పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సర్వదా కట్టుబడి ఉన్నట్టు ఇటీవలి తీర్పులతో భారత సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది. ఫలితంగా చట్టాలను దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవనే సంకేతాలు రాష్ట్రాలు, పోలీసు యంత్రాంగాలకు అందాయి. విమర్శకుల గొంతును నొక్కేందుకు, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ భద్రతా చట్టాన్ని ఉపయోగించలేవు. గడచిన కొద్ది వారాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, బహిరంగ వేదికలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, ఇతర న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే- హక్కులను కాపుగాయడంలో న్యాయపాలిక క్రియాశీల పాత్ర తేటతెల్లమవుతుంది.
కీలక తీర్పులు..
కరోనా విజృంభణ వేళ వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు మద్దతు ఇచ్చేది లేదని సర్వోన్నత న్యాయస్థానం కుండ బద్దలుకొట్టింది. పద్ధతులు మార్చుకోకపోతే సహించేది లేదని పలు హైకోర్టులు సైతం ఆయా రాష్ట్రాలకు సంకేతాలిచ్చాయి. మణిపూర్ రాజకీయ కార్యకర్త అరెస్టు, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ కన్వర్(కావడ్) యాత్ర, బక్రీద్ సమయంలో ఆంక్షలు సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గోమూత్రం, పేడలతో కరోనా నయమవుతుందన్న నేతల వ్యాఖ్యలపై మణిపూర్‌కు చెందిన ఎరిండ్రో లీచోంబమ్ ఫేస్‌బుక్ వేదికగా విమర్శలు చేశారు. వైజ్ఞానిక శాస్త్రం, ఇంగిత జ్ఞానాలే కరోనా నుంచి కాపాడతాయని హితవు పలికారు. ఆయనపై మణిపూర్ పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద నేరం మోపి రెండు నెలల పాటు జైలుపాలు చేశారు. ఈ కేసుపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎమ్.ఆర్. షా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం, లీచోంబమ్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.
కరోనా ముప్పుపై..
కరోనా వేళ కన్వర్ యాత్ర నిర్వహణ అంశాన్ని న్యాయస్థానం సు మోటోగా స్వీకరించింది. యాత్రలో భాగంగా ఉత్తరభారతం నలుమూలల నుంచి నుంచి లక్షలాది ప్రజలు హరిద్వార్‌కు వెళ్తారు. గంగా నదీ జలాలను కుండల్లో నింపుకొని సొంత గ్రామాలకు వెళ్ళి శివాలయాల్లో అభిషేకం చేయడంతో యాత్ర ముగుస్తుంది. కరోనా కారణంగా నిరుడు ఈ యాత్రను పూర్తిగా రద్దు చేశారు. ఈ ఏడాది మాత్రం యాత్రను నిర్వహించాలని ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రజారోగ్యం విషయంలో రాజీపడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపివ్వడంతో ఉత్తరాఖండ్ వెనక్కి తగ్గింది. ఉత్తర్ ప్రదేశ్ మాత్రం మొండికేసింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. యాత్రను నిర్వహించాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ బి.ఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఆరోగ్య సంరక్షణపై..