నేపాల్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను భారత్, చైనా క్షుణ్నంగా పరికిస్తున్నాయి. కేపీ శర్మ ఓలీ సిఫార్సు మేరకు నిరుడు డిసెంబరు 20న నేపాల్ పార్లమెంటు ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)ను రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ- ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. పార్లమెంటును రద్దు చేసే అధికారం నేపాల్ రాజ్యాంగం ప్రధానికి ఇవ్వలేదని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పేర్కొంది. సభను రద్దు చేసి తనకిష్టమైనప్పుడు మధ్యంతర ఎన్నికలకు వెళ్లే దిశగా ఓలీ వ్యవహరించడాన్ని తప్పు పట్టింది. 13 రోజుల(మార్చి ఎనిమిదో తేదీ)లోగా సభను తిరిగి సమావేశపరచాలంటూ ఫిబ్రవరి 23వ తేదీన ఆదేశించింది. ఓలీ చర్యలకు నిరసన తెలిపిన వారంతా సుప్రీం తీర్పు వెలువడిన అనంతరం సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని పదవి నుంచి దిగిపోతే తప్ప- ప్రతిపక్షాల నుంచి, తన మాజీ సహచరుల నుంచి ఓలీ అవిశ్వాస తీర్మాన ముప్పును ఎదుర్కోవలసిందే!
భారత్‌తో వివాదం
భారత్ - నేపాల్ 1,800 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య సంస్కృతి, చరిత్ర, భౌగోళిక, మతపరమైన అంశాల్లో సామీప్యత ఉంది. అందుకే నేపాల్‌లో జరిగే ఏ చిన్న పరిణామం ప్రభావమైనా ఇండియాపై ఉంటుంది. తొలి నుంచి కేపీ శర్మ ఓలీ ధోరణి భారత్‌కు కంటగింపుగానే ఉంది. గత ఏడాది జూన్‌లో ఓలీ నేతృత్వంలో నేపాల్ రాజకీయ చిత్రపటం (మ్యాప్) విడుదలైంది. అందులో లిపులేక్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను నేపాల్ భూభాగంలో కలపడం వివాదాస్పదమైంది. ఆ మ్యాప్ నేపాల్ పార్లమెంటు ఆమోదం పొందింది. నిరుడు మే ఎనిమిదో తేదీన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లిపులేక్ నుంచి కాలాపానీ వరకు రోడ్డు మార్గాన్ని ప్రారంభించడంపై నేపాల్‌లో వ్యతిరేకత వ్యక్తమయింది. లిపులేక్‌లోని భూభాగాన్ని తనదిగా నేపాల్ దీర్ఘకాలంగా చెబుతోంది. ఈ వివాదాల పరిష్కారానికి దిల్లీ కాఠ్‌మాండూల మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం కావలసి ఉంది. ఈ లోగా చోటు చేసుకుంటున్న పరిణామాలు నేపాల్‌లో అస్థిరతను మరింత ఎగదోసేలా ఉన్నాయి. మావోయిస్టుల తిరుగుబాటుతో రెండు దశాబ్దాలపాటు నేపాల్‌లో సంభవించిన హింసలో సుమారు 17 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొత్త రాజ్యాంగాన్ని ఇంకా పూర్తిస్థాయిలో అమలు చేయనేలేదు. ఆర్థిక వ్యవస్థ సైతం గాడిన పడలేదు. నిరుద్యోగిత తీవ్రంగా ఉంది. ఉపాధిని, ఇతర అవకాశాలను వెతుక్కుంటూ సరిహద్దుల్లోని యువత భారత్ సహా పలు పొరుగు దేశాలకు వెళుతున్నారు.