తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆస్పత్రుల కాసుల వేట.. కళ్లెం వేయాలిక! - hospitals fees for covid treatment

కరోనా మహమ్మారి ఓ వైపు ఎంతోమందిని పొట్టనబెట్టుకుంటుంటే.. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు టెస్టులు, చికిత్స పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో రుసుముల్ని నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.

hospitals charging high fees for covid patients
సంక్షోభంలో ఆస్పత్రులకాసుల వేట

By

Published : May 19, 2021, 8:35 AM IST

ప్రాణాంతక కరోనా కోర సాచినప్పటి నుంచి, అభాగ్యులకు ఆయువు పోయాల్సిన ఆసుపత్రులు కాసుపత్రులుగా ఉత్పరివర్తనం చెందాయి. ధనిక పేద తేడా లేకుండా దేశ ప్రజలపై కొవిడ్‌ దండయాత్ర చేస్తుంటే, ప్రాణావసరాన్ని సొమ్ము చేసుకోవడంలో ప్రైవేటు ఆసుపత్రుల పోటాపోటీ నిశ్చేష్టపరుస్తోంది. చికిత్సల వ్యయం అత్యధికమంటూ ఎవరికీ వైద్య సేవల్ని నిరాకరించకూడదని, కొవిడ్‌ వైద్యం పౌరులందరికీ అందుబాటులోకి వచ్చేలా విపత్తుల నిభాయక చట్టం కింద ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయగల వీలుందో పరిశీలించాలని సుప్రీంకోర్టు నిరుడు జులైలో కేంద్రాన్ని ఆదేశించింది.

సంక్షోభంలో కాసుల వేట

పోటెత్తిన ప్రజాహిత వ్యాజ్యాలకు పలు హైకోర్టులూ మానవీయంగా స్పందించడంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో రుసుముల్ని నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. వాటికి ఎర్ర ఏగాణీ విలువ ఇవ్వని ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు నిరుడు జులైలో గట్టిగా ఆదేశించినా ఏం ఒరిగింది? మలి విడత కొవిడ్‌ ముట్టడి మరింత ప్రాణాంతకంగా మారి ప్రైవేటు ఆసుపత్రుల దోపిడి శ్రుతిమించిన నేపథ్యంలో- తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘంతో సంప్రతించి కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది. అధిక రుసుముల్ని, ఆసుపత్రిలో బెడ్‌ నిరాకరణను తీవ్రంగా పరిగణించాలని ఏపీ హైకోర్టు పక్షం రోజుల క్రితం స్పష్టీకరిస్తే, తొలిదశలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల కమిటీని పునరుద్ధరించాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం నిర్దేశించింది. ముందుగా లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తేనే చికిత్స ప్రారంభిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు, వివిధ రకాల రుసుముల పేరిట రెండు లక్షల నుంచి 20 లక్షల రూపాయలదాకా పిండేస్తుండటమే ఉన్నత న్యాయస్థానాల కన్నెర్రకు కారణం. కొవిడ్‌ సంక్షోభంలో ఈ తరహా కాసుల వేట అమానుషం!

ఆరోగ్యం ప్రాథమిక హక్కు..

ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే నాణ్యమైన వైద్యసేవల అందుబాటు బాధితుల ప్రాణ రక్షణకు భరోసా ఇస్తుందన్న నమ్మకం- ఆర్థిక స్థోమత లేనివాళ్లనూ ప్రైవేటు దవాఖానాలవైపు మళ్ళిస్తోంది. దళారులు, ఆసుపత్రుల మధ్య సిండికేట్లు, లక్షల్లో బిల్లులు, ఆరోగ్య బీమా సదుపాయాల్నీ తోసిపుచ్చుతున్న వైనం, కోరిన మొత్తం చెల్లించకుంటే మృతదేహాన్నీ అప్పగించని ఘోరం- దగాఖానాల విశ్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తున్నాయి. అడ్డగోలుగా లాభాలు దండుకోవడానికి వైద్యం వ్యాపారం కాదు. అదే సమయంలో సహేతుక రుసుముల్నీ త్యాగం చేసి ప్రైవేటు ఆసుపత్రులన్నీ నష్టాల ఊబిలో కూరుకుపోవాలనీ ఎవరూ ఆశించరు. ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు అని, చికిత్సావ్యయం భరించదగ్గ స్థాయిలో ఉండటమూ అందులో భాగమేనంటూ ప్రైవేటు ఆసుపత్రుల ఫీజులపై నియంత్రణకు నిరుడు డిసెంబరులో సుప్రీంకోర్టు ఓటేసింది.

ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించిన రేట్లు తమకు గిట్టుబాటు కావని ఆసుపత్రి యాజమాన్యాలు లోగడే మొత్తుకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చించి హేతుబద్ధంగా రేట్లను నిర్ధారించడం నేటి అవసరం. కేరళ సర్కారు ఆసుపత్రుల ఛార్జీలను నియంత్రించడాన్ని హైకోర్టు శ్లాఘించినా- వ్యక్తిగత గదులు, విలాసవంతమైన రూములు తీసుకునేవాళ్లు, బీమా సదుపాయం గలవారు, ఇతరేతర రుగ్మతలున్న పేషెంట్ల విషయంలో మరింత స్పష్టత కావాలని కేరళ ప్రైవేటు హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ కోరడం గమనార్హం. ప్రధాన నగరాల్లో ఐసీయూలో చికిత్సకు రోజుకు లక్ష రూపాయలదాకా ఆసుపత్రులు వసూలు చేస్తుంటే, బీమా సంస్థలు గరిష్ఠంగా రూ.18వేలే చెల్లిస్తాయని అంటున్నారు.

కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఆసుపత్రి యాజమాన్యాలు, బీమా సంస్థలతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి కేంద్రమే జాతీయ విధానాన్ని రూపొందించగల వీలుంది. ఆసుపత్రుల మానవీయ స్పందనే కోట్లాది అభాగ్యుల్ని తెరిపిన పడేయగలుగుతుంది!.

ABOUT THE AUTHOR

...view details