దేశంలో దక్షిణాదిన రోజురోజుకూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రత్యేకించి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మహానగరాల్లో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కర్ణాటకలో వైరస్ విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో మొత్తంగా నిర్ధారణ అయిన కేసుల్లో 45శాతం బెంగళూరు మహానగరంలోనే ఉన్నాయి. తెలంగాణ కేసుల్లో సింహభాగం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ నిషేధం సడలించాక కేసులు, బాధితుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండటంతో తాజాగా కొన్ని రాష్ట్రాలు మళ్ళీ లాక్‌డౌన్ దిశగా ఆలోచిస్తున్నాయి. చెన్నై మహానగరం, దాని పొరుగు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. సరికొత్తగా బెంగళూరు గ్రేటర్ పరిధిలోనూ లాక్‌డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దేశంలో లాక్‌డౌన్ ఎత్తివేశాక ఉత్పన్నమయ్యే పరిస్థితులపై లోతైన విశ్లేషణ, తగిన సన్నద్ధత, వ్యూహరచన, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక కొరవడటమే పెద్దలోపం. కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో మనం నేటికీ శైశవ దశలోనే ఉన్నామనడానికి క్షేత్రస్థాయి పరిస్థితులే నిదర్శనం.
నగరాలే వాహక కేంద్రాలు
అత్యధిక జనాభా, జనసాంద్రత కలిగిన నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య లోపానికి తోడు ప్రజారోగ్యంపై తగిన శ్రద్ధ చూపకపోవడం అంటువ్యాధుల విజృంభణకు కారణమవుతోంది. కరోనా వైరస్ పట్ల చేపట్టాల్సిన ప్రతిస్పందక చర్యలను కేంద్రీకృతం కావించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించుకుని ఉంటే ప్రారంభ దశలోనే కరోనాను కట్టడి చేయడం సాధ్యపడేది. పట్టణ ప్రాథమిక వైద్యారోగ్య సదుపాయాల కల్పనను బలోపేతం చేయడం, సమర్థంగా మహమ్మారి పిడికిట మహానగరాలు నిర్వహించడంలో ముందుచూపు లేకపోవడం వల్ల మహానగరాల్లో కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. దాదాపు 70రోజుల లాక్‌డౌన్ ఆంక్షల నడుమ జీవనం సాగించిన ప్రజలు, లాక్‌డౌన్ ఎత్తివేయడంతో కరోనా తీవ్రత తగ్గిందని భావించి, తమ దైనందిన కార్యకలాపాలు, వ్యాపారాలను పునఃప్రారంభించారు. ప్రయాణాలు సాగించారు. నిత్యావసర సరకులు, కూరగాయల కోసం ప్రజలు రోడ్లమీదకు రావడం, మాస్కులు ధరించకపోవడం, కనీస భౌతిక దూరాన్ని పాటించకపోవడం, ఇతర విషయాల్లోనూ అశ్రద్ధ, నిర్లక్ష్యం వహించడంతో- వైరస్ విజృంభణ ఊపందుకుంది. ఫలితంగా రోజూవారీగా నమోదవుతున్న కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి.
అందుకే కరోనా పంజా..
మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు ఉల్లంఘించినవారిపై విధించిన జరిమానాల మొత్తం ఒక్క బెంగళూరు గ్రేటర్ పరిధిలోనే 70 లక్షల రూపాయలు మించిపోయాయంటే- లాక్‌డౌన్ ఎత్తేశాక ప్రజలు ఎంత విచ్చలవిడిగా తిరిగారో స్పష్టమవుతుంది. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లో అంతర జిల్లా స్థాయుల్లో రాకపోకలు, ప్రయాణాలు జోరుగా సాగుతుండటం, విశేషించి జనసమ్మర్దం అధికంగా ఉండటంతో వైరస్ అతివ్యాప్తి వాహకాలు(సూపర్ స్ప్రెడర్‌లు) పెరగడం తదితర కారణాల వల్ల కరోనా పంజా విసరుతోంది. దక్షిణాదిన ఒక్క కేరళ రాష్ట్రంలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కట్టడిలో కేరళ చేపడుతున్న పకడ్బందీ చర్యలు, అత్యుత్తమ ట్రేసింగ్, ట్రాకింగ్ విధానాల వల్ల అక్కడ వైరస్ వ్యాప్తిని నిలువరించగలుగుతున్నారు. నమోదవుతున్న మొత్తం కేసుల్లో మరణాల రేటు 0.4శాతంగా మాత్రమే ఉంది. ఇతర ప్రాంతాలనుంచి కేరళకు భారీగా తిరిగి వస్తున్న ప్రజలను వెన్వెంటనే గుర్తించి, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో వైరస్ అతివ్యాప్తి వాహకాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. తక్కిన రాష్ట్రాల్లో ఈ కార్యాచరణ కొరవడటం వల్లే కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటం, రెండు తెలుగు రాష్ట్రాల్లో కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. తమిళనాడులో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 58శాతం చెన్నై నగరంలోనే ఉన్నాయంటే నగరాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో బోధపడుతోంది.