విశ్వవ్యాప్తంగా 17కోట్లకు పైబడిన కేసులు, సుమారు 35 లక్షల మరణాలకు కారణభూతమైన నిశ్శబ్ద హంతకి కరోనా- యావత్ మానవాళినీ హడలెత్తిస్తోంది. పొగ తాగే అలవాటున్న వారిలో కొవిడ్ ముప్పు తీవ్రత 50 శాతం వరకు అధికంగా ఉంటుందంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ- పొగాకు వ్యసనాన్ని వదిలిపెట్టడమే శరణ్యమని తాజాగా పిలుపిచ్చింది.
ఆ మేరకు భారత్ సహా 29 దేశాల్లో ప్రత్యేక కార్యాచరణనూ అది ప్రతిపాదించింది. సిగరెట్, చుట్ట, బీడీల రూపేణా ధూమపానానిది; ఖైనా, గుట్కా, పాన్ మసాలా తదితరాల వినియోగానిది- భల్లూకం పట్టు. ప్రత్యక్షంగా పొగాకు వాడకంవల్ల, పరోక్షంగా పొగ పీల్చడం మూలాన ఏటా 82 లక్షల మంది దాకా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నట్లు లోగడే లెక్కకట్టిన డబ్ల్యూహెచ్‌ఓ 'క్విట్ టొబాకో' నినాదం ప్రపంచ దేశాలన్నింటా మార్మోగాలని నేడు అభిలషిస్తోంది.
110 కోట్లమంది..
అధికారిక గణాంకాల ప్రకారం ప్రపంచంలో 110 కోట్లమంది ధూమపాన ప్రియులుండగా, భారత్‌లో వారిసంఖ్య 10.6కోట్లేనంటే నమ్మశక్యం కాదు. పరోక్షంగా పొగపీలుస్తూ హానికర దుష్పరిణామాల బారినపడి బలైపోతున్నవారెందరో సరైన లెక్కలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ధూమరహిత పొగాకు ఉత్పత్తుల వాడకందారులు దాదాపు 37కోట్లలో 20కోట్ల మంది వరకు ఇండియాలోనే పోగుపడ్డారంటున్నారు. నికొటిన్‌తోపాటు ఏడువేల రకాల విషతుల్యాలకు నెలవైన పొగాకు వినియోగం మూలాన క్యాన్సర్లు, గుండెజబ్బులు, శ్వాసకోశవ్యాధులు పెచ్చరిల్లుతున్న దేశం మనది. రోజుకు ఒక్క సిగరెట్ కాల్చే వ్యక్తుల్లోనూ గుండెజబ్బులు, పక్షవాతం ముప్పు తీవ్రతరమవుతున్నట్లు లండన్ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం గతంలోనే నిగ్గుతేల్చింది. ఇప్పుడా జాబితాకు కొవిడ్ రిస్క్ జతపడిన దృష్ట్యా- ధూమపాన వ్యసనాన్ని దూరం చేసేందుకు దేశదేశాల్లో ప్రత్యేక 'టూల్‌కిట్' పంపిణీని పట్టాలకు ఎక్కించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత ప్రణాళిక రచిస్తోంది. సమస్య మూలాల్నీ స్పృశిస్తేనే, పొగాకుపై పోరు లక్ష్యాన్ని ఛేదిస్తుంది!