భూగోళం ఊహించిన దాని కంటే అత్యంత వేగంగా వేడెక్కుతోందని, భవిష్యత్తులో ఇది మానవాళి పాలిట పెనుముప్పుగా పరిణమించనుందని వాతావరణ మార్పులపై(Climate Change) ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర ప్రభుత్వాల కమిటీ (ఐపీసీసీ) ఇటీవల విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలవల్ల వాతావరణంలో భారీ మార్పులు(Climate Change) చోటు చేసుకోవడంతో మంచు కొండలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయని, అసాధారణ వర్షాలు, వరదలు, తుపానులు, కార్చిచ్చులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తాయని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. 2050 నాటికి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని గత నివేదికలో విశ్లేషించిన కమిటీ... 2030 నాటికే ఆ పరిస్థితి ఎదురవుతుందని కొత్తగా వివరించింది. ఇప్పటికే 1.1 డిగ్రీల సెల్సియన్ మేర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదైందని ఆందోళన వ్యక్తం చేసింది.
తిలాపాపం తలా పిడికెడు...
భూతాపం పెరగడానికి కారణమైన కార్బన్‌డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల విడుదలలో పట్టణీకరణే(Urbanization Effect On Environment) ప్రధాన దోషి. విశ్వవ్యాప్తంగా నగరాలు 75శాతం కర్బన ఉద్గారాల్ని వెలువరిస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోని 25 మహా నగరాలు 52శాతం ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. భూఉపరితలంపై రెండు శాతం విస్తీర్ణంలో మాత్రమే ఉన్న నగరాలు అధిక భాగం ఉద్గారాలకు కారణం కావడం ఆందోళనకరం. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో అధిక భాగం ఆసియా నగరాలే వెలువరిస్తున్నప్పటికీ- తలసరి ఉద్గారాల విడుదలలో అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా నగరాలు ముందున్నాయి. చైనాలోని షాంఘె, జపాన్‌లోని టోక్యో నగరాలు అత్యధిక ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. ఏటా మూడు వేల కోట్ల టన్నుల కార్బన్‌డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం అంచనా వేసింది.
కోట్ల టన్నుల్లో వ్యర్థాలు..
నగరాల్లో నానాటికీ పెరుగుతున్న నివాస, వాణిజ్య భవనాలు(Urbanization Effect On Environment), ఘన వ్యర్థ పదార్థాలు, రవాణా, విద్యుదుత్పత్తి, వినియోగం, పారిశ్రామికీకరణ, తరిగిపోతున్న వృక్ష సంపద, పట్టణాల విస్తరణ, వలసలతో పెరుగుతున్న జనాభా... గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల విడుదలకు ప్రధాన కారకాలు. కాంక్రీట్‌తో నిర్మించిన భవనాలు కర్బన ఉద్గారాలను అధికంగా వెలువరిస్తాయి. 1990 నుంచి 2020 మధ్య కాలంలో భవనాల నుంచి వెలువడే ఉద్గారాలు మూడు శాతం మేర పెరిగాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో నివాస భవనాల నుంచి వెలువడే ఉద్గారాలు ఆయా దేశాలు విడుదల చేసే మొత్తం ఉద్గారాల్లో 60శాతానికి సమానం. నగరాల్లో రోజూ కోట్ల టన్నుల ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలు పోగవుతున్నాయి. వాటిని పునర్వినియోగించడమో, డంపింగ్ యార్డుల్లో తవ్విన పెద్ద గుంతల్లోకి తరలించడమో చేస్తున్నారు. ఘన వ్యర్థ పదార్థాలు కుళ్ళిపోయి కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్‌హౌస్ వాయువులు ఉత్పత్తి అయి వాతావరణంలోకి విడుదల అవుతాయి. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రక్రియ వెలువరించే మొత్తం ఉద్గారాల్లో మీథేన్ 40-70శాతం, కార్బన్‌డయాక్సైడ్ 30-60శాతం దాకా ఉంటాయి. పలు నగరాల్లో రోడ్డు రవాణా ద్వారా వెలువడే ఉద్గారాలు 30శాతం మేర ఉంటే- రైల్వేలు, జలమార్గాల ఉద్గారాల శాతం 15 వరకు ఉంది. బొగ్గు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా జరిగే విద్యుదుత్పత్తి ప్రక్రియలో 25శాతం దాకా ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల విడుదలలో సింహభాగం విద్యుదుత్పత్తి రంగానిదే. పారిశ్రామికీకరణ ద్వారా కర్బన ఉద్గారాలతో పాటు మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి చేటు కలిగించే విష వాయువులు విడుదలవుతున్నాయి. పంట పొలాలు, అడవులు హరించుకుపోవడంతో పచ్చదనం కనుమరుగవుతోంది. ఫలితంగా కర్బన ఉద్గారాల పరిమాణం పెరిగిపోతోంది.