ప్రాణాలను కాపాడాల్సినవారే ప్రాణాపాయంలో పడితే ప్రజలకు ఏర్పడే ప్రమాదస్థాయిని ఊహించడం కష్టం. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువవుతూనే ఉంది. అక్టోబరు, నవంబరు వరకు కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉంటాయని అంచనా. వ్యాక్సిన్ సామాన్య జనానికి చేరేవరకు.. అంటే కనీసం ఇంకో పదినెలలు పరిస్థితులు ఇలాగే కొనసాగవచ్చని చెబుతున్నారు. పరీక్షలు పెరిగి, పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న కొద్దీ ఆరోగ్య సిబ్బంది కొరత అధికమవుతోంది. సరైన సదుపాయాలు లేకపోవడంతో వారి ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా తరచూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ డాక్టర్లు తమ ఇబ్బందులను బహిరంగంగా ప్రభుత్వాలకు విన్నవించడం, మౌన ప్రదర్శనలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. ఆరు లక్షల మంది ఆశా వర్కర్లు రెండు రోజుల సమ్మెకు దిగారు. తగిన వేతనాలు, పీపీఈ కిట్లు, ఇతర రక్షణ సామగ్రి కోరుతూ దేశరాజధానిలో ప్రదర్శన చేయడంతో వీరిపై ఎఫ్‌ఐఆర్‌లూ నమోదయ్యాయి.
మోగుతున్న ప్రమాద ఘంటికలు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం భారత్‌లో కొవిడ్‌వల్ల మరణిస్తున్నవారిలో 0.5శాతం వైద్యులే. బిహార్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ డాక్టర్ల మరణాల రేటు తొమ్మిదిరెట్లు ఎక్కువగా (4.75శాతం దాకా) ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది దేశ సగటును మించి 0.7 శాతంగా నమోదైంది. ఆగస్టు మొదటి వారానికి దేశవ్యాప్తంగా 196 మంది వైద్యులు కరోనాకు బలైనట్లు ఐఎంఏ ప్రకటించింది. మూడో వారానికి ఈ సంఖ్య 273కి చేరింది. వీరిలో ఎక్కువమంది జనరల్ ప్రాక్టీషనర్లు, యాభైకి పైబడిన వయసు కలిగినవారు ఉన్నారు. మన దేశంలో సుమారు 3.5 లక్షల మంది వైద్యులు కొవిడ్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నారు. ఒకరి మరణం వల్ల వేలమందికి సేవలు నిలిచిపోతాయి. చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. వైద్యులతోపాటు పారామెడికల్, మున్సిపల్, రెవిన్యూ, పోలీసు, ఆశా వర్కర్లు ఇంకా ఇతర విభాగాల సిబ్బందీ ప్రమాదం అంచున నిలబడి మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇటీవల 12 వేలమందికి పైగా పోలీసులకు కరోనా సోకడం పెద్దయెత్తున ఆందోళనకు కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పదుల సంఖ్యలో పోలీసులకు కరోనా సోకుతోంది. దిల్లీలోని ఒక్క ఎయిమ్స్‌లో జూన్ మొదటి వారానికే 480 మంది సిబ్బందికి వైరస్ సోకినట్లు తేలింది. పీపీఈ కిట్లు, నాణ్యమైన మాస్కులు, శానిటైజర్లు వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రి అందుబాటులో ఉండటం లేదు. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఆగస్టు రెండోవారానికి 3.04 కోట్ల మాస్కులు, 1.28 కోట్లకు పైగా పీపీఈ కిట్లు, 10.83 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు సరఫరా అయ్యాయి. వీటితోపాటు దేశీయంగా తయారైన 22,533 వెంటిలేటర్లనూ రాష్ట్రాలకు కేంద్రం పంపింది. చికిత్సలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు, పెంచేందుకు సంపూర్ణంగా సహకరిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో పీపీఈ కిట్ల తయారీకి దాదాపు 600 సంస్థలను ఎంపిక చేశారు.