అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన డాలర్ విలువతో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీలు భారీగా పతనమవుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో డాలర్ విలువ మరింతగా కట్టలు తెంచుకొని ఆకాశానికి ఎగబాకుతోంది. ఫలితంగా భారత్ వంటి దేశాలు వాణిజ్య లోటుతో విలవిల్లాడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావిత మవుతున్నాయి.
అన్ని సరకుల్లానే కరెన్సీ విలువ సైతం గిరాకీ, సరఫరా ఆధారంగానే నిర్ణయమవుతుంది. మార్కెట్ శక్తులే కరెన్సీ విలువ హెచ్చుతగ్గులను శాసిస్తాయి. ఇతర కరెన్సీలతో పోలిస్తే తమ కరెన్సీ విలువ ఎంతో నిర్ధారించడానికి అన్ని దేశాలు ఫ్లోటింగ్ మారక రేటును పాటిస్తాయి. అంటే ఆయా దేశాల కరెన్సీలకు కొనుగోలుదారులు చెల్లించే ధర మారుతూ ఉంటుంది. ఒక దేశ ఆర్థిక పటిమ, రుణ భారం, ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్యం, రాజకీయ సుస్థిరత, కరెంటు ఖాతా లోటు, పెట్టుబడిదారుల నమ్మకం వంటి అంశాల ఆధారంగా ఆ దేశ కరెన్సీ విలువ నిర్ణయమవుతుంది. ఆ కరెన్సీని ఏ రేటుకు కొనాలో పై అంశాల ఆధారంగా కొనుగోలుదారులు తేల్చుకుంటారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నేడు బలీయంగా ఉండటం వల్ల ఆ దేశ కరెన్సీ అయిన డాలర్ విలువ పెరిగిపోతోంది.
వడ్డీ రేట్ల పెంపు ప్రభావం
అంతర్జాతీయ లావాదేవీలకు నేడు డాలర్‌నే వినియోగిస్తున్నారు. డాలర్‌ను సుస్థిర కరెన్సీగా పరిగణిస్తున్నారు. అందుకే చాలా దేశాలు డాలర్ నిల్వలను దగ్గర ఉంచుకొంటున్నాయి. అనిశ్చిత పరిస్థితుల్లో పనికొస్తుందని డాలర్లను పోగుచేసుకుంటున్నాయి. డాలర్‌కు అందరూ ఇంత విలువ ఆపాదిస్తున్నారు కాబట్టి దాని విలువ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. నేడు ప్రపంచ దేశాల దగ్గరున్న విదేశ మారక ద్రవ్య నిల్వల్లో 62.5 శాతం డాలర్లేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తరవాతి స్థానాలను యూరో, యెన్, బ్రిటిష్ పౌండ్ ఆక్రమిస్తున్నాయి. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు సైతం డాలర్లను రిజర్వు కరెన్సీగా నిల్వ చేస్తున్నాయి. అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు జరగడం వల్ల దాన్ని రిజర్వు కరెన్సీగా పరిగణిస్తారు. అయితే డాలర్ కన్నా కువాయిటీ దీనార్‌కు ఎక్కువ విలువ ఉన్నా, అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ హోదా లేదు.
భారత్ చమురు దిగుమతులకు డాలర్లలోనే చెల్లింపులు జరపాలి. అంతర్జాతీయ వాణిజ్యమంతా డాలర్లలోనే జరుగుతుంది. అందువల్ల డాలర్ విలువ పెరగడం, రూపాయి విలువ తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2014లో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డాలర్‌తో భారతీయ రూపాయి విలువ 39శాతానికి పైగా క్షీణించింది. 2008 ఆర్థిక సంక్షోభం తరవాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ (కేంద్ర బ్యాంకు) వడ్డీ రేటును సున్నాకు తగ్గించింది. తద్వారా అప్పట్లో ఆర్థిక మాంద్యాన్ని నివారించగలిగినా, అమెరికా నుంచి డాలర్లు వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లకు పెద్దయెత్తున ప్రవహించాయి. విదేశీ సంస్థాగత మదుపరి సంస్థలు (ఎఫ్‌ఐఐలు) డాలర్లను స్టాక్ మార్కెట్లలో భారీగా పెట్టుబడి పెట్టాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్ళీ పెంచడంతో అక్కడ భద్రత, అధిక వడ్డీ లభిస్తాయని డాలర్లు అగ్రరాజ్యానికి తరలిపోతున్నాయి. వర్ధమాన దేశాల కరెన్సీ విలువలు పడిపోవడానికి, డాలర్ విలువ పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా నిలుస్తోంది. అమెరికాలో ద్రవ్య చలామణీని తగ్గించడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతోంది. దాంతో వడ్డీ ఎక్కువగా వస్తుందని, బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం సురక్షితమనే భావనతో మార్కెట్ నుంచి డాలర్లు బ్యాంకులకు తిరిగి వస్తున్నాయి. ఆ మేరకు అమెరికా మార్కెట్లో ద్రవ్య చలామణీ తగ్గిపోతోంది.
విదేశాల నుంచి డాలర్లు అమెరికాకు తిరిగివస్తాయి కాబట్టి, ఆ దేశాలకు డాలర్ లభ్యత తగ్గిపోతుంది. అంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరిగిపోతుంది. గతంలో ఒక డాలర్ కొనడానికి వెచ్చించిన రూపాయలకన్నా ఇప్పుడు ఎక్కువ రూపాయలను చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా రూపాయి విలువ పడిపోతుంది. ఇది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.