తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఎల్లలు దాటుతున్న భారతీయుల నైపుణ్యం - భారత నైపుణ్యాభివృద్ధి, సాధికారత మంత్రిత్వశాఖ

అంతర్జాతీయంగా ఉద్యోగాల వేటలో భారతీయ యువతకు నైపుణ్యాల లేమి ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం- పారిశ్రామిక శిక్షణ కళాశాలలతోపాటు పీఎం కౌశల్‌ వికాస్‌ పథకాన్ని ప్రారంభించింది. అయితే.. ఈ కార్యక్రమానికి తగినంత ప్రచారం లేదు. గ్రామీణ యువతకు సరైన అవగాహన కల్పించి తగిన శిక్షణ ఇప్పిస్తే, మంచి ఫలితాలు ఉంటాయి. కేవలం విదేశాల్లో ఉద్యోగాలే లక్ష్యంగా కాకుండా- దేశీయంగా స్వయం ఉపాధి పొందేందుకూ ఈ శిక్షణ దోహదపడాలి.

skills of indian people
ఎల్లలు దాటుతున్న భారతీయుల నైపుణ్యం

By

Published : Mar 13, 2021, 7:20 AM IST

ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారతదేశంలోనే యువజనులు ఎక్కువ. దేశ జనాభాలో 50శాతానికి మించి 25 ఏళ్లలోపు వారున్నారు. నైపుణ్యాల లేమి భారతీయ యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనలో ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. ఇదే సమయంలో గల్ఫ్‌తోపాటు అమెరికా, సింగపూర్‌, న్యూజిలాండ్‌, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలకు భారత్ ‌నుంచి నైపుణ్య శ్రామికులను పంపించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు భారత నైపుణ్యాభివృద్ధి, సాధికారత మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆయా దేశాలోన్లి 43 లక్షల ఉద్యోగాల్లో భారతీయ నైపుణ్య శ్రామికులకు అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రవాస భారతీయులు పెద్దయెత్తున స్వదేశానికి తిరుగుబాట పట్టారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లో లక్షల ఉద్యోగాలు భారతీయ నైపుణ్య యువతకోసం ఎదురుచూస్తున్నాయంటే అది పెద్ద వరమేనని చెప్పాలి.
పెరుగుతున్న అవసరాలు
ప్రపంచంలోని అనేక దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతోంది. దాంతో ఆయా దేశాలను నైపుణ్య శ్రామికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గల్ఫ్‌ దేశాల ఉదాహరణనే తీసుకుంటే- నిర్మాణ రంగం, వెల్డింగ్‌, ప్లంబింగ్‌ రంగాల్లో అక్కడ అవసరాలు విపరీతంగా ఉన్నాయి. చాలినంతమంది నిపుణ కార్మికులు లేరు. మరోవంక ఐరోపా దేశాల్లో వ్యక్తిగత సహాయకులు, నర్సింగ్‌, ఆహార సరఫరా రంగాలకు చెందిన ఉద్యోగాలు అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న వారికి ఈ రంగాల్లో ప్రత్యేక తర్ఫీదును ఇస్తున్నారు. వీటితో పాటు ఆయా దేశాల భాష, సంస్కృతి, ఆచారాలపై శిక్షణ ఇవ్వడం ఉద్యోగార్థులకు కలిసివచ్చే అంశమే.

ఆస్ట్రేలియా, కెనడా, జపాన్‌, జర్మనీ, స్వీడన్‌, యూకే, అమెరికా తదితర దేశాల్లో భారత్‌కు చెందిన 'బ్లూ కాలర్‌' ఉద్యోగార్థులకు (నైపుణ్యంతో కూడిన శ్రామికులు) డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలోనే వివిధ కంపెనీల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే 'అప్రెంటిస్‌' చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. చట్టానికి సవరణలు చేస్తే 'అప్రెంటిస్‌'ల సంఖ్య 10శాతం నుంచి 15శాతం పెరుగుతుందని అంచనా. దీంతో విద్యార్థి దశలో తరగతి గదికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోనూ శిక్షణ పొంది వారు నైపుణ్య శక్తులుగా ఆవిర్భవించే అవకాశాలు ఇనుమడిస్తాయి. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలతోపాటు; ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వడంతో రానున్న రోజుల్లో భారతీయ శ్రామికులకు మంచి డిమాండ్‌ ఏర్పడనుంది. భారత్‌కు చెందిన ఇంజినీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు అపారంగా ఉన్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత శ్రామికశక్తికి ప్రపంచం ఆహ్వానం పలుకుతుండటం ముదావహం.
అడ్డంకులివే...
అంతర్జాతీయంగా ఉద్యోగాల వేటలో భారతీయ యువత పోటీపడలేకపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం- పారిశ్రామిక శిక్షణ కళాశాలలతోపాటు పీఎం కౌశల్‌ వికాస్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో శిక్షణ పొందే వారికి ప్రభుత్వమే రుసుములు చెల్లిస్తోంది. 'నైపుణ్య భారత్‌' కార్యక్రమం కింద 2022కల్లా 30కోట్ల యువతకు పలు వృత్తివిద్య అంశాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ కార్యక్రమానికి తగినంత ప్రచారం లేదు. గ్రామీణ యువతకు సరైన అవగాహన కల్పించి తగిన శిక్షణ ఇప్పిస్తే, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కేంద్రాల్లో సుశిక్షితులైన అధ్యాపకులను నియమించాలని అన్ని వైపులనుంచీ సూచనలు వస్తున్నాయి. కేవలం విదేశాల్లో ఉద్యోగాలే లక్ష్యంగా కాకుండా- దేశీయంగా స్వయం ఉపాధి పొందేందుకూ ఈ శిక్షణ దోహదపడాలి. ఆ క్రమంలో ప్రభుత్వం యువతకు చేయూతగా నిలవాలి. నైపుణ్యాభివృద్ధి క్రమంలో చైనా, జర్మనీ, దక్షిణ కొరియా తదితర దేశాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలనూ పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. యువతకు వృత్తిపరంగా మెరుగైన నైపుణ్యాలు అందించేందుకు విశ్వవిద్యాలయాల సహకారాన్నీ తీసుకోవాలి. దేశంలోని యువశక్తికి వృత్తి విద్య నైపుణ్యాలు నేర్పిస్తే- దేశీయ అవసరాలు తీరడంతో పాటు ప్రపంచానికే ఉద్యోగ వనరులు అందించగలదిగా భారత్‌ అవతరిస్తుంది.

- కొలకలూరి శ్రీధర్‌

ఇదీ చూడండి:అవకాశాల సముద్రం.. అందిపుచ్చుకుంటే అందలం

ABOUT THE AUTHOR

...view details