తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పోషకాహార లభ్యతపై ప్రభుత్వాల చిన్నచూపు! - ప్రపంచ ఆకలి సూచీ

కరోనా మహమ్మారి వేళ రోగనిరోధక శక్తికి తృణ ధాన్యాలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు పదేపదే చెబుతున్నారు. కానీ ఆహార భద్రత కల్పించడమంటే బియ్యం, గోధుమలు పండించి కిలో రూపాయికిస్తే చాలన్నట్లు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నందువల్లే పోషకాహార పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు ఏటా పడిపోతున్నాయి. ఇక చిరుధాన్యాల ప్రాధాన్యం గురించి ఎన్ని అధ్యయనాలు ఘోషిస్తున్నా- వాటి దిగుబడులను పెంచడంలో గానీ, ప్రజలకు వాటిని అందించడంలో గానీ ప్రభుత్వాలు చొరవచూపడం లేదు.

nutrition
పోషకాహారం

By

Published : Aug 8, 2021, 6:34 AM IST

కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ- రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు పదే పదే చెబుతున్నారు. భారత్‌లో కోట్లాది పేదలు రెండు పూటలా కడుపు నింపుకొనేందుకే ఎన్నో కష్టాలు పడుతున్నారు. చిరుద్యోగులు, పట్టణ-గ్రామీణ నిరుపేదలు, వలస కార్మికులకు పోషకాహార లభ్యత కష్టమే. చిరుధాన్యాల దిగుబడి తగ్గిపోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే పోషకాహారం అందుబాటులో లేకుండా పోతోంది. ఆహారభద్రత కల్పించడమంటే బియ్యం, గోధుమలు పండించి కిలో రూపాయికిస్తే చాలన్నట్లు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నందువల్లే- పోషకాహార పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు ఏటా పడిపోతున్నాయి. సాగు విధానాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడుతోంది. దీంతో దేశ ప్రజలకు పోషకాహార పంటల లభ్యత కష్టంగా మారింది. ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే కొర్రలు, సామలు, ఊదలు, రాగులు, అరికెలు వంటి చిరుధాన్యాల పంటల దిగుబడులు నిరుడు రికార్డు స్థాయిలో పడిపోయాయి. దేశీయ చిరుధాన్యాల దిగుబడి 14 సంవత్సరాల క్రితం(2007-08) 5.5 లక్షల టన్నులు ఉండేది. నిరుడు 3.2 లక్షల టన్నులు తగ్గినట్లు కేంద్ర వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడిస్తోంది. చిరు, తృణధాన్యాలన్నీ కలిపి చూసినా దిగుబడులు 14 ఏళ్ల క్రితంతో పోలిస్తే రెండు కోట్ల టన్నుల నుంచి 1.76 కోట్ల టన్నులకు పడిపోయాయి.

కొరవడిన అవగాహన

ప్రజారోగ్యం సంక్షోభంలో పడిన తరవాత వైద్యచికిత్సల పేరుతో భారీగా నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వాలు- అసలు ఆ పరిస్థితి రాకుండా నియంత్రించే పోషకాహారాన్ని ఎందుకు అందించలేక పోతున్నాయన్నది సామాన్యుడిని వేధించే ప్రశ్న. భారతదేశంలో గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపాలు అధికంగా ఉన్నాయని 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెప్పింది. ఈ సర్వే ప్రకారం 35.7శాతం బాలలు పోషకాహారం అందక, తగినంత బరువు లేరని గుర్తించారు. ఈ సర్వే ఇండియాలో మొట్టమొదట 1992-93లో చేసినప్పుడు నాలుగేళ్లలోపు బాలల్లో సగానికి సగం పోషకాహారలోపంతో బాధపడుతున్నట్లు తేలింది. అప్పుడు నాలుగేళ్లలోపు వయసు వారంతా ఇప్పుడు యువకులు. చిన్నతనంలో పోషకాహారం లేకపోవడంవల్లే వీరిలో అత్యధికులు నేడు కరోనా బారిన పడ్డారా అనేదీ పరిశీలనాంశం. 'ప్రపంచ ఆకలి సూచీ-2020' ప్రకారం ప్రపంచంలో 107 దేశాల్లో భారతదేశం 94వ స్థానంలో ఉంది. దాన్నిబట్టి ఇక్కడి బాలలు, గర్భిణులకు పోషకాహారం ఎంతమేర అందుతోందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో పిల్లలు, గర్భిణులకు పోషకాహారం అందించడానికి సగటున రూ.75 ఖర్చుపెడితే రూ.2,900 దాకా ఆర్థికరంగానికి ఆదాయం పెరుగుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రబలుతున్న వ్యాధుల్లో 15శాతం పోషకాహార లోపాలవల్లే దాపురిస్తున్నాయి. చిరుధాన్యాల ప్రాధాన్యం గురించి ఎన్ని అధ్యయనాలు ఘోషిస్తున్నా- వాటి దిగుబడులను పెంచడంలో గానీ, ప్రజలకు వాటిని అందించడంలో గానీ ప్రభుత్వాలు చొరవచూపడం లేదు. పురాతన కాలంలోనే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల ప్రజలు నిత్యాహారంలో చిరు, తృణధాన్యాలను వినియోగించేవారు. ఇప్పుడు అధునాతన ప్రపంచంలో విద్యావంతులైన వారు సైతం అవగాహన కొరవడి వాటిని తినలేకపోతున్నారు.

నాణ్యతే కీలకం

చిరు, తృణధాన్యాలతో తయారయ్యే అల్పాహార ఉత్పత్తుల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.15 వేల కోట్లకు పైమాటే. అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు ఈ ధాన్యాల్లో ఉండే పోషక విలువలను గుర్తించి, విరివిగా వినియోగిస్తున్నారు. ప్రపంచం మొత్తం చిరుధాన్యాల వినియోగంలో ఆఫ్రికా దేశాల వాటాయే 40శాతం. నైగర్‌, మాలీ, నైజీరియా, బుర్కినాఫాసో, సుడాన్‌ వంటి పేద దేశాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంది. అందుకే ఆయా దేశాల ప్రజల్లో పేగుక్యాన్సర్‌ బారిన పడేవారి సంఖ్య, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని ఓ అధ్యయనంలో గుర్తించారు. భారత్‌లో చిరు, తృణ ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరగాలంటే రైతులకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్‌ అవకాశాలను పెంచాలి. రైతుల ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేస్తామని నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ గడువు మరో ఏడాదిన్నరలో ముగుస్తుంది. ఇప్పటివరకు ఆ లక్ష్యం చేరే వ్యూహాలే కనిపించడం లేదు. ప్రభుత్వ లక్ష్య సాధనకు అధిక ఆదాయం వచ్చే పంటల సాగు విస్తీర్ణం పెంచడం ఎంతో అవసరం. ప్రజలకు ఆరోగ్యాన్ని, రైతులకు ఆదాయాన్ని పెంచడానికి తృణధాన్యాల పంటలు ఉపయోగపడతాయని ఇక్రిశాట్‌ వంటి అనేక ప్రపంచ వ్యవసాయ పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. వరిఅన్నం తినడం వల్ల మధుమేహం వంటి వ్యాధులు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు. సంపన్న కుటుంబాలకు చెందినవారిలో పలువురు వరి అన్నం తినేందుకు సుముఖంగా లేరు. బియ్యాన్ని కిలో రూపాయికి ఇచ్చి పేదల ఆకలి తీరుస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రజల ఆకలి తీర్చడం ఎంత అవసరమో, అందరికీ ఆరోగ్యాన్నిచ్చే పోషకాహారాన్ని అందించడం అంతకన్నా కీలకమని పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అప్పుడే పలు రకాల రోగాల బారి నుంచి దేశాన్ని రక్షించేందుకు మార్గం సుగమమవుతుంది.

ప్రపంచ విపణిలో భాగస్వామ్యం కరవు

ప్రస్తుతం ప్రపంచ చిరుధాన్యాల మార్కెట్‌ విలువ రూ.75 వేల కోట్లు. వచ్చే అయిదేళ్లలో ఇది రూ.90 వేల కోట్లకు పెరగవచ్చని అంచనా. మన రైతులు అందులో భాగస్వాములై ఆదాయం పెంచుకునే దిశగా రాష్ట్రాల్లో గట్టి ప్రయత్నాలే జరగలేదు. చిరు, తృణధాన్యాలు పండించాలనుకునే కర్షకులకు ప్రోత్సాహకాలు గానీ, మార్గదర్శక విధానాలు గానీ లేకపోవడం దురదృష్టకరం. వరి, గోధుమ పంటలకు సాగునీటి వినియోగం ఎక్కువ. అంతకన్నా చాలా తక్కువ నీటితో లేదా వర్షాధారంగా చిరుధాన్యాలు పండించవచ్చు. వరి, గోధుమలకన్నా చిరుధాన్యాల్లో ఎక్కువ పోషకాలు- ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తేల్చారు. కానీ ఈ పంటల సాగు, దిగుబడులు తక్కువగా ఉన్నందువల్ల, వినియోగదారులు కొనాలంటే చిల్లర ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. సామలు, అరికెలు, కొర్రలు వంటివి కొనాలంటే కిలో రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించాల్సిందే. అంత ధర పెట్టి సామాన్యులు ఎలా కొని తినగలరనేది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం.

- మంగమూరి శ్రీనివాస్‌

ఇదీ చూడండి:అందరికీ అందని సూక్ష్మ పోషకాలు

ABOUT THE AUTHOR

...view details