Goa assembly election 2022: పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల్లో విజయం తరవాత గోవాలోనూ భాజపాను మట్టి కరిపించగల సత్తా తనకుందన్న ధీమాతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా ఇతర పక్షాల నేతలను ఆకర్షించి రాష్ట్రంపై పట్టు సాధించాలని ప్రయత్నించారు. ఆ వ్యూహం బెడిసికొట్టింది. గోవా ఎన్నికల్లో టీఎంసీకి ప్రస్తుతం అభ్యర్థులే కరవయ్యారు. కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్న అలెక్సో లారెన్కో నెల రోజులకే టీఎంసీని వీడి వెళ్ళిపోయారు. అభ్యర్థుల కొరత కారణంగా ఇటీవల టీఎంసీలో చేరిన గోవా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఒకప్పటి ముఖ్యమంత్రి లూయిజినో ఫలేరోను ఫాటోర్డా నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని మమత నిర్ణయించారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తే గోవాలో ప్రచార కార్యక్రమాలు చూసుకుంటానని పార్టీలో చేరేముందు ఫలేరో పేర్కొన్నారు. రాజ్యసభ సీటుతోపాటు టీఎంసీ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఆయన్ను వరించాయి. అకస్మాత్తుగా- తనకు పూర్తిగా కొత్తదైన ఫాటోర్డా నుంచి పోటీ చేయాలని చెప్పడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. ఆ క్రమంలో ఫలెరో సైతం టీఎంసీని వీడి వెళ్తారన్న ఊహాగానాలు వినిపించాయి. ఫాటోర్డా నుంచి వేరే అభ్యర్థిని బరిలోకి దింపుతామని, తాను టీఎంసీని వీడి వెళ్ళబోనని ఫలేరో తాజాగా ప్రకటించారు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా చర్చిలు..
Goa election congress
గోవాలో 30శాతానికి పైగా ఉన్న ముస్లిములు, క్రైస్తవ ఓటర్ల మద్దతు కాంగ్రెస్‌కు ఉంది. క్రిస్టియన్ల ఓట్లపై చర్చిల ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్‌కు అనుకూలంగానే చర్చిల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు సైతం హస్తం పార్టీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. గోవాలో గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి ఒక్క సీటూ లభించలేదు. ఆ తరవాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆప్ పెద్దయెత్తున ప్రజలకు ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసింది. దాని గురించి మీడియాలో విస్తృతంగా ప్రచారం లభించేలా చూసుకుంది. అయితే ఇతర పక్షాల నేతలను చేర్చుకొని వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా ఆప్ సైతం అన్ని పార్టీల వంటిదే అని నిరూపించుకుంది.
BJP in Goa election 2022
నాలుగు నెలలుగా గోవాను రాజకీయ నేతల రాజీనామాలు ముంచెత్తుతున్నాయి. వచ్చే నేతలు, పోయే నాయకులతో పార్టీల కార్యాలయాలు విమానాశ్రయాలను తలపిస్తున్నాయి. ఎన్నికల తరవాత ఆ పరిస్థితిలో మార్పు ఉంటుందా అంటే, లేదు అన్న విశ్లేషణలే వినిపిస్తున్నాయి. గత గోవా ఎన్నికల్లో కమలం పార్టీ 13 సీట్లు మాత్రమే సాధించినా, అధికారాన్ని అందిపుచ్చుకోగలిగింది. ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రభుత్వ వైఫల్యాలతో ఈసారి పరిస్థితి క్లిష్టంగానే కనిపిస్తోంది. 'ఓడినా, గెలిచినా మనమే పాలన సాగించాలి' అన్న సూత్రాన్ని రాష్ట్ర భాజపా పాటిస్తుండటంతో పరాజయం గురించి ఆ పార్టీ పెద్దగా భయపడుతున్నట్లు లేదు!
కాంగ్రెస్‌లో ఫిరాయింపులు..
పార్టీ ఫిరాయింపులతో విసుగెత్తిపోయిన కాంగ్రెస్- తన అభ్యర్థులను ఆలయాలు, చర్చిలు, దర్గాలకు తిప్పి ఎన్నికల్లో గెలిస్తే పార్టీ మారబోమని ప్రమాణం చేయించింది. ఆప్ సైతం పార్టీ విధేయత విషయంలో అభ్యర్థుల నుంచి ప్రమాణపత్రాలపై సంతకాలు తీసుకోవాలని భావిస్తోంది. వాటివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గోవాలో అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా చిన్నవి. ఒక్కోదానిలో సగటున ముప్ఫై వేల కంటే తక్కువ ఓటర్లే ఉంటారు. స్థానికంగా ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించేలా చూడటం, ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు, వివాహాల సమయంలో ఆర్థిక సహాయం చేయడం, రవాణా సౌకర్యాలు కల్పించడం ద్వారా నాయకులు తమ నియోజకవర్గాల్లో పటిష్ఠ ఓటు బ్యాంకును నిర్మించుకున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లల ఫీజులు సైతం నేతలు చెల్లిస్తున్నారు. కొల్లగొట్టిన ప్రభుత్వ నిధులనుంచి కొంత మొత్తాన్ని ఓటర్లకు వెచ్చించి వారి మద్దతు తమకు దక్కేలా చూసుకుంటున్నారు. అటువంటి నేతలు గోవాలో రాజకీయ పార్టీలను మించి ఎదిగిపోయారు. ఏ పార్టీలో ఉన్నామన్నది వారికి అనవసరం. ప్రజలూ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. తమకు సాయం చేసిన నేతల రుణం తీర్చుకోవాలన్న భావనలోనే ఓటర్లు ఉన్నారు. అందుకే నేతలు యథేచ్ఛగా పార్టీలు మారుతున్నారు. 2019లో కాంగ్రెస్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీనుంచి తన గూటికి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా భాజపా చాలాకాలంగా నానుస్తూ వస్తోంది. తద్వారా భవిష్యత్తులో ఫిరాయింపులకు పాల్పడే నేతలకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తదన్న సంకేతాలను కమలం పార్టీ పంపుతోంది.
- అరుణ్ సిన్హా
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:గిరాకీని పెంచే బడ్జెట్‌పై ఆశలు.. దేశార్థికానికి ఊపు తెస్తుందా?