భారత ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అయినప్పటికీ కరోనాపై పోరులో భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది. ఇందుకు కారణం దేశంలో రికవరీ రేటు, మరణాల రేటు చూస్తే అర్థమవుతుంది. దేశంలో మే 11 ఉదయానికి మొత్తం 67వేల 152 కేసులు నమోదయ్యాయి. 2,206 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 3.28శాతంగా, రికవరీ రేటు 31.15శాతంగా ఉన్నాయి. దేశ వైద్య వ్యవస్థపరంగా ఇది ఓ అద్భుతం.
కరోనాను కట్టడి చేయడంలో భారత్ విజయం సాధించిందనడానికి ఈ లెక్కలే ఉదాహరణ. అయితే ఇప్పుడు దేశానికి 'ఆర్థిక వ్యవస్థ' రూపంలో అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. వైరస్‌తో సహజీవనం చేయడం ప్రజలు నేర్చుకోవాలి. లాక్డౌన్ వల్ల డీలా పడ్డ ఆర్థిక వ్యవస్థను అతి త్వరగా పునరుద్ధరించాలి. రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ అనే భేదాలు లేకుండా ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించాలి.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 40కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి జారుకుంటారు. కరోనా వైరస్ వల్ల దేశ జీడీపీ 10-15 శాతం క్షీణిస్తుందని అంచనా వేశారు నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ. రోడ్లపై పరిస్థితులు ఇంకా దయనీయంగా ఉన్నాయి. తిండి, నీడ లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించకపోతే పరిస్థితులు చెయ్యి దాటిపోతాయి. పౌర నిరసనలు, హింసాత్మక ఘటనలు పెరుగుతాయి. పోషకాహార లోపం, అనారోగ్యాలతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు.
వైరస్‌తో సహజీవనం...
వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే. చరిత్రలో ఎన్నో వైరస్లు ప్రజలను భయపెట్టాయి. వాటిపై కొన్ని సార్లు మనం విజయం సాధించాం. మరికొన్ని సందర్భాల్లో వాటితో కలిసి జీవించడం అలవాటు చేసుకున్నాం. హెచ్ఐవీకి ఇంకా వ్యాక్సిన్ లేకపోవడమే ఇందుకు ఉదాహరణ. దానిపై ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నా ఇంకా ఎలాంటి ఫలితం లేదు.
మీడియాలో కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధిపై అనేక కథనాలు వస్తున్నాయి. కానీ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం అంత సులభం కాదు. అలాగే చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం మనం చేయాల్సిన ముఖ్య పని.
కరోనా అంటే ఎందుకు భయం?
కరోనా కన్నా క్షయ అతి భయానక వ్యాధి. క్షయ వ్యాధి సోకి ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి మనం ఆర్థిక వ్యవస్థను మూసివేయడం లేదు ఎందుకు? ఎన్నో లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉన్నారు కదా! మరి కరోనా అంటే ఎందుకు అంత భయం?
దేశంలో కరోనా మరణాలు రేటు చాలా తక్కువగా ఉంది. కరోనా కన్నా దిల్లీ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశాలే ఎక్కువ! వ్యాక్సిన్ లేకుండానే కరోనాపై పోరులో భారత్ ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరవాల్సిందే.