కరోనా మహమ్మారి ఆరోగ్య రంగాన్నే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసింది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సెస్ రూపంలో అదనపు పన్నులు విధించడానికి అనుమతించాలని మే నెలాఖరులో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో సిక్కిం సర్కారు ప్రతిపాదించింది. దీనికి గోవా, అరుణాచల్‌ప్రదేశ్ పాలకులు వంతపాడారు. ఈ ప్రతిపాదనపై చర్చించడానికి మంత్రుల బృందం ఏర్పాటుకు జీఎస్టీ మండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొవిడ్ సెస్‌పై 2021-22 కేంద్ర బడ్జెట్ సమయంలో జోరుగా ఊహాగానాలు సాగాయి. కానీ, దానివల్ల నష్టమే ఎక్కువగా ఉండటంతో కేంద్రం ఆ ఆలోచనను విరమించుకుంది. కరోనా రెండో దశ వ్యాప్తితో కోట్ల జీవితాలు కుదేలవడంతో అదనపు పన్నుల ఊసే తలెత్తి ఉండకూడదు. కానీ, ప్రజావ్యతిరేక ఆలోచనలు మళ్లీ మొగ్గతొడిగాయి! సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే తప్పులు చేస్తున్నాయనడానికి ఇదో నిదర్శనం. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు చర్యలు తీసుకోకుండా, సమస్యల పరిష్కారానికి కేంద్రం సైతం సులభమైన మార్గాలను అన్వేషిస్తోంది. ఇటువంటి పద్ధతులు దీర్ఘకాలంలో దేశానికి చేటుచేస్తాయి.
పన్నుల మోత
తప్పుడు నిర్ణయాల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడో అస్తవ్యస్తమైంది. మూలిగే నక్కపై తాటిపండులా కరోనా సంక్షోభం అదనంగా వచ్చిపడింది. దీని పేరు చెప్పుకొని తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గత ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోకుండా, పరోక్ష పన్నులను భారీగా పెంచుకుంటూ పోయాయి. ఇప్పుడు కొవిడ్ సెస్‌ను అమలు చేస్తే- నోట్ల రద్దు, జీఎస్టీ, వ్యయ విధానాల కోసం పరోక్ష పన్నులపై ఆధారపడటం వంటి పొరపాట్లలోకి ఇదీ చేరుతుంది. ఆదాయం, సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరూ సమానంగా కట్టాల్సిన పరోక్ష పన్నులు పేదలపై అధిక భారాన్ని మోపుతున్నాయి.
స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ)లో ప్రత్యక్ష పన్నుల వాటా 15ఏళ్ల కనిష్ఠానికి పడిపోయి 4.79 శాతానికి చేరింది. పరోక్ష పన్నుల వాటా నాలుగేళ్ల గరిష్ఠమైన 5.48 శాతాన్ని అందుకుంది. 2021 ఆర్థిక ఏడాదిలో స్థూల పన్ను ఆదాయం 0.73 శాతం పెరిగింది. ఎక్సైజ్ సుంకం సేకరణ రూ.3.89 లక్షల కోట్ల (మునుపటి కంటే 63శాతం ఎక్కువ)కు చేరగా, కస్టమ్స్ సుంకం వసూళ్లు రూ.1.35 లక్షల కోట్లకు(23శాతం ఎక్కువ) పెరిగాయి. అధిక పరోక్ష పన్నుల మూలంగానే ఈ సుంకాల వసూళ్లు ఇంతలంతలవుతున్నాయి. సర్‌ఛార్జీలనేవి 1941 నుంచే తెలిసినా.. 'సెస్'ల బాదుడు మాత్రం 2005 తరవాతే అధికమైంది. సెస్ రూపంలో వచ్చిన సొమ్మును ప్రత్యేక అవసరాల కోసం వినియోగిస్తారు. అవి భారత ఏకీకృత నిధి (సీఎఫ్‌ఐ)లోకి వెళ్లవు. అందువల్ల అవి రాష్ట్రాలకు చేరవు. ఆర్థిక సంఘం నిర్దేశించినట్లుగా కేవలం ఏకీకృత నిధిలోని రెవిన్యూ వసూళ్లనే కేంద్రం రాష్ట్రాలతో పంచుకుంటుంది. సర్‌ఛార్జీలను అత్యవసర సమయాల్లో కాకుండా ప్రభుత్వాలు ఇష్టారీతిలో అమలు చేస్తూ వస్తున్నాయి. జీఎస్టీ వచ్చాక ఈ పద్ధతి మరింత ఘోరంగా మారింది.
జీఎస్టీతో పరోక్ష పన్ను వ్యవస్థ సులభతరం అవుతుందని, పన్ను స్లాబులు తగ్గిపోతాయని, పారదర్శకత ఎక్కువగా ఉంటుందని కేంద్రం హామీ ఇచ్చింది. ఇవేమీ నెరవేరలేదు సరికదా, పరోక్ష పన్నులు భారీగా పెరిగాయి. 2011-12లో స్థూల పన్ను ఆదాయాల్లో 10.4శాతంగా ఉన్న వీటి వాటా 2021 మార్చి నాటికి 19.90 శాతానికి ఎగబాకింది. 2012-20 మధ్య కాలంలో కేంద్రానికి సెస్, సర్‌ఛార్జీల రూపంలో వచ్చే ఆదాయం రెండింతలైంది. జీఎస్టీ పరిహార సెస్‌తో పాటు ఇతర సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో 2021-22లో కేంద్రం 4.74 లక్షల కోట్ల రూపాయలను ఆర్జిస్తుందని అంచనా. ఇందులో ప్రత్యక్ష పన్నులపై విధించే సెస్, సర్‌ఛార్జీల మొత్తం కేవలం 1.47 లక్షల కోట్ల రూపాయలే. మిగిలినవన్నీ పరోక్ష పన్నులపై వచ్చేవే. ఇవే కాకుండా సుంకాలు, అదనపు సుంకాలు, ప్రత్యేక అదనపు సుంకాలంటూ ప్రభుత్వం మరో రూ.1.27 లక్షల కోట్లనూ వసూలు చేయబోతోంది!