తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'లాక్​డౌన్​'- కొవిడ్​ను దిగ్బంధించే వ్యూహం! - లాక్​డౌన్​ ఇండియా

గతేడాది జనవరి చివరి వారంలో తొలి కరోనా కేసు నమోదైన దరిమిలా దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య పాతిక లక్షలు దాటడానికి ఆరున్నర నెలలు పట్టింది. అలాంటిది గత వారం రోజుల్లోనే ఎకాయెకి 26 లక్షల కొత్త కేసులు, 23,800 మరణాలతో యావద్దేశం కుమిలిపోతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కట్టడిని లక్షించి దేశవ్యాప్తంగా మళ్లీ పటిష్ఠ లాక్‌డౌన్‌ విధించాలన్న ప్రతిపాదనలు గట్టిగా వినవస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా తలెత్తే సామాజిక ఆర్థిక దురవస్థలేమిటో తెలుసంటూ నిరుపేద వర్గాల ఆకలి దప్పుల్ని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా నిర్దేశించింది.

Experts mulls lockdown to tackle corona virus in India
'లాక్​డౌన్​'- కొవిడ్​ను దిగ్బంధించే వ్యూహం!

By

Published : May 4, 2021, 6:42 AM IST

ఇండియాపై కసిగా కోరసాచింది కరోనా అల కాదు, కొవిడ్‌ సునామీ అని పది రోజుల క్రితం దిల్లీ ఉన్నత న్యాయస్థానం నిష్ఠుర సత్యం పలికింది. నిరుడు జనవరి చివరి వారంలో తొలి కరోనా కేసు నమోదైన దరిమిలా దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య పాతిక లక్షలు దాటడానికి ఆరున్నర నెలలు పట్టింది. అలాంటిది గత వారం రోజుల్లోనే ఎకాయెకి 26 లక్షల కొత్త కేసులు, 23,800 మరణాలతో యావద్దేశం కుమిలిపోతోంది. మార్చి మాసంలో 5,417 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయంటున్న సర్కారీ గణాంకాలు, ఏప్రిల్‌ నెలలో రికార్డు స్థాయి కేసుల మోతకు జతపడిన మృత్యుఘోష 45వేల మందికి పైగా అభాగ్యుల్ని బలిగొందని స్పష్టీకరిస్తున్నాయి. కొవిడ్‌ బాధితుల సంఖ్య రెండు కోట్లు దాటిన ఇండియాలో క్రియాశీల కేసులు 34 లక్షలకు పైబడి పెను సామాజిక సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. ఈ నెల ప్రథమార్ధానికే రోజువారీ కేసుల సంఖ్య పది లక్షలకు, మరణాలు అయిదు వేలకు పెరిగే ప్రమాదాన్ని విదేశీ అధ్యయనాలు వేలెత్తి చూపుతున్న వేళ- కొవిడ్‌ కట్టడిని లక్షించి దేశవ్యాప్తంగా మళ్ళీ పటిష్ఠ లాక్‌డౌన్‌ విధించాలన్న ప్రతిపాదనలు గట్టిగా వినవస్తున్నాయి. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ, పశ్చిమ్‌ బంగ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీలనుంచే రోజువారీ కేసుల ఉద్ధృతిలో 73శాతం దాకా వస్తున్నాయంటున్న కేంద్రం- కొవిడ్‌ విజృంభిస్తున్న 150 జిల్లాల్లో కఠినంగా లాక్‌డౌన్‌ నిబంధనల్ని అమలు చేయాలని ఇప్పటికే ఆదేశించింది. హరియాణా, ఒడిశాలు తాజాగా లాక్‌డౌన్‌ విధించగా, ఎన్నో రాష్ట్రాలు కర్ఫ్యూలు సహా కఠిన నిబంధనల కొరడా ఝళిపిస్తున్నా- మహమ్మారి అదుపులోకి వస్తున్న జాడల్లేవు. కాబట్టే పలు దేశాలు రాకపోకల నిషేధంతో భారత్‌కు వెలుపలినుంచి బీగాలు బిగించేశాయిప్పుడు! మహమ్మారి సాంక్రామిక గొలుసును తెగతెంచడమే లక్ష్యంగా, రాష్ట్రాలతో సంప్రదించి లాక్‌డౌన్‌ ప్రతిపాదనను కేంద్రం గట్టిగా పరిశీలించాలి!

ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించే అవకాశాన్నీ పరిశీలించాలని సుప్రీంకోర్టు సైతం తాజాగా సూచించింది. లాక్‌డౌన్‌ కారణంగా తలెత్తే సామాజిక ఆర్థిక దురవస్థలేమిటో తెలుసంటూ నిరుపేద వర్గాల ఆకలి దప్పుల్ని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలనీ నిర్దేశించింది. వైద్య ఆరోగ్య వ్యవస్థలు కుదేలైపోయిన తరుణంలో, కొన్ని వారాల పాటు ఇండియా లాక్‌డౌన్‌ను ఆశ్రయించక తప్పదని అమెరికా ప్రజారోగ్య రంగ నిపుణుడు ఆంటొనీ ఫౌసీ స్పష్టీకరిస్తున్నారు. చైనా మాదిరిగా యుద్ధ ప్రాతిపదికన కొవిడ్‌ ఆసుపత్రుల నిర్మాణం సాగాలని; ఆక్సిజన్‌, మందులు, పడకలు వంటి తక్షణావసరాలపై దృష్టి సారిస్తూ లాక్‌డౌన్‌ ద్వారా కరోనా ఉరవడిని అరికట్టాలనీ సూచిస్తున్నారు. ప్రధాని నియమించిన కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సైతం అదే సిఫార్సు చేసిందంటున్న నేపథ్యంలో- ప్రజల ప్రాణాల పరిరక్షణే లక్ష్యంగా సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. మరో నాలుగైదు నెలలు మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుందంటున్న 'ఫిక్కీ' అధ్యక్షులు- రెండు లక్షల ఐసీయూ పడకల నిర్వహణకు మూడు లక్షలమంది నర్సులు ఆరోగ్య సిబ్బంది, మరో రెండు లక్షలమంది జూనియర్‌ డాక్టర్ల అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచి, రాష్ట్రాల సమన్వయంతో టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలన్న సూచనలతోపాటు, సీఐఐ వంటివీ లాక్‌డౌన్‌ ప్రతిపాదనకు మొగ్గుతున్నాయి. జాతికి దాపురించిన ఈ పెను విపత్తును సమర్థంగా కాచుకొనే క్రమంలో రాష్ట్రాలనూ సంప్రదించి, వలస శ్రామికుల వెతలపైనా ముందే దృష్టి సారించి, రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులపట్ల మానవీయంగా స్పందిస్తూ- కేంద్రం వడివడిగా నిర్ణయాలు తీసుకోవాలి. కరోనా నరమేధాన్ని నిలువరించాలి!

ABOUT THE AUTHOR

...view details