తెలంగాణ

telangana

ETV Bharat / opinion

విరాట్​ పర్వం- కివీస్​ను కొట్టి జగజ్జేతగా నిలిచేనా?

స్వదేశంలో ఇంగ్లాండ్​ను మట్టికరిపించి టెస్టు సిరీస్​ను కైవసం చేసుకున్న టీమ్​ఇండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​కు చేరింది. జూన్​లో లార్డ్స్​ వేదికగా జరిగే తుది పోరుకు సై అంటూ​ ప్రత్యర్థి న్యూజిలాండ్​కు సవాలు విసురుతోంది. కలిసికట్టుగా ఆడితే డబ్ల్యూటీసీ టైటిల్​ను సాధించడం పెద్ద కష్టమేమీ కాదని భావిస్తోంది విరాట్​ సేన.

editorial on team india
కొనసాగుతున్న విరాట్‌ పర్వం

By

Published : Mar 7, 2021, 7:10 AM IST

Updated : Mar 7, 2021, 8:34 AM IST

ఇంగ్లాండ్‌పై వరుసగా మూడో టెస్టులోనూ టీమిండియా సాధించిన ఘనవిజయంతో నిన్న మొతేరా మైదానం మోతెక్కిపోయింది. ప్రస్తుత పరంపరలో చివరిదైన ఈ టెస్టును 'డ్రా'గా ముగించినా చాలు, లార్డ్స్‌ వేదికగా జూన్‌ నాటి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ తుది పోరులో స్థానం ఖాయమన్న స్థితిలో- విరాట్‌ కోహ్లి సేన చెలరేగిపోయిన తీరు, వైరిజట్టును గడగడలాడించింది. కడకు ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో రూట్‌ బృందం ఆత్మవిశ్వాస మూలాలను పెకలించడంలో టీమిండియా సమష్టి ప్రదర్శన అసంఖ్యాక క్రీడాభిమానుల్ని మంత్రముగ్ధం చేసింది. నిజానికి ఈ పరంపరలోని తొలిటెస్టులో 227 పరుగుల అంతరంతో ఘోర భంగపాటుకు గురైన కోహ్లి బృందం నేలకు కొట్టిన బంతిలా పైకి లేస్తుందన్న నమ్మకం అభిమానుల్లో అణగారిపోయింది. దారులు మూసుకుపోలేదని చాటుతూ రెండో టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ సొగసైన శతకం చేశాడు. దీంతో పాటు ఎనిమిది వికెట్లు కూల్చడం సిరీస్‌ గతిరీతుల్ని తిరగరాసింది.

కలిసికట్టు విజయం..

పోరాటం అహ్మదాబాద్‌కు మారాక ఇంగ్లాండ్‌కు ఏదీ కలిసిరాలేదు. అక్కడ నిర్వహించిన మూడోటెస్ట్‌ కేవలం రెండు రోజుల్లోనే ముగిసి రూట్‌ జట్టుకు పీడకలలు మిగల్చగా- ఇప్పుడు నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ మూడు రోజుల్లోనే చాప చుట్టేసింది. బ్యాటింగ్‌ వైఫల్యాలు ఇరు జట్లలోనూ నమోదయ్యాయి. చివరి పోటీలో శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాట పట్టగా- స్థాయికి తగిన ప్రదర్శనలో పుజారా, రహానె సైతం విఫలమయ్యారు. ఆ లోటును రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌ల అద్భుత బ్యాటింగ్‌ విన్యాసాలు మరుగుపరచాయి. మరోపక్క అశ్విన్‌, అక్షర్‌ల ద్వయం 17 వికెట్లు కుప్పకూల్చడం ఇంగ్లాండ్‌ వెన్ను విరిచింది. కలిసికట్టుగా కదం తొక్కడమే భారత్‌ జట్టును నేడింత పటిష్ఠంగా నిలబెట్టింది.

ఐదు రోజుల టెస్ట్‌ క్రికెట్‌ అంటే అదో జీడిపాకమని, జిడ్డోడుతూ నిస్సారంగా కొనసాగుతుందన్న విమర్శల నేపథ్యంలో- ఒకప్పుడు ప్రేక్షకాదరణ సన్నగిల్లిన మాట యథార్థం. ఒకరోజు పరిమిత ఓవర్ల పోటీలు, చెరో ఇరవై ఓవర్లలోనే ఫలితం తేల్చేసే ధనాధన్‌ టీ20ల ఆగమనం వల్ల.. వివిధ దేశాలు పాల్గొనే టెస్టుల సంఖ్యా తగ్గుముఖం పట్టిందన్నది నిజం. నిప్పులు కక్కే బౌన్సర్లు, బంతిని అనూహ్యంగా సుడి తిప్పే స్పిన్నర్ల రూపేణా టెస్టుల్లో మజా అనుభవైకవేద్యమని విండీస్‌ వంటి జట్లు లోగడ నిరూపించాయి.

ఇప్పుడా అరుదైన కోవలోకి భారత్‌ సైతం దర్జాగా కాలిడటం సంభ్రమాశ్చర్యపరుస్తున్న పరిణామం. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో పుంజుకొన్న భారత్‌ జోరును ఈ దశలో ఎవరూ నిలువరించలేరన్న సీనియర్‌ క్రికెటర్ల అంచనాలు, రేపటి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ తుది సమరంలోనూ అక్షర సత్యాలుగా రుజువైతే- అభిమాన జనసందోహం అంతకన్నా కోరుకునేది ఏముంటుంది? వికెట్లు దొరకబుచ్చుకోవడంలో స్పిన్‌ దిగ్గజాలు అనిల్‌కుంబ్లే, హర్భజన్‌సింగ్‌ల కన్నా ఒక మెట్టుపైనే ఉన్న అశ్విన్‌.. అందిన అవకాశాన్ని సద్వినియోగపరచడంలో ప్రతిభావంతులైన అక్షర్‌, కుల్‌దీప్‌, బుమ్రా, ఉమేశ్‌, ఇషాంత్‌ ప్రభృతులు భారత్ ‌కెంత రిజర్వ్‌ బౌలింగ్‌ బలగం ఉందో నిరూపిస్తున్నారు.

అందుకు ధీటుగా బ్యాటింగ్‌లోనూ టీమ్​ఇండి​యా కుదురుకోవాల్సి ఉంది. ప్రస్తుత టెస్టుల పరంపరలో రెండు యాభైలు సాధించిన సారథి కోహ్లి వాటిని శతకంగా మలచడంలో విఫలమయ్యాడు. శార్దూల్‌ ఠాకుర్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్‌ తదితరుల సేవల్నీ అవసరానుగుణంగా వినియోగించుకుంటూ పరిస్థితులకు తగ్గ ప్రణాళిక రచనలో జట్టు యాజమాన్యం చురుగ్గా వ్యవహరించాలి. కూర్పులో సమతూకం పాటిస్తేనే, ఫైనల్‌ ప్రత్యర్థి న్యూజిలాండ్‌ మెడలు వంచి జగజ్జేత హోదాను టీమిండియా ఒడిసిపట్టగలిగేది!

ఇదీ చదవండి:బయోబబుల్​లో కష్టాలెన్నో: అశ్విన్

Last Updated : Mar 7, 2021, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details