తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా ధాటికి సంచారజాతుల బతుకులు కకావికలం

కరోనా కట్టడి కోసం విధించిన లాక్​డౌన్​తో సంచార తెగల జీవితాలు.. ప్రమాదంలో కూరుకుపోయాయి. జనజీవన స్రవంతికి దూరంగా పొట్టచేత పట్టుకు తిరిగే వారి జీవనాన్ని మహమ్మారి.. ఛిన్నాభిన్నం చేసింది. ఇంటిపట్టునే ఉండటం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత.. వంటివి వారికి కుదిరే పనులు కావు. వలస జీవితాలు కావడంవల్ల వారు.. ఏ ప్రభుత్వ పథకాలనూ పొందలేకపోతున్నారు.

eenadu feature article about effect of corona on nomadic people india
కరోనా ధాటికి సంచారజాతుల బతుకులు కకావికలం

By

Published : Oct 16, 2020, 11:00 AM IST

రోనా దుష్ప్రభావాలు పట్టణాలు, పల్లెలకే పరిమితం కాలేదు. ప్రధాన జనజీవన స్రవంతికి దూరంగా వేట, పశుపాలన, వృత్తి నైపుణ్యాలపై ఆధారపడి పొట్టచేత పట్టుకు తిరిగే సంచార జాతుల జీవనాన్నీ అది ఛిన్నాభిన్నం చేసింది. స్థిరమైన గృహ సౌకర్యం; ఆహార, మంచినీటి వసతులు లేక సంచార తెగలు వలస జీవనంతో పొట్టపోసుకుంటున్నాయి. ఇంటిపట్టునే ఉండటం, శారీరక దూరం పాటించడం, పరిశుభ్రతను అనుసరించడం- వారికి కుదిరే పనులు కావు. కొన్ని నెలలపాటు లాక్‌డౌన్‌ విధించిన కారణంగా సంచార తెగల జీవితాలు ప్రమాదంలో కూరుకుపోయాయి.

ప్రభుత్వ పథకాలకు దూరం..

సంచార తెగల జన సాంద్రత దక్షిణాసియాలోనే ఎక్కువ. ఆసియా జనాభాలో సుమారు 10శాతం సంచార జాతులే. భారత్‌లో ప్రస్తుతం 1,500 సంచార, ఉప సంచార జాతులు; 198 విముక్త జాతులతో కలిపి 15కోట్ల మేరకు ఉన్నారని ‘రింకీ కమిషన్‌’ పేర్కొంది. వీరిలో 265 జాతులను ఇప్పటివరకు వెనకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని ఏ విభాగంలోనూ గుర్తించలేదు. వేటాడి ఆహారం సంపాదించేవారు, పశు సంపదపై ఆధారపడి జీవించేవారు; జానపద వృత్తి నైపుణ్యాలున్న కళాకారులు, పగటి వేషగాళ్లు, నాటు మందులు అమ్మేవారు, తోలు బొమ్మలాటలవాళ్లు, వీధి సర్కస్‌ చేసేవాళ్లు, జ్యోతిషం చెప్పేవారు వంటి ఎంతోమంది ఈ తెగల్లో ఉన్నారు. వలస జీవితాలు కావడంవల్ల వీరికి స్థిర నివాసం ఉండదు. కాబట్టి, గుర్తింపునకు నోచుకోక వీరు ప్రభుత్వ పథకాలేవీ వినియోగించుకోలేకపోతున్నారు!

రానివ్వడం లేదు..

‘యాక్షన్‌ ఎయిడ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల చేసిన అధ్యయనం- లాక్‌డౌన్‌లో పశు సంపదపై ఆధారపడ్డ సంచార తెగల కష్టాలను ఏకరువు పెట్టింది. దీని ప్రకారం సంచార జాతుల్లో 62శాతం- తాము వలస వెళ్ళే మార్గాలు మార్చుకున్నాయి. వారిలో 31శాతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. 90శాతానికి పశుగ్రాసం అందలేదు. 89శాతానికి కనీస వైద్య అవసరాలు కొరవడ్డాయని ఆ అధ్యయనం గుర్తించింది. సాధారణ పరిస్థితుల్లో గ్రామాల్లోకి వీరిని సాదరంగా ఆహ్వానించి, వారి పశువులను పొలాల్లో తిప్పినందుకు పారితోషికమూ ఇచ్చేవారు. వైరస్‌ భయంతో పశువుల ఎరువు మాట అటుంచితే కనీసం వారిని ఊరి పొలిమేరల్లోకీ రానివ్వడం లేదు.

హక్కులు అందడం లేదు
స్వాతంత్య్రానికి పూర్వం 1871లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ తెగలను నేర ప్రవృత్తిగల సంచార జాతులుగా పేర్కొంది. దాంతో వారు ఒకరకంగా సమాజ బహిష్కరణకు గురయ్యారు. స్థిర నివాసం కరవై వలసలపై ఆధారపడ్డారు. స్వాతంత్య్రానంతరం 1952లో ఆగస్టు 31న వీరిని నేరస్థులుగా గుర్తించే ‘క్రిమినల్‌ ట్రైబల్‌ యాక్ట్‌’ను రద్దుచేశారు. నాటినుంచి ఏటా ఆగస్టు 31వ తేదీని విముక్తి దినంగా పాటిస్తున్నారు. సుమారు ఏడు దశాబ్దాల క్రితమే వీరిని నేర ముద్రనుంచి విముక్తం చేసినా- భారత రాజ్యాంగంలోని 14, 16(4) అధికరణలతో పాటు ఇతర వెనకబడిన వర్గాలకు లభించే హక్కులు వీరికి ఇంకా అందకపోవడం నివ్వెరపరచే అంశం.

అమలుకు నోచుకో లేదు..

భారత ప్రభుత్వం 2003లో తొలిసారిగా సంచార తెగలకోసం ఒక జాతీయ కమిషన్‌ను నియమించింది. సాంకేతిక కారణాల పేరిట దాన్ని అర్ధాంతరంగా చాపచుట్టేశారు. 2005లో మరోసారి రింకీ కమిషన్‌ను నియమించారు. ఆ కమిషన్‌ 2008 జులైలో ఒక నివేదిక సమర్పించింది. సంచార తెగల అభ్యున్నతి కోసం కార్యనిర్వాహక బృందాన్ని, జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేయాలని అందులో సూచించారు. అందులో భాగంగానే 2014లో సంచార, ఉప-సంచార, విముక్త జాతుల జాతీయ కమిషన్‌ను మూడేళ్ల కాలానికి ఏర్పాటు చేశారు. కానీ, రాష్ట్రాలవారీగా వీరిపై సరైన సమాచారం లేకపోవడంతో- గుర్తింపును నమోదు చేయడం కోసం భికు రాంజీ ఇదాతే అధ్యక్షతన 2015లో మరొక కమిషన్‌ను నియమించారు. సంచార జాతుల అభ్యున్నతి కోసం అయిదు సంవత్సరాలు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడంతో పాటు వారి విద్య, వైద్య, ఉపాధి కోసం ఈ కమిషన్‌ అనేక సూచనలు చేసింది. ఇప్పటికీ అవి అమలుకు నోచుకో లేదు. దేశంలో ఇప్పటికే అమలవుతున్న వన్యప్రాణి, అటవీ, యాంటీ బెగ్గింగ్‌ చట్టాల వంటివి వీరి జీవన విధానాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో సంచార తెగలు ఎవరికీ చెందనివిగా మిగిలిపోయాయి.

ఆత్మనిర్భర్‌ భారతంలో..

జనాభాపరంగా పెద్దసంఖ్యలో ఉన్నప్పటికీ సంచార జీవన విధానంవల్ల వీరు సంఘటితమై తమ నిరసనను ప్రభుత్వాల దృష్టికి తేవడంలో విఫలమవుతున్నారు. సంచార జాతులు మాట్లాడే సంకేత భాష, మాండలికాల్లో ఎంతో సంప్రదాయ జ్ఞానం నిక్షిప్తమై ఉంది. వృత్తి నైపుణ్యాల్లో వీరికి తిరుగులేదు. రాజస్థాన్‌లోని సంచార తెగకు చెందిన మహిళ గులబో సపెర తమ సంప్రదాయ ‘కల్‌బలియ’ నృత్యకళకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినందుకుగాను 2016లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. సంచార జాతుల నైపుణ్యాలకు అద్దంపట్టే ఉదాహరణ ఇది. ఆత్మనిర్భర్‌ భారతంలో వృత్తి నైపుణ్యంగల ఇలాంటి వారిని ప్రభుత్వాలు గుర్తించి ఆర్థిక సాయం చేయాలి. సంప్రదాయ భాష, కళలు, నైపుణ్యాలను కాపాడుకుంటూ వస్తున్న ఈ సంచార తెగలకు దేశ ఆర్థికాభివృద్ధికి దన్నుగా ఉండే శక్తి ఉంది.

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌

ఇదీ చూడండి:కరోనా బాధిత అన్నార్తులకు ప్రభుత్వాలే ఆసరా!

ABOUT THE AUTHOR

...view details