విద్యావంతులు, ఉద్యోగులు ముఖ్యంగా యువత- అప్పు కావాలంటే డిజిటల్ పద్ధతినే ఎంచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో అప్పు అడగడం, కావాల్సిన పత్రాలను పంపించడం, రుణం మంజూరు కాగానే నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమకావడం- ఇదంతా గంటల్లో పూర్తయిపోతుంది. ఆన్‌లైన్‌లో రుణాలిచ్చే ఇలాంటి డిజిటల్ లెండింగ్ ఫ్లాట్‌ఫామ్(డీఎల్‌పీ)లు గత మూడు, నాలుగేళ్లుగా దేశంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. వేగంగా వృద్ధి చెందే వ్యాపారం కావడంతో అంకుర సంస్థలూ దీనిలోకి ప్రవేశించాయి. ఇలాంటి వాటిలో ప్రముఖమైన క్యాష్‌ఈ 2017 నుంచి రూ.1,700 కోట్లను రుణాలుగా ఇచ్చింది. పాతికేళ్లలోపు యువతే తమ ప్రధాన ఖాతాదారులని, వారు తీసుకునే సరాసరి రుణం రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఉందని క్యాష్‌ఈ వెల్లడించింది. దాదాపు 70 కోట్ల మంది అంతర్జాల వినియోగదారులున్న భారత్- అంతర్జాతీయ కంపెనీలకు బంగారు బాతులా కనిపిస్తోంది. అందుకే విదేశీ కంపెనీలు మన దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టి, యాప్‌ల ద్వారా ఎక్కువ మందికి రుణాలిస్తున్నాయి.
సక్రమ వినియోగంతో వృద్ధికి ఊతం
ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం మనదేశ జనాభాలో కేవలం పది శాతానికే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల ద్వారా రుణం అందుతోంది. మిగిలినవారు అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ఈ రుణ యాప్‌లు, డీఎల్‌పీలు చేదోడు అవుతున్నాయి. 2015లో దేశంలో రూ.2.40 లక్షల కోట్ల రూపాయలున్న ఆన్‌లైన్ రుణాల వ్యాపారం 2020 నాటికి రూ.10 లక్షల కోట్లు దాటిందని గణాంక సంస్థ స్టాటిస్టా వెల్లడించింది. 2023 నాటికి ఇది మరింత పెరిగి డిజిటల్ రుణాలు ఏకంగా రూ.73 లక్షల కోట్లకు చేరతాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అంచనా వేసింది.
డీఎల్‌పీలు అడిగిన వెంటనే అప్పులు (ఇన్‌స్టంట్ లోన్స్) ఇస్తాయి. అవసరాలకు పనికొస్తోందని వినియోగదారులు భావిస్తుంటే- ఇదే అదనుగా వారిని వంచించేందుకు చాలా డీఎల్‌పీలు పుట్టుకొచ్చాయి. ఆర్‌బీఐ అనుమతి లేకుండానే లావాదేవీలు సాగిస్తున్నాయి. ఈ అక్రమ యాప్‌లు 1.4 కోట్ల లావాదేవీల ద్వారా దాదాపు రూ.21 వేేల కోట్ల వ్యాపారం చేశాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో తేలింది. వీటి దగ్గర రుణాలు తీసుకున్నవారు ఆ అప్పులు తీర్చడానికి మరో కంపెనీని ఆశ్రయించడం, దాన్ని తీర్చడానికి మరోచోట... ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు భరించలేక పదుల సంఖ్యలో రుణగ్రహీతలు బలవన్మరణాలకు పాల్పడటంతో తెలంగాణ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. చైనాకు చెందిన ల్యాంబోతో పాటు 21 మందిని అరెస్టు చేశారు.
అమెరికా, కెనడా, యూకే, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో అంతర్జాల వేదికగా రుణాలు ఇవ్వడం తొలుత ప్రారంభమైంది. అయితే అక్కడి ఆర్థిక నియంత్రణ సంస్థలు పటిష్ఠమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పరచడంతో డిజిటల్ రుణ కంపెనీలు కట్టుదాటకుండా వ్యవహరిస్తున్నాయి. మనదేశంలో ఇలాంటి సంస్థల్లో కొన్ని రుణాల మంజూరుకు అవసరమైన పత్రాలు తీసుకునే దగ్గర నుంచి వాటిని తిరిగి చెల్లించడం వరకు నిబంధనలను తుంగలో తొక్కుతున్నా దీన్ని నియంత్రించే యంత్రాంగం కరవైంది. ఇలాంటి సంస్థల్లో చైనా కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో చాలా యాప్‌లు తాము సేకరించిన పౌరుల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయనే సందేహాల నేపథ్యంలో ప్రభుత్వం నిరుడు డిసెంబర్‌లో 27 రుణ యాప్‌లపై నిషేధం విధించింది. గూగుల్ సైతం 100 నకిలీ రుణ యాప్‌లను గుర్తించి తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది.