తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అన్నార్తులకు ఆసరాగా 'గరీబ్ కల్యాణ్' - eenadu editorial today

పనీపాటలు కుంగి, ఉపాధి అవకాశాలు మూసుకుపోయిన కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో- రెక్కాడితేనే గాని డొక్కాడని బడుగుజీవుల కడుపు నింపేలా కేంద్రప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి మూడు నెలలపాటు వర్తించేలా రూ.60 వేలకోట్లతో గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనకు శ్రీకారం చుట్టింది. దీనిని మరో మూడు నెలల పొడిగించటం అన్నార్తులకు ఆసరాగా నిలుస్తుంది.

Garib Kalyan
గరీబ్ కల్యాణ్

By

Published : Jul 2, 2020, 8:20 AM IST

సామాజిక ఆర్థిక రంగాల్లో పెను సంక్షోభాన్ని సృష్టించిన కొవిడ్‌ మహమ్మారి- భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సంక్షేమ రాజ్యభావనకే అగ్నిపరీక్ష పెడుతోంది. దశాబ్దాలుగా పేదరికమూ రాజకీయ ముడిసరకుగా మారిపోయిన నేపథ్యంలో, ఇదమిత్థంగా దేశంలో నిరుపేదల సంఖ్య ఎంత అన్నది తెలియని దురవస్థ నెలకొంది. ఇండియాలో పేదల సంఖ్య 8.4కోట్లని ఇటీవలి అధ్యయనమొకటి చాటుతున్నా- ఎకాయెకి 80 కోట్లమంది జనావళికి ఆహార భద్రతా హక్కు చట్టాన్ని వర్తింపజేస్తున్న దేశం మనది.

పనీపాటలు కుంగి, ఉపాధి అవకాశాలు మూసుకుపోయిన సంక్లిష్ట పరిస్థితుల్లో- రెక్కాడితేనే గాని డొక్కాడని బడుగుజీవుల కడుపు నింపేలా కేంద్రప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి మూడు నెలలపాటు వర్తించేలా రూ.60 వేలకోట్లతో గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనకు శ్రీకారం చుట్టింది. ఈ నెలారంభం నుంచి దిగ్బంధం సడలింపుల్లో మలిదశను మొదలు పెట్టినా, నిరుపేదలెవరూ ఆకలితో అలమటించరాదన్న సత్సంకల్పంతో మోదీ ప్రభుత్వం- మరో రూ.90 వేలకోట్ల వ్యయభారానికి సిద్ధపడి అన్న యోజనను మరో అయిదు నెలలు పొడిగించింది. ఎఫ్‌సీఐ చెంత దాదాపు 9.8కోట్ల టన్నుల బియ్యం, గోధుమ నిల్వలు పోగుపడటం- కరోనా సంక్షోభ కాలంలో ఎంతగానో అక్కరకొస్తోంది.

వలస కూలీలకు..

జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని ఎనిమిది కోట్లమంది వలస శ్రామికులకూ నెలవారీ తలా అయిదు కిలోల ఆహార ధాన్యాల సరఫరాకు కేంద్రం సిద్ధపడటానికి ఆ ధీమాయే కారణమవుతోంది. కేంద్రం చూపిన ఈ మానవీయ చొరవకు ఏ రాజకీయ మైల సోకకుండా, అవినీతి చెద పట్టకుండా అట్టడుగు వర్గాల ఆకలి తీర్చేందుకు అన్ని రాష్ట్రాలూ నిబద్ధంగా కృషి చెయ్యాల్సిన సమయమిది!

ఆదాయమూ ముఖ్యమేనని..

ఎన్నో యుద్ధాల పెట్టుగా విరుచుకుపడిన కరోనా ప్రపంచవ్యాప్తంగా కోటిమందికి పైగా సోకి అయిదు లక్షలమందికి పైగా అభాగ్యుల్ని బలిగొన్నా ఉచ్చ దశకింకా అది చాలా దూరంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. విశ్వవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగం అమెరికా, బ్రెజిల్‌, రష్యా, ఇండియాల్లోనే పోగుపడ్డాయి. కాలక్రమంలో కరోనా వైరస్‌ ఉత్పరివర్తనాలు చెందుతూ మరింత అంటువ్యాధిగా మారుతోందని పరిశోధకులు పేర్కొంటున్న వేళ- ఆ మహమ్మారిని కాచుకొనే క్రమంలో, సడలని సంకల్ప దీక్షతో జన ఆక్షౌహిణులు కదలాలి.

అందుకు భిన్నంగా జరుగుతోందంటూ ప్రధాని వ్యక్తీకరించిన ఆందోళన నానాటికీ పెరుగుతున్న కేసుల రూపేణా ప్రతిఫలిస్తోంది. ప్రజల ప్రాణాల్ని కాపాడుకోవడమే ముఖ్యమంటూ మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించిన కేంద్రం- జీవనోపాధినీ కాచుకోవాలన్న లక్ష్యంతో జూన్‌ ఒకటి నుంచి సడలింపులకు శ్రీకారం చుట్టింది. కరోనా కట్టడికి సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకొంటూ అత్యవసర పనులకు హాజరు కావాల్సిన పరిస్థితుల్లో- దాన్ని ఆటవిడుపుగా భావించబట్టే కొవిడ్‌ చుట్టుముడుతోంది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల కేసులు, 12వేల మరణాలు ఒక్క జూన్‌ నెలలోనే నమోదు కావడం- జనం స్వేచ్ఛగా వెళ్ళి కరోనా ఉచ్చులో చిక్కుకొన్నారనడానికి సంకేతం.

కరోనా కేసుల పెరుగుదల రేటులో బ్రెజిల్‌ తరవాత ఇండియా రెండో స్థానంలో నిలవడం తీవ్రాందోళనకరం. వ్యాధినుంచి కోలుకొంటున్నవారి సంఖ్య 60శాతానికి చేరడం, మరణాల రేటూ తక్కువగానే ఉండటం సాంత్వన కలిగించేవే అయినా- కేసుల ఉద్ధృతికి కళ్ళెం పడాలంటే, ప్రతి ఒక్కరూ చేతుల పరిశుభ్రత, మాస్కులు ధరించడం భౌతిక దూరం వంటి నిబంధనల్ని నిష్ఠగా పాటించాల్సిందే. కొవిడ్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేలోగా పొంచిఉన్న ముప్పు పట్ల కుటుంబాలూ సమాజమూ సదవగాహనతో స్పందిస్తూ నిబంధనలకు కట్టుబడటం ద్వారానే కరోనా కోరలు పెరకగలిగేది!

ABOUT THE AUTHOR

...view details