ఒక భారతీయుడు 1928 ఫిబ్రవరి 28న యావత్ విజ్ఞాన ప్రపంచాన్నీ సంభ్రమానికి గురిచేశారు. 'ఏ న్యూ రేడియేషన్' పేరిట ఆనాడు ఆయన వెలువరించిన పరిశోధన గ్రంథానికి గుర్తింపుగా 1930లో నోబెల్ పురస్కారం లభించింది. ఆ పరిశోధనే 'రామన్ ఎఫెక్ట్' పేరిట జగద్విఖ్యాతమైంది. సి.వి.రామన్‌కు నివాళిగా ఫిబ్రవరి 28న మనం జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా ఏటా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ప్రజల్లో శాస్త్రీయ స్పృహను పెంచే పలు కార్యక్రమాలు చేపడుతోంది. 'శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల భవిష్యత్తు- విద్య, నైపుణ్యాలు, పని' అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వీటిని నిర్వహిస్తోంది.
సంక్షోభం సదవకాశం..
కొవిడ్ మహమ్మారిపై పోరులో శాస్త్ర సాంకేతిక రంగాలు తక్షణం స్పందించాయి. వైరస్‌పై సరైన శాస్త్రీయ అవగాహన కల్పించడం సహా వ్యాధి నిర్ధరణ పరీక్షలు, చికిత్సలు, టీకా ఔషధాల అభివృద్ధిలో విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొవిడ్ ఫలితంగా సంభవించిన ప్రస్తుత ఆర్థిక సంక్షోభం- అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల ఖజానాలను దెబ్బతీసి, పరిశోధన, ఆవిష్కరణ బడ్జెట్లను కుదించి వేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ మార్పు (భూతాప) నిరోధక చర్యల మీదా ప్రభావం పడుతుంది. డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయాలన్న లక్ష్యాన్నీ దెబ్బ తీస్తుంది. అలాగే నూతన ఆవిష్కరణలను ఇతోధికంగా ప్రోత్సహించాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. ఆర్థిక పునరుద్ధరణ ప్యాకేజీల్లో భాగంగా ఆవిష్కరణ వ్యవస్థల పరిరక్షణకూ చేయూత ఇవ్వాలి. సంక్షోభం కల్పిస్తున్న అవకాశాలను చక్కటి అవకాశంగా ఉపయోగించుకుని ఈ దిశగా సంస్కరణలు ప్రవేశపెట్టాలి.
నూతన ఆవిష్కరణల్లో..
ప్రపంచ ఆవిష్కరణల సూచీ (జీఐఐ-2020) ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో స్విట్జర్లాండ్‌ది ప్రథమ స్థానం. స్వీడన్, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఆ తరవాతి స్థానాల్లో నిలిచాయి. ఈ నూతన ఆవిష్కరణల్లో 50 అగ్రశ్రేణి ప్రపంచ దేశాల్లో ఒకటిగా భారత్ ఆవిర్భవించింది. 2019లో 52వ స్థానంలో ఉన్న భారత్, కేవలం ఏడాదిలోనే నాలుగు ర్యాంకులు ఎగబాకి 2020లో 48వ స్థానాన్ని దక్కించుకుంది. దిగువ స్థాయి మధ్యాదాయ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అయిదో జాతీయ 'శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల విధానం 2020' రూపకల్పన భారత ప్రభుత్వ ముఖ్య విధాన నిర్ణయం. ఇందుకు అనుగుణంగా 2020-21 కేంద్ర బడ్జెట్ రాబోయే అయిదేళ్ల కాలానికి 'క్వాంటం సాంకేతికత'లకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించింది. కంప్యూటింగ్, సమాచార వ్యవస్థలు, సైబర్ భద్రతలను కొత్తపుంతలు తొక్కించే ఈ సాంకేతికతలకు విస్తృత స్థాయిలో ప్రయోజనాలు ఉన్నాయి.
కరోనా తెచ్చిన మార్పులతో..