తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ.. భారత్‌పై ప్రభావమెంత? - మారిన్‌ లి-పెన్‌

France presidential election 2022: ఫ్రాన్స్​ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. గత ఆదివారం తొలి విడత ఎన్నికలు జరగ్గా.. ఏ ఒక్క అభ్యర్థికీ 50శాతానికి మించి ఓట్లు రాలేదు. గతంతో పోలిస్తే ఈసారి ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారం చాలా చప్పగా సాగిందన్న విమర్శలు ఉన్నాయి. సరికొత్త రాజకీయ ఆలోచనలు, సరైన దార్శనికత ప్రచారంలో కొరవడ్డాయని ఓటర్లు పెదవి విరుస్తున్నారు. ఈనెల 24న రెండో రౌండ్​ ఎన్నికలు నిర్వహించనున్నారు.

France presidential elections
ఇమాన్యుయెల్‌ మేక్రాన్‌, మారిన్‌ లి-పెన్‌

By

Published : Apr 16, 2022, 7:40 AM IST

France presidential election 2022: ఐరోపా సమాఖ్యలో భాగమైన ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. గత ఆదివారం జరిగిన తొలి విడత ఎలక్షన్లలో ఏ అభ్యర్థికీ 50శాతానికి మించి ఓట్లు లభించలేదు. దాంతో ఈ నెల 24న రెండో రౌండ్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్ష బరిలో మొత్తం 12 మంది అభ్యర్థులు నిలిచారు. తొలి విడతలో ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మేక్రాన్‌కు దాదాపు 28శాతం ఓట్లు లభించాయి. నేషనల్‌ ఫ్రంట్‌కు చెందిన జాతీయవాద నేత మారిన్‌ లి-పెన్‌ 23శాతం ఓట్లతో మేక్రాన్‌కు గట్టి పోటీ ఇచ్చారు. వీరిద్దరి మధ్యనే ప్రస్తుతం ప్రధాన పోరు నెలకొంది. మరో అతివాద నేత జాన్‌-లుక్‌ మిలోన్షో 21.95శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. రెండో విడతలో విజయాన్ని నిర్ణయించడంలో మిలోన్షో మద్దతు ఓటర్లు కీలకంగా నిలవనున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2017 అధ్యక్ష ఎన్నికల్లో లి పెన్‌పై 30 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించిన మేక్రాన్‌ పిన్న వయస్కుడైన ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.

గతంతో పోలిస్తే ఈసారి ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారం చాలా చప్పగా సాగిందన్న విమర్శలు ఉన్నాయి. సరికొత్త రాజకీయ ఆలోచనలు, సరైన దార్శనికత ప్రచారంలో కొరవడ్డాయని ఓటర్లు పెదవి విరుస్తున్నారు. ఫలితంగా చాలా మంది ఈసారి పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారు. ఈదఫా దాదాపు 75శాతం పోలింగ్‌ మాత్రమే నమోదయ్యింది. తొలి రౌండ్‌ ఎన్నికల్లో తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థుల మద్దతుదారులు రెండో విడతలో మేక్రాన్‌ వైపే నిలిచే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లి పెన్‌ ఆలోచనలు, భావాలు దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభివర్ణిస్తూ గత ఎన్నికల్లో ఓటర్లను మేక్రాన్‌ తనవైపు తిప్పుకోగలిగారు. ఈసారి అది ఎంతవరకూ ఫలిస్తుందన్నదానిపైనా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

ఐరోపా సమాఖ్యనుంచి బ్రిటన్‌ వైదొలగిన (బ్రెగ్జిట్‌) పరిణామాలను ఎదుర్కోవడం, కరోనా మహమ్మారిపై పోరాటం, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించడంలో మేక్రాన్‌ సమర్థంగా వ్యవహరించారన్న పేరు ఉంది. కానీ, తన హయాములో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై చాలామందిలో అసంతృప్తి నెలకొంది. తొలి విడత ఎన్నికల్లో అది ప్రస్ఫుటమైంది. తాను మళ్ళీ అధికారంలోకి వస్తే పన్నులు తగ్గించడంతోపాటు, ఉద్యోగ విమరణ వయసును 65 ఏళ్లకు పెంచుతానని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని మేక్రాన్‌ హామీ ఇచ్చారు. లీ పెన్‌ మాత్రం నానాటికీ భారంగా మారుతున్న జీవన వ్యయాలను లక్ష్యంగా చేసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే ఆర్థికంగా ఫ్రాన్స్‌కు పూర్వవైభవం తెస్తానని చెబుతున్నారు.

ఐరోపా సమాఖ్యతో (ఈయూ), అందులోని విభిన్న దేశాలతో భారత్‌కు చాలా కాలంగా బలమైన వాణిజ్య, దౌత్య సంబంధాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ యుద్ధ విమానాలను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. రానున్న అయిదేళ్లలో ఇండియాతో ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని 22 వేల కోట్ల డాలర్లకు తీసుకువెళ్ళేలా భారత్‌తో చర్చలు జరిపేందుకు ఈయూ అడుగులు ముందుకు వేస్తోంది. మేక్రాన్‌, లి పెన్‌లలో ఎవరు అధ్యక్షులుగా ఎన్నికైనా భారత్‌తో వాణిజ్యం, దౌత్య పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఈయూ నుంచి ఫ్రాన్స్‌ బయటికి రావడం (ఫ్రెక్సిట్‌) గురించి లి పెన్‌ తన ఆసక్తిని గతంలో వ్యక్తపరచారు. ఈయూలో ఫ్రాన్స్‌, జర్మనీలు కీలక చోదక శక్తులుగా వ్యవహరిస్తున్నాయి. లి పెన్‌ అధ్యక్షురాలైతే ఈయూకు భారీ కుదుపు తప్పదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మేక్రాన్‌ సైతం అదే అంశాన్ని తన ప్రచారంలో బలంగా ప్రస్తావించారు. బ్రెగ్జిట్‌ కారణంగా బ్రిటన్‌ ఎన్నో ఒడుదొడుకులకు లోనయ్యింది. ఫ్రెక్సిట్‌ వల్ల ఫ్రాన్స్‌నూ ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయని మేక్రాన్‌ హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణు సరఫరాదారుల కూటమిలో చేరే విషయమై భారత్‌కు మేక్రాన్‌ గట్టి మద్దతు తెలుపుతున్నారు. లి పెన్‌ అధికారంలోకి వస్తే ఆమె స్వరం ఎలా ఉంటుందన్నదానిపై సరైన స్పష్టత లేదు. మరోవైపు జాతీయవాది అయిన లి పెన్‌కు అధ్యక్ష పగ్గాలు దక్కితే ఫ్రాన్స్‌లో విద్య, ఉద్యోగాలకు వెళ్ళాలనుకునే భారతీయుల ప్రవేశానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

- అక్షర

ABOUT THE AUTHOR

...view details