తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం జలాశయంలో భారీ ఎత్తున పూడిక పేరుకుపోయింది. ఫలితంగా ఆ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఏటా రెండు నుంచి మూడు టీఎంసీలదాకా తగ్గుతోంది. శ్రీశైలం అసలు నీటి నిల్వ సామర్థ్యం 308.60 టీఎంసీలు; ప్రస్తుతం అది 215.80 టీఎంసీలకు పడిపోయింది. అంటే, దాదాపు 92టీఎంసీల నిల్వ తగ్గింది. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకే పూడిక సమస్య అధికంగా ఉన్నట్లు గతేడాది కేంద్రం స్పష్టంచేసింది. పూడిక వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలోని జలాశయాలు 50శాతం నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినట్లు అంచనా. పూడిక వల్ల నాగార్జునసాగర్ జలాశయం 40.73శాతం నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినట్లు 2009లోనే గుర్తించారు. తెలంగాణలోని నిజాంసాగర్ జలాశయం 60.47శాతం నీటి నిల్వను కోల్పోయినట్లు 1992 సర్వేలో వెల్లడైంది.
అవరోధంగా పూడిక సమస్య..
కేంద్ర జల్‌శక్తి శాఖ గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదికల ప్రకారం దేశంలోని జలాశయాలన్నీ కలిపి ప్రస్తుతం 25 వేల కోట్ల ఘనపు మీటర్లకు పైగా నీటిని నిల్వ చేయగలవు. దీన్ని భవిష్యత్తులో 38 వేల కోట్ల ఘనపు మీటర్లకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. నానాటికీ అధికమవుతున్న పూడిక సమస్య ఆ లక్ష్యానికి అవరోధంగా నిలుస్తోంది. దక్షిణ భారతదేశంలో 36 జలాశయాల్లో పూడిక సమస్య అధికంగా ఉంది. ఫలితంగా వాటి వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం ఇప్పటికే 39శాతం కోసుకుపోయినట్లు జల్‌శక్తి నివేదిక స్పష్టంచేసింది. పూడిక వల్ల ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన స్థాయిలో నీటి సరఫరా అందదు. జలాశయ సొరంగాలు, గోడలు వంటివన్నీ దెబ్బతింటాయి. పూడికకు దగ్గరలోని పవర్ టర్బైన్లు సైతం పాడవుతాయి. సిమ్లాలో 412 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే రామ్‌పూర్ ప్రాజెక్టులో పూడిక ఎక్కువవడంతో విద్యుదుత్పత్తిని నిలిపివేయవలసి వచ్చింది. పూడిక తొలగించాకే మళ్ళీ ఉత్పత్తి మొదలైంది. దేశంలోని అతి పెద్ద జలాశయాల్లో ఒకటైన పంజాబ్‌లోని భాక్రా ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 927 కోట్ల ఘనపు మీటర్లు. పూడిక వల్ల 213 కోట్ల ఘనపు మీటర్ల మేర అందులో నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. తుంగభద్ర జలాశయంలో సైతం పూడిక సమస్య తీవ్రంగా ఉంది. కర్ణాటకలోని నారాయణపూర్, మలప్రభ జలాశయాలు సైతం పూడిక వల్ల గరిష్ఠ నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి.