కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్ లాంటి కఠిన, సాహసోపేత నిర్ణయానికి సిద్ధపడ్డ దేశాలెన్నో.. నేటికీ దీటైన సాంత్వన దక్కక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. జనసమూహాలు స్వచ్ఛందంగా గృహనిర్బంధాన్ని పాటించడం ద్వారా వైరస్‌ను ఓడించాలన్నది లాక్‌డౌన్ అంతస్సారం. ఆ క్రమంలో సానుకూల పరిణామంకన్నా ముందు గృహహింస కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
అభివృద్ధి చెందిన దేశాల్లోనూ..
గుమ్మందాటి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో మహిళల పట్ల అమానుష ధోరణులు ప్రజ్వలమవుతున్న దేశాల జాబితా పెద్దదే. కొవిడ్‌కు పుట్టినిల్లయిన చైనాతోపాటు యూకే, స్పెయిన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండియా, బంగ్లాదేశ్ వంటివీ గృహహింసకు నెలవుగా మారుతున్నాయి. వాస్తవానికి అమెరికా, బ్రిటన్లతోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, మలేసియా వంటి ప్రభృత దేశాలెన్నో భారత్ కన్నా ఎంతో ముందు గృహహింస నిరోధానికంటూ ప్రత్యేక శాసనాల్ని వండివార్చాయి. చట్టాలు చేయడం ఒకెత్తు, వాటిని సమర్థంగా అమలుపరచడం మరొకెత్తు.
గృహహింసకు గురవుతున్న మహిళలెందరికో తలదాచుకునే ఆశ్రయం ఇవ్వడానికీ పలు సంస్థలు కరోనా భీతితో నిరాకరిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ లాంటివి అటువంటి అభాగినులకు తాత్కాలిక శిబిరాల్లో, హోటళ్లలో ఆశ్రయం కల్పిస్తూ.. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. గృహహింసను మానవ హక్కుల ఉల్లంఘనగా గుర్తిస్తూ 1994 నాటి వియన్నా సదస్సు తీర్మానంపై సంతకం చేసిన దేశాల్లో ఇండియా సైతం ఒకటి. గృహహింస నుంచి రక్షణ కల్పించే చట్టం వండివార్చిన సుమారు పద్నాలుగేళ్ల తర్వాత ఇక్కడి బాధితుల గోడు అంతులేని కథేనని తాజా ఘటనల జోరు ధ్రువీకరిస్తోంది.
అబల పైనా ఆగడాలు?
ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక, పురోగామి దేశాలన్నీ ఎన్నో గొప్పలు వల్లెవేసినప్పటికీ.. కేవలం ఆరు దేశాల్లోనే పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులున్నట్లు ఏడాది క్రితం ప్రపంచబ్యాంకు నివేదిక నిగ్గుతేల్చింది. కుటుంబంలో ఆర్థికాంశాలపై అధికారం, నియంత్రణలకు సంబంధించి హెచ్చుతగ్గుల్లోనే గృహహింస మూలాలు ఉన్నాయన్నది నిర్ద్వంద్వం. కరోనా నేపథ్యంలో తీవ్ర అనిశ్చితి, ఆ మౌలిక విభేదాల్ని ప్రజ్వరిల్లజేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, ఖర్చులు పెరిగి, భవిష్యత్తు ఏం కానుందోనన్న భయాందోళనలు ముమ్మరించినవారు కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా భార్యమీద ‘ప్రతాపం’ చూపుతున్నట్లు కథనాలు చాటుతున్నాయి. దేశీయంగా అటువంటి ఉదంతాలు యూపీ, బిహార్, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో విరివిగా నమోదవుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో గృహహింసా బాధితుల్ని అక్కున చేర్చుకునే కేంద్రాలు (షెల్టర్ హోమ్స్) ఉంటాయి. దిక్కుతోచని స్థితిలో ఫోన్ చేసినవారిని ఊరడించి, ఎటువంటి అఘాయిత్యానికీ ఒడిగట్టకుండా చూసే వ్యవస్థాగత ఏర్పాట్లూ ఉన్నాయి. బాధితులిప్పుడు పోలీసులనో, తల్లిదండ్రులనో వెంటనే ఆశ్రయించగల వాతావరణం లేదు.
కావాలి కార్యాచరణ
గృహహింస పెచ్చుమీరితే ఫ్రాన్స్, స్పెయిన్లలో మహిళలు మందుల దుకాణానికి వెళ్ళి ‘మాస్క్ 19’ అనే సంకేత పదంతో తాము బాధితులమని సూచిస్తే- తక్షణ సాయమందే ఏర్పాట్లు చేశారు. దేశీయంగానూ గృహహింస బారిన పడినవారు వాట్సాప్ సందేశం పంపిస్తే చాలు కేసు నమోదు చేస్తామని జాతీయ మహిళా సంఘం చెబుతోంది. ఫోనులో ఎస్సెమ్మెస్ (సంక్షిప్త సందేశం) పంపడం తరువాయి సత్వరం ఆపన్నహస్తం అందిస్తామన్న మునుపటి హామీ తరహాలో, నూతన భరోసా కొల్లబోకుండా కాచుకోవాలి. ఇంకొన్నాళ్లపాటు లాక్‌డౌన్ కొనసాగింపు అనివార్యమైన దశలో, కుటుంబ వ్యవస్థ కుదురుగా ఉండేలా మహిళలకు రక్షాకవచ విస్తరణ... కొవిడ్ వ్యతిరేక పోరులో అంతర్భాగం కావాలి!
ఇదీ చూడండి:'మోదీజీ... ఆ విషయంలో కాస్త తెగువ చూపండి'