కరోనా వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు విద్యుత్ రంగంపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయి. లాక్‌డౌన్ ఉన్నా దేశమంతా నిరంతరాయంగా (24 గంటలూ) అందరికీ కరెంటు సరఫరా అయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్రమోదీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. కానీ, గత నెల (ఏప్రిల్)లో దేశవ్యాప్తంగా కరెంటు వినియోగం ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 22.75 శాతం తగ్గింది. విద్యుత్‌కు డిమాండు పడిపోవడం వల్లే వినియోగం పతనమైనట్లు కేంద్ర విద్యుత్ శాఖ తాజా గణాంకాల్లో వెల్లడించింది.
పరిశ్రమలు, వాణిజ్య కరెంటు వినియోగం లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కరెంటు ఉత్పత్తి చేసి విక్రయించే ‘విద్యుదుత్పత్తి సంస్థ’ (జెన్‌కో)కు విద్యుత్ పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు కూడా రూ.లక్ష కోట్లకు చేరువయ్యాయి. కరోనా ఆంక్షలున్నాయని బకాయిల చెల్లింపులపై కేంద్రం తాత్కాలికంగా వచ్చే నెలాఖరుదాకా మారటోరియం విధించింది. ఆ తరవాతైనా ఈ సొమ్ము చెల్లించి తీరక తప్పదు.
భారీగా తగ్గిన గిరాకీ
బొగ్గు తవ్వి థర్మల్ కేంద్రాలకు అమ్మితేనే బొగ్గు రంగం కళకళలాడుతుంది. కరెంటు ఉత్పత్తి చేసి డిస్కమ్‌లకు అమ్మితేనే జెన్‌కోల ఆర్థిక చక్రం పరుగు పెడుతుంది. కొన్న కరెంటును ప్రజలకు, పరిశ్రమలకు అమ్ముకుని వినియోగమయ్యేలా చూస్తేనే డిస్కమ్‌ల వ్యాపారం సాగుతుంది. కానీ, దేశంలో గత నెల 8న జాతీయ విద్యుత్ గిరాకీ ఏకంగా లక్షా 16 వేల మెగావాట్లకు పతనమైంది.
సరిగ్గా ఏడాది క్రితం 2019 ఏప్రిల్‌లో ఈ డిమాండు గరిష్ఠంగా లక్షా 76 వేల మెగావాట్లుంది. అంతకన్నా ఏకంగా 60 వేల మెగావాట్ల గిరాకీ తగ్గడం అసాధారణ అంశమే. ఆ మేర కరెంటు ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలు పడిపోయినట్లు అర్థం. దాని ఉత్పత్తికి అవసరమైన బొగ్గును కూడా కొనలేదు. ఇలా ప్రతి రంగంపైనా లాక్‌డౌన్ ప్రభావం చూపుతోంది.
గత నెలలో దేశం మొత్తమ్మీద 8,500 కోట్ల యూనిట్ల కరెంటును వినియోగించారు. గతేడాది ఇదే ఏప్రిల్‌లో పోలిస్తే 3,500 కోట్ల యూనిట్లు తక్కువగా వాడారు. తగ్గిన యూనిట్ల వల్ల కోల్పోయిన ఆదాయం దాదాపు రూ.25 వేల కోట్లని అంచనా. కరెంటు వాడి ఉంటే ఆ సొమ్మంతా డిస్కమ్‌లకు వచ్చేది. వాటి నుంచి జెన్‌కోలకు, బొగ్గు ఉత్పత్తి కేంద్రాలకు, ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళ్లేది. ఈ ఆర్థిక చక్రమంతా ఎక్కడికక్కడ ఆగడంతో విద్యుత్ సంస్థలన్నీ ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గరిష్ఠ రోజూవారీ కరెంటు డిమాండు రికార్డు 24,600 మెగావాట్లుంటే, లాక్‌డౌన్ వల్ల అది కాస్తా తొమ్మిది వేల మెగావాట్లకు పడిపోయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డిస్కమ్‌లు నష్టాల్లో ఉన్నాయి. లాక్‌డౌన్‌వల్ల వినియోగం పడిపోవడం వల్ల మరో రూ.20 వేల కోట్ల నష్టాలను మూటగట్టుకునే ప్రమాదముందని అంచనా. లాక్‌డౌన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌లు నష్టాలతో దివాలా తీసే స్థాయికి చేరతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. గత డిసెంబరు నాటికే ఏపీ డిస్కమ్‌ల సంచిత నష్టాలు రూ.29 వేల కోట్లకు చేరాయి.
తెలంగాణ డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. గతేడాది కరెంటు ఛార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇంతవరకూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లను రాయితీ పద్దు కింద డిస్కమ్‌లకు ఇస్తున్నా వాటిలో ఆర్థిక కష్టాలు తీరే పరిస్థితి లేదు. విద్యుత్ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రమే దిక్కని అన్ని రాష్ట్రాలూ ఎదురుచూస్తున్నాయి. లాక్‌డౌన్ వల్ల పరిశ్రమల విద్యుత్ వినియోగం 50 శాతం వరకూ పడిపోయిందని ‘భారత పరిశ్రమల సమాఖ్య’(సీఐఐ) వెల్లడించింది. కరెంటు వినియోగదారుల్లో పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్లుండే సంస్థలు 20 శాతం కూడా లేవు. కానీ డిస్కంలకు వచ్చే ఆదాయంలో వీటిదే 80 శాతం ఉంటోంది. ఈ వర్గాలు కరెంటు వాడుకోకపోతే డిస్కమ్‌లకు నష్టం తప్పదు.
విద్యుత్ సంస్థలకు గడ్డుకాలం