స్వాతంత్య్రానికి పూర్వమే 1904లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఏర్పడినప్పటి నుంచి మన దేశంలో సహకార ఉద్యమం ఎన్నో దశలను దాటివచ్చింది. సహకార సంఘాలు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా కిందకు వచ్చినా, ఈ రంగంలో రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించే సహకార సంఘాల కోసం బహుళ రాష్ట్ర సహకార చట్టాన్ని తీసుకొచ్చారు. 74 ఏళ్ల స్వతంత్ర భారతంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు నియమించిన పలు కమిటీలు సహకార సంఘాల సమస్యలకు పరిష్కారాలను సూచించినా, అవి అమలుకు నోచుకోలేదు. దీనికి రాజకీయ నేతలతోపాటు అధికారులూ బాధ్యులే. ఈ రెండు వర్గాలు సహకార సంఘాలను స్వప్రయోజనాలకు వినియోగించుకొంటూ- పరిస్థితిలో గుణాత్మక మార్పు రాకుండా అడ్డుపడుతున్నాయి. ఇప్పటిదాకా కేంద్రంలో సహకార శాఖ వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉండేది. దాన్ని ఇప్పుడు విడదీసి ప్రత్యేక శాఖగా ఏర్పరచారు. హోంమంత్రి అమిత్ షాకు అదనంగా సహకార సంఘ వ్యవహారాల శాఖను అప్పగించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఆర్థిక క్రమశిక్షణ లోపం
పీఎంసీ బ్యాంకు కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి పట్టణ సహకార బ్యాంకుల నిర్వాకాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. నియంత్రణ సంస్థ అయిన రిజర్వు బ్యాంకు పాత్ర విమర్శలకు లోనైంది. కార్పొరేట్ రంగ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు వాణిజ్య బ్యాంకులు పరిమితమయ్యాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, గ్రామీణ స్వల్పకాలిక రుణ అవసరాలను తీర్చే సహకార సంస్థలు రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), చిన్న చిల్లర రుణగ్రహీతలకు- ముద్ర, చిన్నపాటి ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపుల (పేమెంట్) బ్యాంకులు తోడ్పడుతున్నాయి. మౌలిక వసతుల రంగ రుణ అవసరాలను డెవలప్‌మెంట్ ఫైనాన్స్ సంస్థలు తీరుస్తున్నాయి. వ్యవసాయ రంగ అవసరాలకు నాబార్డ్, ఎంఎస్‌ఎంఈ రంగం కోసం భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్‌ఐడీబీఐ) ఏర్పాటుకు ప్రత్యేక చట్టాలు చేశారు. పట్టణ సహకార బ్యాంకులు సాంకేతిక పటిమను సంతరించుకోవాలని, ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకోవాలని, లేదంటే చిన్న ఫైనాన్స్ బ్యాంకులుగా రూపాంతరం చెందాలని ప్రభుత్వం సూచించింది. గ్రామీణ సహకార సంఘాల్లో ఇప్పటిదాకా సంస్కరణలు చేపట్టలేదు. అవి ఇంకా రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోనే ఉన్నాయి. వీటిని సరైన మార్గంలో నడిపించడంలో నాబార్డ్ విఫలమైంది.
కారణాలను పరిశీలించాలి..
బ్రిటన్, కెనడాల్లో సహకార బ్యాంకులు ఏకంగా బడా వాణిజ్య బ్యాంకులకే గట్టి పోటీ ఇస్తున్నాయి. నిబంధనలు పాటిస్తూ, క్రమం తప్పకుండా ఎన్నికలు జరుపుకొంటాయి. బోర్డు సభ్యులకు పాలనా వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు అందిస్తాయి. కార్యనిర్వహణ స్వేచ్ఛను నిలబెట్టుకొంటాయి. భారత్‌లో కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల వ్యవహారాల్లో పదేపదే జోక్యం చేసుకుంటుందని రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. పాలు, చక్కెర, ఎరువుల రంగాల్లో విజయవంతంగా పనిచేస్తున్న సహకార సంస్థలు- ఆర్థిక రంగంలో విఫలం కావడానికి కారణాలను పరిశీలించడం అవసరం. సహకార రుణ వితరణ వ్యవస్థను అధికారి-ఉద్యోగి యంత్రాంగం హైజాక్ చేయడమే వైఫల్యానికి ప్రధాన కారణం. ఫైనాన్స్ రంగానికి అవసరమైన ఆర్థిక క్రమశిక్షణను సహకార సంఘాల పాలక మండలి సభ్యులు పాటించకపోవడం మరో పెద్ద లోపం. అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే ఉందనుకోకూడదు. తెలంగాణలో ముల్కనూరు సంస్థ అత్యంత విజయవంతమైన సహకార సంఘంగా పేరొందింది.
సవరణలు తప్పనిసరి
గతంలో వ్యాస్, వైద్యనాథన్ కమిటీలు సహకార సంఘాల్లో పాలన పరమైన లోపాలను బహిర్గతం చేశాయి. రాష్ట్ర స్థాయి సహకార చట్టాన్ని సవరించాలని సూచించాయి. సహకార రంగ పునర్వ్యవస్థీకరణకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి పునరావాస నిధులు పొందాలంటే ఈ సవరణలు తప్పనిసరి అని పేర్కొన్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను సంస్కరించనిదే సహకార రుణ సంస్థలను పటిష్ఠం చేయలేమని వైద్యనాథన్ కమిటీ స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాలు ఈ సంస్కరణలను చేపట్టలేదు. సహకార బ్యాంకింగ్ ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా పని చేయాలనే నియమాన్ని తమిళనాడు తుంగలో తొక్కింది. ఆ రాష్ట్రంలో గ్రామీణ సహకార పరపతి సంఘాలకు రెండు దశాబ్దాలపాటు ఎన్నికలే నిర్వహించలేదు. సహకార సంఘాల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తమ అధికారులకే అప్పగించింది. దీనివల్ల సహకార బ్యాంకింగ్ రంగంలో ప్రజాస్వామ్య సూత్రాలకు తావులేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అమిత్ షా నేతృత్వంలో సహకార రంగ స్థితిగతులు మారతాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ రంగంలో సమూల సంస్కరణలు తీసుకురానిదే భవిష్యత్తు మనల్ని క్షమించదు.