పశ్చిమ్ బంగ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హిందూ ధర్మశాస్త్రాల్లోని సూక్తులు, వేద మంత్రాలను వల్లెవేస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచార సభల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవంక వీధుల వెంబడి ఆలయాలు కనిపించిన ప్రతి చోటా భాజపా నేతల ప్రచార రథాలు ఆగిపోతున్నాయి. ఆ పార్టీ జాతీయ సారథి జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా మొదలు బెంగాలీ స్థానిక నాయకుల వరకూ అందరిదీ ఇదే పంథా!
భాజపాలోకి ఇటీవల ప్రవేశించిన బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కోల్‌కతాలోని కాళీమాత ఆలయం సమీపంలో కూర్చుని విరామ సమయాల్లో ప్రతి రోజూ తాను పూజలు ఎలా చేస్తారో, శ్లోకపఠనం ఎలా సాగిస్తారో అభిమానులకు మురిపెంగా వివరిస్తున్నారు. పశ్చిమ్ బంగ అసెంబ్లీ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా మతం పతాక శీర్షికల్లో నిలుస్తోంది.
వెల్లివిరుస్తున్న మతతత్వం..
'కొంతమంది నందిగ్రామ్‌ను 70-30 ప్రాతిపదికన (హిందూ, ముస్లిం జనాభా శాతం) విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. నాకు మీ వంద శాతం మద్దతు కావాలి' అంటూ నందిగ్రామ్ వేదికగా మమతా బెనర్జీ ఇటీవల పిలుపిచ్చారు. నందిగ్రామ్‌నుంచి అసెంబ్లీకి పోటీపడుతున్న మమతా బెనర్జీ ఆ స్థానంలో భాజపానుంచి సువేందు అధికారి, సీపీఐ(ఎం)కు చెందిన మీనాక్షి ముఖర్జీని ప్రత్యర్థులుగా ఎదుర్కొంటున్నారు.
కొన్ని రోజుల క్రితం నందిగ్రామ్‌లో మాట్లాడుతూ '62 వేలకు... 2.13 లక్షలకు' మధ్య జరుగుతున్న పోటీగా సువేందు అధికారి ఈ ఎన్నికలను అభివర్ణించారు. ఆయన మతాన్ని ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే, జనానికి చెప్పాల్సిందంతా చెప్పేశారు! మమతా బెనర్జీ, సువేందు అధికారి ఇరువురూ ప్రజలకు కచ్చితమైన సంకేతాలు ఇస్తున్నారు. బెంగాలీ రాజకీయాల్లో మత ముద్ర స్పష్టంగా కళ్లకు కడుతోంది. నందిగ్రామ్‌లోని పుర్బ మేదినిపూర్ గ్రామంలో చండీ మంత్రాలు, హిందూ శ్లోకాలు ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తున్నాయి.
గడచిన రెండు దశాబ్దాల్లో నందిగ్రామ్ అసెంబ్లీకి ఒక్క ముస్లిం మైనారిటీ అభ్యర్థి కూడా లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. ఈసారి నందిగ్రామ్‌నుంచి పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులైన మమతా బెనర్జీ, సువేందు అధికారి, మీనాక్షి ముఖర్జీ... అందరూ మైనారిటీయేతరులే! మైనారిటీల మద్దతు లేకుండానే నందిగ్రామ్‌లో విజయం సాధించాలని అక్కడ పార్టీలు తలపోస్తున్నాయా అన్న ప్రశ్నకు ఆ నియోజకవర్గంలో జనాభా సమీకరణల పేరిట బెంగాలీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లోనే సమాధానం వెదుక్కోవాల్సి ఉంటుంది.