తతలను ఈ స్థాయికి తీసుకొచ్చి ఉండాల్సింది కాదని ట్రూడోకు కెనడా సన్నిహిత దేశాలే చెబుతున్నాయి. అది అర్థం చేసుకొనే ట్రూడో రెండు రోజులు క్రితం స్వరం మార్చినట్లు స్పష్టమవుతోంది. గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్​లో మాట్లాడిన ట్రూడో.. భారత్​ను రెచ్చగొట్టేందుకు తాము ప్రయత్నించడం లేదంటూ పేర్కొన్నారు. సమస్యలను సృష్టించాలని అనుకోవడం లేదన్నారు. భారత్​కు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోందన్న విషయాన్నీ ప్రస్తావించారు.

Canada India Relationship : భారత్​-కెనడా విభేదాలకు కారణం ప్రధానే! రాజకీయ బలహీనత వల్లే ఇలా..

Canada Expels Indian Diplomat : భారత దౌత్యవేత్తను బహిష్కరించిన కెనడా.. దీటుగా బదులిచ్చిన మోదీ సర్కార్

ABOUT THE AUTHOR

...view details